AADIVAVRAM - Others

నైరూప్యంలో రంగుల వైభోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెమీ అబ్‌స్ట్రాక్ట్ (అంతగా నైరూప్యం కాని) చిత్రాలు చిత్రించడంలో రమేష్ సుంకోజు కుంచె గుర్తింపు పొందింది. ఆ శైలిలో పరవశించి ప్రకృతి చిత్రాలు గీయడంలో ఆయనకు ఆయనే సాటి. అద్భుత రంగుల మేళవింపుతో కొంచెం నైరూప్యంతో నాణ్యమైన చిత్రాలను ఆయన సృజిస్తున్నారు. ఆయన కాన్వాసుల నిండా రంగుల వైభోగం దర్శనమిస్తుంది. కొన్ని లేత వర్ణాలు, మరికొన్ని ముదురు రంగులతో మధుర భావనలు తట్టి లేపేందుకు తీవ్ర ప్రయత్నం కనిపిస్తుంది.
బ్రహ్మకమలం పేర గీసిన చిత్రంలో కమలం.. మొగ్గలు, కాడలు, నీళ్లు, ఆకులు, అలలు, నీడలు, నింగి నీళ్లలో ప్రతిఫలించిన వైనం ముగ్దమనోహరంగా కనిపిస్తుంది. ఇది పూర్తి వాస్తవిక రూపంలో లేదు... అలాగని పూర్తి నైరూప్యంలో లేదు, తనదైన సెమీ అబ్‌స్ట్రాక్ట్ స్టైల్‌లో ఆయన ఈ బ్రహ్మకమలాన్ని, బ్రహ్మ రూపాన్ని బ్రహ్మాండంగా కాన్వాసుపై పొందుపరిచారు. ఆయన చిత్రాల పరంపరకిదొక ఉదాహరణ మాత్రమే. ఈ రకమైన నేపథ్యంలో వివిధ లేత ఆకృతికి రంగుల్లో తనదైన పద్ధతిలో ప్రకృతిని రసరమ్యంగా, ఈస్థటిక్స్‌కు ప్రాధాన్యత నిస్తూ పదుల సంఖ్యలో బొమ్మలు గీశారు.
ఆయన గీసిన ప్రకృతి చిత్రాలకు ప్రేరణగా నిలిచిన గాలి. నీరు, ప్రవాహ శబ్దంతో తన్మయత్వానికి లోనై సంగీత పరికరాలతో తమదైన లోకంలో విహరించే విజ్ఞులను అంతే నైరూప్యంలో కాన్వాసుపైకి ఎక్కించారు. చాలా సున్నితమైన, సుకుమారమైన ఆ ధ్వనికి మనసు మూర్చనలు పోగా రేఖలు.. రంగులు నాట్యమాడగా రూపుదిద్దుకున్న చిత్రమది. అందులో షెహనాయి ఉంది, తంబూర ఉంది, తబలా ఉంది, ఏక్‌తారా ఉంది... ఇట్లా సమ్మిళిత సంగీతంతో పోటీపడి రంగులను, నీడలను, ఆకారాలను సంగీత పరికరాలతో చిత్రకారుడు ఓ సరికొత్త జుగల్‌బందీకి ప్రాణం పోశారు.
నైరూప్యం, సెమీ నైరూప్యంలోనే గాక వాస్తవవాద దృష్టితో ఆయన మేకల మందను తోలుకెళుతున్న మేకల కాపరిని ల్యాండ్‌స్కేప్ తీరులో చిత్రిక పట్టారు. ఇందులోనూ ప్రకృతి దర్శనమిస్తుంది. అలా ప్రకృతి ఆరాధకుడిగా, సంగీత ప్రేమికుడిగా చిత్రకారుడు తన హృదయాన్ని బొమ్మల్లో పదిలపరిచాడు.
ఈ పారిశ్రామిక యుగంలో ప్రకృతి తన సహజత్వాన్ని క్రమంగా కోల్పోతోంది. ఫ్యాక్టరీల సంఖ్య పెరిగి, పొగగొట్టాల నుంచి ‘విషం’ వెలువడటం, వ్యర్థాల రూపంలోగళం పారడం వల్ల వేడెక్కుతున్న భూగోళాన్ని, ఆ విధ్వంసాన్ని సైతం చిత్రకారుడు తన చిత్రాల్లో చూపించారు. తాను బాల్యం నుంచి ప్రేమిస్తూ వస్తున్న పుడమితల్లి, ప్రకృతి వికృతంగా మారడాన్ని తట్టుకోలేక తన నిరసనను ‘గ్లోబల్ వార్మింగ్’ చిత్రంలో చూపారు. ఈ చిత్రంలో అసంఖ్యాక పొగ గొట్టాలు భూతంలా వెలువడుతున్న పొగ, అందులో ఉక్కిరిబిక్కిరవుతున్న మానవుడు, వాయు కాలుష్యాన్ని పెంచుతున్న వాహనాలు భూగోళం తల్లడిల్లుతున్నదనడానికి చిహ్నంగా ఓ గోళాకార మనిషి... అతని ఆర్తనాదాన్ని ఒక ఫ్రేమ్‌లో ఆయన చూపారు. దీన్నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన మల్టీమీడియాలో డిజిటల్ మాధ్యమంలో ప్రకృతి బొమ్మలు వేసి ముఖ్యంగా పత్రహరితాన్ని, పండిన (బంగారు రంగు) ఆకుల (గోల్డెన్ లీఫ్స్)ను ఘనంగా చిత్రించారు. వీక్షకులు సైతం సహజ ప్రకృతి కనుమరుగైనప్పుడు మల్టీమీడియాలో రూపొందించిన పత్రహరితం, పచ్చని చెట్లు - చేలులే దిక్కు అని సూచనప్రాయంగా చెబుతున్నారు. ఈ ప్రత్యేక ‘కళ’లోనూ ఆయన పట్టు సాధించి పలు రకాల బొమ్మలు గీశారు. గీస్తూ ఉన్నారు. రంగుల కుంచె పైనే గాక కంప్యూటర్ వౌస్‌పై అంతే పట్టుందని చిత్రకారుడు చాటుకున్నారు.
