జాతీయ వార్తలు

ఇక ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ శీతాకాల భేటీకి విపక్షాలు సన్నద్ధం
అసహనం, ధరలపై అధికారపక్షాన్ని నిలదీసే వ్యూహం

న్యూఢిల్లీ, నవంబర్ 24: బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపిని మట్టికరిపించి మంచి జోరు మీద ఉన్న ప్రతిపక్షాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, అసహనం వంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే విస్తృత మంతనాలు సాగించారు. ముఖ్యంగా అసహనం, ‘అవార్ట్ వాపసీ’ వంటి అంశాలపై గళమెత్తి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జెడి(యు) భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి మోదీ సర్కారు గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. హిందుస్థాన్ కేవలం హిందువులదేనంటూ అస్సాం గవర్నర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. దీనితో పాటు దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోవడం, ‘లవ్ జిహాద్’, ‘ఘర్ వాపసీ’ వంటి అంశాలను శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించి పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం’ అని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ ‘ట్విట్టర్’లో స్పష్టం చేశారు. అలాగే దేశంలో రిజర్వేషన్లు సరైన స్ఫూర్తితో అమలు జరగడం లేదని ఆయన ఆరోపిస్తూ, ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. వీటితో పాటు దేశంలో పప్పు దినుసులు, వంట నూనెలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని జెడి(యు) నిర్ణయించుకుంది.
1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందిన భారత రాజ్యాంగంతో పాటు రాజ్యాంగ రూపకర్త బిఆర్.అంబేద్కర్‌ను స్మరించుకునేందుకు ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలి రెండు రోజులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన వివిధ అంశాల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టేందుకు ఈ ప్రత్యేక సమావేశం తమకు చక్కగా ఉపకరిస్తుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అసహనంపై చర్చ జరిపేందుకు తాము ఇప్పటికే నోటీసు ఇచ్చామని, దీనిపై 193 నిబంధన కింద చర్చకు అనుమతించాలని, తద్వారా 125వ వార్షికోత్సవం సందర్భంగా తాము రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు వీలవుతుందని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈ అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా తామంతా కలసికట్టుగా చర్చిస్తామని, శాంతి, అభివృద్ధితో పాటు దేశానికి పెట్టుబడులు రావాలంటే మత సహనానికి విఘాతం కలగరాదని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.