రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలలో చదివి..మంత్రిని అయ్యాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 25: ప్రభుత్వ పాఠశాలలో చదివి మంత్రిని అయ్యాను అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. ఏవీ కన్‌స్ట్రక్షన్ ఎండీ, టీఆర్‌ఎస్ నాయకులు జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రభుత్వ ఉన్నత హైస్కూల్‌లో విద్యార్థులకు జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, జక్క వెంకట్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, పట్టుదల, క్రమశిక్షణ, ఇష్టంతో చదివి నిర్ణీత రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు. పదోతరగతి వార్షిక పరీక్షలలో నూటికి నూరు శాతం, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలల పని తీరు ఎలా ఉందో గమనించాలని పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు తెలుగు, ఇంగ్లీషులో ఉచిత విద్యను అందిస్తూ, గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, రాజకీయాల్లోకి వచ్చి మంత్రిని అయ్యానని తెలిపారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో వౌలిక వసతుల కల్పనకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పేద విద్యార్థులకు అండగా నిలిచిన ఏవీ కన్‌స్ట్రక్షన్ ఎండీ జక్క వెంకట్ రెడ్డిని అభినందించారు. ఇదే స్పూర్తితో దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పీర్జాదిగూడ హైస్కూల్‌లో ఎంఎల్‌సీ జనార్ధన్ రెడ్డి విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నర్సింహా రెడ్డి, హెడ్ మాస్టర్లు సత్య ప్రసాద్, సుశీల, రామయ్య, టీచర్లు, టీఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి పద్మారెడ్డి, బండి శ్రీరాములు గౌడ్, ఎం.చంద్రా రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, నిర్మల, సవితా రెడ్డి పాల్గొన్నారు.
ట్యాంకర్లు ప్రారంభం
ఏవీ కన్‌స్ట్రక్షన్ ఎండీ జక్క వెంకట్ రెడ్డి తన స్వంత నిధులతో వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేసి పీర్జాదిగూడ పురపాలక సంఘంకు బహుకరించాడు. ట్యాంకర్లను మంగళవారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, పురపాలక సంఘం సూపరింటెండెంట్ సురేష్ రెడ్డి, ఇతర అధికారులు, బిల్‌కలెక్టర్లు పాల్గొన్నారు. మేడిపల్లి ప్రధాన రహదారిలో సాయి కృష్ణా గ్రాండ్ హోటల్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. హోటల్ ఎండీలు యంపల్ల అనంత్ రెడ్డి, అనంత రమేశ్, ఏవీ కన్‌స్ట్రక్షన్ ఎండీ జక్క వెంకట్ రెడ్డి, సింగి రెడ్డి పద్మారెడ్డి పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీటు సాధించిన
ఆటోడ్రైవర్ కూతురు
మేడ్చల్, జూన్ 25: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇటీవల పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించడమే కాకుండా బాసర ట్రిపుల్ ఐటీలో ఉచితంగా సీటు సంపాదించి తన ప్రతిభను చాటి ఎంతో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది ఓ చదువుల తల్లి. మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కూతురు మాదాసు శ్రావ్య పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఇటీవల వెల్లడైన పదోతరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించి కలెక్టర్ చేతులమీదుగా ల్యాప్‌ట్యాప్ కూడా బహుమతిగా అందుకుంది. శ్రావ్య ట్రీపుల్ ఐటీ బాసరలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో ఆరు సంవత్సరాల కోర్సులో ఫ్రీ సీటును సంపాందించింది. శ్రావ్యను సర్పంచ్ చిట్టిమిల్ల గణేశ్‌తో పాటు గ్రామస్థులు అభినందనల్లో ముంచెత్తారు.
