డైలీ సీరియల్

పూలకుండీలు - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గల్లీ లీడర్లు నలుగురు ఎంతకీ వాళ్లు ఎదురుచూస్తున్నదేదీ జరక్కపోవడంతో కొంత నిరాశకు లోనైనా వెంటనే తమాయించుకొని మెల్లగా ఎల్లయ్య వాళ్ళను చేరబోయారు.
‘‘అరే ఇందాకటినుండి ఇక్కడ జరుగుతున్న భాగోతమంతా మేం చూస్తూనే వున్నాం భాయ్! ఇంత అన్యాయం మేమెక్కడ సూళ్ళేదంటే నమ్ము. ఆ ఎస్‌ఐగాడు చూడ్డానికి మెత్తగా కన్పిస్తాడు గాని శానా ముదురు నాకొడుకు భాయ్. ఆ హాస్పిటల్ వాళ్ళకు, ఈ పోలీసోళ్ళకూ సంబంధాలుంటాయ్. ఇప్పుడు మిమ్ముల్ని చూపించి ఆ హాస్పిటలోళ్ళకాడ వాళ్ళు మస్తుగ దండుకుంటారు. మీకు ఏదో విధంగా చెవుల్లో పూలుబెట్టి, మీ ఆడోళ్ళను కూడా మీకు సూపెట్టకుంట వట్టి చేతులతోని సల్లగా మిమ్ములను ఇంటికి సాగనంపకపోతే మా పేర్లు తీసి మారుపేర్లు పెట్టుకో’’ ఎల్లయ్య ముఖంలోకే చూస్తూ అన్నాడొకడు.
‘‘ఐనా మీకేం భయలేదులే భాయ్’’ అన్నాడింకొకడు.
‘‘ఔ భాయ్! మేమొచ్చాంగదా! ఇగ మ్యాటరంతా మేం జూసుకుంటాంలే’’ అన్నాడు మరొకడు.
‘‘మీకు న్యాయం జరిగేదాకా మేం నిద్రబోతే ఒట్టు’’ అన్నాడు ఆఖరివాడు.
‘‘ఈ సెంటర్లో మీలాంటి గరీబోల్లకు మా తల్లో ఎంటికలంత మందికి సాయం చేసినం ఎరికేనా?’’ ఆ నలుగురు గల్లీ లీడర్లు మూకుమ్మడిగా తెలుగు టీవీ ఛానెల్స్‌లో యాంకర్ల మాదిరిగా లొడ లొడమని మాట్లాడసాగారు.
ఇంతకూ వాళ్ళెవరో? వాళ్ళు మాట్లాడుతున్నదేంటో? వాళ్ళు చూసుకుంటామనే మ్యాటరేంటో! ఏ మాత్రం అర్థంగాని ఎల్లయ్య వాళ్ళు తెల్ల ముఖాలేసుకొని వాళ్ళ వంక చూడసాగారు.
అదే సమయంలో వాళ్ళను గమనించిన ఎస్‌ఐ ‘‘అమ్మ నా కొడకల్లారా! మీరింకా రాలేదంటబ్బా! అనుకుంటున్నాను. వచ్చేశారా? వస్త్రార్రా ఎందుకు రారు? రోడ్డుమీద ఉత్త పుణ్యానికి డబ్బులు దండుకొనే దందా మూడు కేసులు ఆరు వసూళ్లు అన్నట్టు సాగుతుంటే’’ అనుకుని మళ్ళీ ఎప్పటి మాదిరిగానే గంజాయి మొక్కలా మారిపోతూ ఓ కానిస్టేబుల్ వంక చూసి ‘‘నువ్వెళ్లి ఏదో ఒకటి చెప్పి ఆ ఫోర్‌ట్వంటీగాళ్ళను వాళ్ళ దగ్గరుండి ఎల్లగొట్టిరాపో’’ అంటూ విసురుగా కసురుకున్నాడు.
‘‘వాళ్ళుంటే హాస్పిటల్ వాళ్ళిచ్చేదాంట్లో వీడికొచ్చేది కొంత తగ్గిపోతుందని ఎట్లా చిటపటలాడిపోతున్నాడో చూడు నా కొడుకు’’ అని లోలోపల ఎస్‌ఐని తిట్టుకుంటూ ఎల్లయ్యవాళ్ళవైపు కదిలాడా కానిస్టేబుల్.
‘‘ఏందన్నా! బాసేమంటుండే?’’ అరువుతెచ్చుకున్న ఆప్యాయతను కుండలకొద్దీ గుమ్మరిస్తూ తమ దగ్గరికొచ్చిన కానిస్టేబుల్ని గొంతుల్నిండా ఒక్క పెట్టున పలుకరించారా గల్లీ నాయకులు నలుగురూ.
‘‘ఆ ఏముంది ఎప్పటి బాగోతమే, మిమ్మల్ని వెంటనే ఇక్కనుండి పంపించెయ్యమంటున్నాడు’’ గుంట నక్కల వంక చూసే తోడేలు మాదిరిగా వాళ్ళ వంక చూసి తల పంకిస్తూ గురగరమంటూ బదులిచ్చాడా కానిస్టేబుల్.