వీటితో పాటు భక్తి పారవశ్యంతో ఆయన అనేక పటాలను ప్రజల ముందుకు తెచ్చారు. అవన్నీ తనదైన దృక్కోణంలో రంగుల్లో దైవ సమర్పితం చేశానంటున్నారాయన.
ఏ చిత్రకారుడి శక్తి, బలం, ఊహా, రేఖా విద్వత్ అయినా అతని పెన్సిల్, స్కెచ్ పెన్నుతో గీసిన బొమ్మల్లో, గీతల్లో బహిర్గతమవుతుంది. ఈ చిత్రకారుడు పెన్సిల్, స్కెచ్ పెన్నుతో మనసు దోచే స్కెచ్‌లు వేశారు. ఆయన పనితనం... శక్తి సామర్థ్యాలు, శైలి, ‘లైన్’లోని లావణ్యం వాటిలో ద్యోతకమవుతుంది. చార్మినార్... అక్కడి పరిసరాలు, మూసీ వంతెన కింద బట్టలు ఉతుక్కునే మహిళలు, గోల్కొండ కోట... అక్కడి సమాధులను అద్భుతంగా కాగితంపైకి సుంకోజు తీసుకొచ్చారు. వాటిని చూస్తే ‘‘కడుపు నిండుతుంది’’. అలాగే పెన్సిల్‌తో వేసిన డ్రాయింగ్స్ జీవన వైవిధ్యాన్ని, చిత్రకారుడి ప్రతిభను, పనితనాన్ని ప్రస్ఫుటంగా తెలుపుతాయి.
వివిధ మాధ్యమాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తూన్న రమేష్ సంకోజు పూర్వపు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపాన గల కొత్తపల్లిలో 1977 జూలై మాసంలో కన్ను తెరిచాడు. కొంతకాలం అక్కడే చదివాడు. అనంతరం దుబ్బాకలో హైస్కూల్ చదువు, సిద్ధిపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. కామారెడ్డిలో, దుబ్బాకలో చదువుతున్నప్పుడే చిత్ర రచన పట్ల ఆసక్తి పెరిగింది. బొగ్గుతో బొమ్మలు గీయడం, నోట్‌పుస్తకాల్లో చిత్రాలు వేయడాన్ని చూసి అధ్యాపకులు, మిత్రులు, బంధువులు మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు మాత్రం పెద్దగా ప్రోత్సహించలేదు. ఉద్యోగానికి పనికొచ్చే ‘విద్య’పై దృష్టి పెట్టాలని కోప్పడిన సందర్భాలూ ఉన్నాయి. అయినప్పటికీ చదువుతో పాటు చిత్ర రచనపై ఆయన మక్కువ పెంచుకున్నాడు. అనంతరం మల్టీమీడియా నేర్చుకుని అందులో బొమ్మలు వేయడంపై పట్టు సాధించారు. కానీ సంతృప్తి కలగక దూరవిద్య ద్వారా కర్ణాటక విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల మైసూర్‌లోని డి.ఎం.ఎస్. లలితా కళా మహా సంస్థాన్ నుంచి 2009 సంవత్సరంలో బి.ఎఫ్.ఏ కోర్సులో చేరి మూడేళ్లలో పూర్తి చేశారు. అనంతరం అక్కడే 2012 సంవత్సరం విజువల్ ఆర్ట్స్ (ఎం.ఎఫ్.ఏతో సమానం)లో చేరి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ఈ కోర్సు తన జీవితాన్ని .. జీవిత విధానాన్ని, దృక్కోణాన్ని మార్చిందని ఆయన అంటున్నారు. భాషతో పాటు, రస జతగూర్చిన నిగూఢ అంశాలు అవగతమయ్యాయంటున్నారు. ఈ సమయంలోనే చిత్రకళకు చెందిన అనేక పుస్తకాల అధ్యయనం చేశానని ఆ రకంగా చిత్ర కళా ప్రపంచం తన కళ్ల ముందు పరచుకుని తనను కౌగిలించుకుందని, ఇక ఆ సుఖమయ రంగుల కౌగిలి నుంచి విడిపడే సమస్యే లేదని, తాను కోరుకున్నది తనకు లభించిందని ఆయన చెప్పారు. ఆ సంకల్పానికి తగ్గట్టు ఇటీవల అమలాపురంలో పురస్కారం అందుకున్నారు.
*
-వుప్పల నరసింహం
9985781799
*
*చిత్రాలు.. రమేష్ సుంకోజు 9666051373