భూసార పరీక్షలు చేయించాలి
శామీర్‌పేట, జూన్ 25: భూసార పరీక్షలు నిర్వహించి, భూమిలో దాతులోపం తెలుసుకొని సరైన ఎరువులు వేసి అధిక దిగుబడులు పొందాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని జగన్‌గూడ గ్రామంలో రైతుల పొలాలకు భూసార పరీక్షలను నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఎంవీ రెడ్డి మాట్లాడుతూ రైతులు పొలాలకు భూసార పరీక్షలు తప్పక చేయించాలని భూమిలోని లోపాన్ని తెలుసుకొని దానికి తగ్గ ఎరువును వాడటంతో భూమి సారవంతమై అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. గ్రామంలోని రైతుల పొలాలకు భూసార పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. రైతులు పంటలకు బీమా చేయించుకోవాలని అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టం జరిగితే పరిహారం చెల్లించేందుకు సులువుగా వీలవుతుందని అన్నారు. అనంతారం గ్రామ ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్డీఒను, తహశీల్దార్, ఎంపీడిఓను సమస్యల పట్ల వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఒ లచ్చిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మేరి రేఖ, డీఆర్‌డీఓ కౌటిల్య, డీపీవో రవికుమార్, ఉద్యావన శాఖ అధికారి సత్తార్, తహశీల్దార్లు గోవర్దన్, విష్ణువర్దన్ రెడ్డి, ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.
అందని ద్రాక్షగా పంటల బీమా
షాద్‌నగర్, జూన్ 25: కేంద్ర ప్రభుత్వం అందించే పంటల బీమా పథకం.. రైతులకు అందని ద్రాక్షగా మారింది. ప్రీమియంలు చెల్లించినా పంటలకు నష్టం జరిగినప్పుడు ఎలాంటి పరిహారం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం అభాసుపాలవుతొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు. పంటల బీమా పథకంపై రైతులకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, జిల్లేడు చౌదరిగూడ, కొందుర్గు మండలాల పరిధిలోని చాలామంది రైతులు బీమా ప్రీమియంలు చెల్లించి, నష్టపరిహారం అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కరువు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలను నష్టపోయే రైతులకు బీమా పథకం కింద కొంత లబ్ధి చేకూరుతుందనే లక్ష్యంతో బీమా పథకాలకు రూపకల్పన చేశారు. గడిచిన కొనే్నళ్లుగా బీమా కట్టిన రైతులకు పెద్దగా ప్రయోజనం జరగడం లేదు. ఏదో ఒకరిద్దరికి పరిహారం చెల్లించి ఇన్స్యూరెన్స్ కంపెనీలు చేతులు దులుపుకుంటున్నారు. పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. గతేడాదికి సంబంధించిన పంటల నష్టపరిహారం ఇంకా రైతులకు అందకపోవడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆదుకుంటారనే ఆశతో అన్నదాతలు పంటల బీమా ప్రీమియంను చెల్లిస్తున్నారు. బ్యాంకుల ద్వారా చెల్లించే ఈ ప్రీమియం, బీమా కంపెనీలకు వెళ్తోంది. కానీ, నష్టపోయిన రైతులకు చెల్లించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి సీజన్‌లో వివిధ బ్యాంకుల నుంచి పంటరుణాలు తీసుకునే రైతులకు ముందుగానే బీమా పథకాల కింద ప్రీమియం మినహాయించి మిగతా రుణాన్ని అందజేస్తారు. రుణం తీసుకున్న ప్రతి రైతుకు పంటబీమా ఉన్నట్లే. కానీ, క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ప్రతి ఏడాది షాద్‌నగర్ నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. వీరందరికీ కూడా పంటల బీమా ఉంటుంది. రైతులు ఖరీఫ్, రబీ సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి పంటలు నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ రైతులకు పెద్దగా పరిహారం అందడం లేదు. ఆపద సమయంలో అక్కరకు వస్తుందని నమ్మి పంట బీమా చేసుకుంటే అది కూడా అందని ద్రాక్షగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. బీమా విషయంలో జిల్లా వ్యవసాయ శాఖ, లీడ్ బ్యాంక్ అధికారులు సమన్వయతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, పంటల బీమా విషయంలో వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని, మరోవైపు బీమా విషయంలో రైతులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో రైతులకు తోచినట్లు చేస్తున్నారు. ఒక పంటకు రుణం తీసుకొని, మరో పంట వేస్తున్నారు. దానివల్ల పంట నష్టపోయినా పరిహారం అందడం లేదని, ఏ పంట వేసుకుంటే ఆ పంటలకు రుణం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పంట బీమా పేరుతో రైతుల నుంచి డబ్బులు కట్టించుకుంటున్నారని, పంటలు నష్టపోయినప్పుడు మాత్రం పరిహారం చెల్లించేందుకు ఇన్సురెన్స్ కంపెనీలు మాత్రం ముందుకు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.