‘‘సర్లే వదిలెయ్యన్నా! నువ్వన్నట్టు ఇదంతా మనకు మామూలేగదా? ముందీ ట్రాఫిక్ క్లియర్‌గానియ్యండ్రే! ఆ తరువాత మొత్తం మ్యాటరంతా మనం మనం సెటిల్‌జేసుకుందాం గానీ’’ ఆకులు నాకేవాళ్ళకు మూతులు నాకేవాళ్ళ మాదిరిగా గుడగుడమంటూ బదులిచ్చారు గల్లీ నాయకులు నలుగురూ.
వాళ్ళ సంభాషణంతా వింటూ నిల్చున్న ఎల్లయ్య ‘‘ఇదేందిరా దేవుడా! నా భార్య కన్పించక నేనేడుస్తుంటే పీనిగల మీద పైసలేరుకునేవాల్ల లెక్క మద్దెన వీల్లేంది?! వీల్లల్లో వీల్లు కమ్మిడైపోయి నాకేదో ఎసరుబెట్టేస్తున్నారు. ఇప్పుడేంది తోవ? నేనేం మాట్లాడితే ఏంతంటావో?’’ అనుకుంటూ వణికిపోసాగాడు.
ఆ చౌరస్తా నాలుగుపక్కలా ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి పక్కా గంటన్నరసేపు పట్టింది.
ఫెళఫెళ కాస్తున్న ఎండవల్ల చెమటతో యూనిఫామంతా తడిసి ముద్దైపోయిన ఎస్సై, వాహనాల పొగకు కళ్ళు మండుతుంటే తలమీది క్యాప్ తీసి ఎడమ చేత విసురుకుంటూ ‘‘ఇట్రాండ్రా!’’ అన్నట్టు ఎల్లయ్య వాళ్ళ వంక కుడిచేత్తో సైగ చేశాడు.
ఎస్సై సైగను అందుకున్న ఎల్లయ్య తన వాళ్ళందరినీ తీసుకుని మెల్లగా అతనివైపు అడుగులేశాడు.
‘తోకెమ్మటి నారాయణా!’ అన్నట్టు గల్లీ నాయకులు నలుగురూ ఎల్లయ్యవాళ్ళను అనుసరించారు.
దగ్గరకొచ్చిన నాయకులవంక కొరకొరా చూస్తూ ‘‘ఏమయ్యా! ఇరవై నాలుగ్గంటలు రోడ్డుమీద బలాదూర్ తిరగడం తప్ప మీకింకా వేరే పనే్లం లేవా?’’ అన్నాడు కోపం ఉట్టిపడుతున్న స్వరంతో.
‘‘జనానికి సేవ జేయడమే మా పని గదా సార్! మరి జనం ఉండేది రోడ్లమీదనే గదా సార్! అందుకే మేం పడుకున్నపుడు తప్ప మిగిలిన సమయమంతా జనాన్ని ఎతుక్కుంట రోడ్లమీదనే వుంటాం సార్! దాన్ని మీరు బలాద్దూరే అనుకోండ్రీ! ప్రజాసేవ అనుకోండీ!
మీరేదనుకున్నా మేం మాత్రం రోషానికి రాం సార్!’’ ఎస్సై మాటలను ఏ మాత్రం చెవిని పెట్టకపోగా అది వ్యంగ్యమో వాస్తవమో అర్థంకాకుండా దేభ్యం ముఖాలమీద నవ్వు పులుముకుంటూ మాట్లాడారా గల్లీ నాయకులు నలుగురూ ఒకేసారి.
‘‘మీ ప్రజాసేవేంటో మీరేంటో నెరుగనిదిగాదులే గానీ పదండీ!’’ రాశిలోదే దోశడన్నట్టు నర్మగర్భంగా మాట్లాడాడు ఎస్సై.
ముందు ఎస్సై, ఆ వెనుక అతని బలగం, వాళ్ళ వెనుక లీడర్లు ఆఖరున శ్రావణమాసంలో ముత్యాలమ్మకు బలి ఇవ్వబోయే మేకల గుంపులా ఎల్లయ్య కుటుంబం హాస్పిటల్లోకి దారితీశారు.
అందరినీ తీసుకుని లోపలికెళ్లిన ఎస్సై ఎల్లయ్య వాళ్ళను, లీడర్లను విజిటర్స్ హాల్లో ఓ మూల కూర్చోబెట్టి ‘‘నేను లోపలికెళ్లి హాస్పిటల్ చైర్మన్‌తో మాట్లాడి వస్తానుగాని మీరిక్కడే కూర్చోండి’’ అంటూ లిఫ్ట్ దగ్గరికి నడవసాగాడు.
‘‘సార్! మరి మేం మీరొచ్చిందాకా ఇక్కడే వుండాలా లేకుంటే స్టేషన్‌కి వెళ్లిపోవాలా? నసుగుతూ అడిగాడు కానిస్టేబుళ్ళు.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు