AADIVAVRAM - Others

గర్వం (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులయినా దేవతలయినా అందరం పరమాత్మ సృష్టిలో భాగం. మనం అహంకరిస్తే అది మనకే ప్రమాదం. దీనికి ఎవరూ మినహాయింపు కారు. దేవతలు రాక్షసుల్ని యుద్ధంలో జయించారు. అదంతా తమ ప్రతాపంవల్లనే అని వాళ్లు విర్రవీగారు. అది పరమాత్ముని కృప వల్ల జరిగిందని వాళ్లు అనుకోలేదు. అదంతా స్వయంశక్తి వల్లనే సాధ్యమయిందని, సృష్టిలో తమని మించిన శక్తిసంపన్నులు ఎవరూ లేరని గర్వించారు.
ఒకసారి గర్వం మొదలు కావాలి కానీ దానికి అంతముండదు. దానివల్ల అంధులవుతారు. విచక్షణ కోల్పోతారు.
పరమాత్మ వాళ్ల అహంకారాన్ని పోగొట్టడానికి యక్షుని రూపంలో వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. కానీ ఆ యక్షుడు తమ కోసం వచ్చిన పరమాత్ముడని వాళ్లు తెలుసుకోలేదు. దేవతలు తమలో ఒకడయిన అగ్నితో ‘ఈ యక్షుడెవడో ఎందుకు మన దగ్గరికి వచ్చాడో బోధపడటం లేదు. నువ్వు వెళ్లి అతని వ్యవహారమేదో కనుక్కుని రా!’ అని పంపాడు. అగ్ని యక్షుడి దగ్గరికి వెళ్లాడు.
‘ఎవరు నువ్వు?’ అడిగాడు యక్షుడు.
‘నేను అగ్నిదేవుణ్ని! నన్ను జుతవేదనుడంటారు. ముల్లోకాలలో పేరు గడించిన వాణ్ని’ అన్నాడు.
యక్షుడు ‘ఏమిటి నీ ప్రత్యేకత. నీ శక్తి సామర్థ్యాలు ఎలాంటివి?’ అన్నాడు.
అగ్ని ‘నేను క్షణంలో దేన్నయినా భస్మం చెయ్యగలను. దహించగలను’ అన్నాడు.
యక్షుడు ఒక గడ్డిపోచను అగ్ని ముందు వేసి ‘దీన్ని దహించు’ అన్నాడు. అగ్ని తన శక్తిసామర్థ్యాల్ని ఆ గడ్డిపోచ మీద కేంద్రీకరించినా దాన్ని ఏమీ చెయ్యలేకపోయాడు. అవమానంతో అగ్ని వెనక్కి వెళ్లి దేవతలతో చెప్పాడు. దేవతలు వాయుదేవుడితో ‘నువ్వు వెళ్లి ఆ యక్షుడి పని పట్టు’ అన్నాడు. వాయువు యక్షుడి దగ్గరికి వెళ్లాడు. ‘నేను పర్వతాలనైనా ఎగరగొట్టగలిగే బలసంపన్నుణ్ణి! చరాచర జగత్తంతా నిర్భయంగా సాగుతా’నన్నాడు. యక్షుడు ‘సరే! ఈ గడ్డిపోచను కదిలించు’ అన్నాడు. వాయుదేవుడు ఎంత గింజుకున్నా గడ్డిపోచను అణువంత కూడా కదిలించలేకపోయాడు. అవమానంతో తిరిగి వెళ్లాడు.
దేవతల రాజయిన ఇంద్రుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ‘సరే నేను చూస్తాను’ ఇంద్రుడు యక్షుని దగ్గరకు వెళ్లాడు. యక్షుడు అదృశ్యమయ్యాడు.
యక్షుని స్థానంలో అపూర్వ సౌందర్య రాశియైన స్ర్తి ఉంది. ఆమె ఎవరో కాదు పార్వతీదేవి. ఇంద్రుడు ఆమెకు అభివాదం చేసి ‘అమ్మా! ఇంతక్రితం దేవతల నందర్నీ నిరుత్తరుల్ని చేసిన శక్తివంతుడయిన ఆ యక్షుడెవరు?’ అని అడిగాడు.
దానికి హిమవంతుని కూతురయిన పార్వతి ‘ఇంద్రా! అతను యక్షుడు కాడు. ఆ రూపంలో ప్రత్యక్షమయిన బ్రహ్మ లేదా పరమాత్ముడు. బలహీన మనస్కులయిన దేవతలు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక పోయారు. అందుకనే గుర్తించలేక పోయారు. రాక్షసుల్ని మీరు గెలిచారు. కానీ ఆ శక్తిసామర్త్యాలు మీవే అని అహం చూపారు. పరమాత్మ దయతలచి మీకా శక్తిసామర్థ్యాల్ని ఇచ్చాడన్న సత్యాన్ని గ్రహించలేక అంధులయి అహంకరించారు. పరమాత్మ శక్తిని గ్రహించలేక అంతా తామే సాధించామని గర్వించారు. ఆత్మతత్వాన్ని గ్రహించాలి. అహంకారం అనర్థదాయకం’ అంది.
ఇంద్రుడు పశ్చాత్తాపంతో ప్రణమిల్లాడు.