AADIVAVRAM - Others
పచ్చందనమే.. పచ్చదనమే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రకృతి విధ్వంసమంటే చిత్రకారుడు కె.ప్రశాంతాచారికి సుతరాము ఇష్టం లేదు. తన కళ్ల ముందే పచ్చదనం.. పరిసరాలు కాంక్రీటు జంగిల్‌గా మారడం చూసి ఆయన చలించిపోయాడు. దాన్ని అడ్డుకోలేని పరిస్థితి. కనీసం తన వర్ణ చిత్రాల ద్వారా నిరసన వ్యక్తం చేయాలనుకున్నాడు. జరుగుతున్న విధ్వంసాన్ని ప్రపంచానికి తన పరిధిలో ప్రకటించాలనుకున్నాడు. దాని పర్యవసానమే పలు బొమ్మలు కాన్వాసుపై ప్రాణం పోసుకున్నాయి.
పురాణంలో లక్ష్మణుడు యుద్ధంలో స్పృహ కోల్పోతే హనుమంతుడు ఏకంగా ఔషధ గుణాలుగల సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తెచ్చాడని చెప్పుకుంటాం.
మరి ఇప్పుడు ఆ ప్రాణం పోసే ఔషధాలుగల పచ్చని గుట్టలు.. పర్వతాలు కట్టడాలతో, ఆకాశ హర్మ్యాలతో ఎలా కాంక్రీటు జంగిల్ మయమయిందో చిత్రకారుడు ఎంతో సృజనాత్మకంగా తన ‘అర్బనైజేషన్’ చిత్రంలో చూపారు. హనుమంతుడి చేతిలో ఒకప్పుడు సంజీవని పర్వతం.. ఉంటే ప్రస్తుతం ఆ హనుమంతుని చేతిలో కాంక్రీటు కట్టడాల సమూహం, సెల్ టవర్లు తదితరాలు గల గుట్ట దర్శనమిస్తోంది. ప్రకృతి ఏ విధంగా ధ్వంసమై ఔషధ గుణాలు, సకల జీవరాశులతో మానవాళికి ‘సంజీవని’గా నిలిచిన ప్రాంతాలను నాగరికత పేర జరుగుతున్న విధ్వంసం, వినాశనం.. పెరుగుతున్న కాలుష్యాన్ని చిత్రకారుడు ఒకే ఒక చిత్రంలో ఎంతో శక్తిమంతంగా చూపారు. ప్రకృతి పట్ల.. పచ్చదనం పట్ల ఎంతో ఆర్తి ఉంటే తప్ప ఈ పోలిక మనసులో మెదలదు. హనుమంతుని వాయువేగ ప్రయాణానికి లోహ విహంగాల పోటీని సైతం ఆ ‘ఫ్రేమ్’లో చిత్రకారుడు చిత్రించాడు. ఏ రకంగా చూసినా ఈ చిత్రం ఎన్నో ఎనె్నన్నో విధ్వంసాలకు దర్పణం పడుతోంది. దీన్ని ఆయన అక్రలిక్ రంగుల్లో 92 సెం.మీ. ఇంటు 122 సెం.మీ. కాన్వాసుపై సృజించారు. తన ఊహాశక్తికి విశ్వరూపం ఇచ్చారు.
చిత్రకారుడు సమకాలీన సమస్యలపై స్పందించాలని అందరూ అంటారు, కోరుకుంటారు. ప్రశాంతాచారి సైతం ఓ చిన్న ‘వార్త’కు స్పందించి ఓ అద్భుతమైన బొమ్మను గీశారు. సికిందరాబాద్ నగరంలోని ‘ఇస్కాన్’ మందిరంలోని కొంత భాగాన్ని మెట్రో రైలు మార్గం కోసం తీసేసుకుంటారన్న వార్త చదివి ఆయన ఆలోచనలు రేకెత్తించే వర్ణచిత్రాన్ని గీశాడు. ఆ గుళ్లోని శ్రీకృష్ణుడు తన పిల్లనగ్రోవి, పెట్టెబేడా.. మూట ముల్లె సర్దుకుని ఓ మనిషిలాగే రిక్షాలో వెళ్లడం.. నేపథ్యంలో మెట్రో రైలు మార్గం కట్టడం చూపి తనదైన నిరసనను వ్యక్తం చేశారు. పైగా రిక్షాపైభాగాన ఓ నెమలి సైతం బిక్కుబిక్కు మంటూ అగమ్యగోచరంగా చూస్తూ కనిపిస్తోంది. కృష్ణుడు, నెమలి, రిక్షా, రిక్షా లాగే కార్మికుడు, మెట్రో రైలు పిల్లర్లు, నిర్మాణ సామాగ్రి.. అంతా ఒక ఫ్రేమ్‌లో బంధించి చిత్రకారుడు ఆశ్చర్యపరుస్తాడు. చిన్న వార్త.. మనసును కల్లోలపరచగా ఆలోచనల సుడిగుండం కాన్వాసుపై ఆవిష్కారం కావడం అద్భుతంగాక ఏమవుతుంది? ఇది సైతం విధ్వంసంలో అంతర్భాగమని చిత్రకారుడి అభిప్రాయం. హనుమంతుని పరిస్థితి ఓలాగా ఉంటే.. శ్రీకృష్ణుని పరిస్థితి ఇంకోలా మారడాన్ని ఎంతో ప్రతిభావంతంగా, మనసును ఆకట్టుకునేలా రూపొందించాడు.
కంప్యూటర్ భాషలో కంట్రోల్ -ఎస్ (ఆంగ్ల అక్షరం) కొడితే సేవ్ చేయమని ఆజ్ఞాపించడం. ఈ భావనను సైతం చిత్రకారుడు తనదైన శైలిలో ప్రజలకు చెబుతున్నారు. చెట్లు చేమలు, పచ్చదనం, అందమైన జింక, ప్రకృతిని చూపి దానిపై కంట్రోల్ -ఎస్ అక్షరాలను చూపారు. అలాగే మూగవారి భాషలో దానికి సమాన అర్థమైన చేతి సంజ్ఞను సైతం పొందుపరిచారు. చదువుకున్నవారు, మూగవారు అందరూ దయచేసి ప్రొక్లైనర్లతో, జెసీబీలతో భూమి గుండెను విచ్ఛిన్నం చేయకండి అని సూచన చేస్తూ కాన్వాసుపై అక్రలిక్ రంగుల్లో కంట్రోల్ + ఎస్ శీర్షికన బొమ్మ గీశారు. పచ్చదనాన్ని, ప్రకృతిని కాపాడమని చిత్రకారుడు తనదైన మాధ్యమం ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెబుతున్నాడు.
హైదరాబాద్ నగర శివారులో కొద్దో గొప్పో భూములున్నవారు ‘బూమ్’లో తమ భూమిని అమ్మగా వచ్చిన డబ్బును ఏం చేయాలో తెలియక అంతకు ముందు లేని ఆడంబరాలకు, కృత్రిమ జీవనాన్ని అలవాటు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని చిత్రకారుడు ‘హ్యాపీ హవర్’ పేర రంగుల్లో పొందుపరిచారు. అందులో టెడ్డీబేర్‌తో ఆడుకోవడం, జాతి కుక్కపిల్లను పెంచుకోవడం, పొట్టి దుస్తులు వేసుకోవడం, కేశాలంకరణలో పాశ్చాత్య పోకడను ప్రదర్శించడం కనిపిస్తోంది. సహజమైన తమ జీవన శైలిని త్యజించి సినిమాల్లో.. టీవీల్లో చూసిన జీవితాన్ని అనుసరించే కృతకత్వం అందులో కనిపిస్తోంది.
సంకేత రూపంలో విధ్వంసాన్ని మరో చిత్రంలో మరింత శక్తిమంతంగా ఆయన ప్రకటించారు. అదేమిటంటే.. ఓ ఐదు వందల రూపాయల నోటును ‘మిక్చర్ పొట్లం’లా మలిచి, ఆ పొట్లంలో అసంఖ్యాక పుర్రెలను చిత్రించాడు. భయంగొలిపే ఆ రూపం వెనుక ఎంతో తాత్వికత కనిపిస్తోంది. లోతైన అనేక అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఇది కూడా విధ్వంసానికి ప్రతీకగానే చెప్పుకోవాలి.. ఇలా ఒకటా, రెండా.. మానవ వనరుల విధ్వంస విశ్వరూపం ప్రశాంతాచారి బొమ్మల్లో దర్శనమవుతుంది. తానేమో ప్రశాంతాన్ని కోరుకుంటే, లోకం విధ్వంసాన్ని కోరుతోంది. తనకు.. సమాజానికి మధ్య ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సంఘర్షణ ఆయన రంగుల చిత్రాల్లో అగుపిస్తోంది. ఘర్షణ ఉన్నప్పుడే సృజన సారవంతంగా ఉబికి వస్తుందంటారు. ఈ చిత్రకారుడి విషయంలో అదే నిజమైంది.
ప్రశాంతాచారి హైదరాబాద్ సమీపానగల షాద్‌నగర్ పక్కన గల మామిడిపల్లిలో 1990లో జన్మించారు. ఐదవ తరగతి వరకు తన గ్రామంలో చదువుకున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ వరకు షాద్‌నగర్‌లో చదివారు. పాఠశాలలోనే చిత్రలేఖనంపై ఆసక్తి పెరిగింది. ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. జిల్లా స్థాయిలో వివిధ బహుమతులు లభించాయి. అలాగే చిత్రలేఖనంలో పై చదువుల గూర్చిన సమాచారం పాఠశాల ఉపాధ్యాయులే ఇచ్చారు. దాంతో 2007 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బిఎఫ్‌ఏ కోర్సులో చేరి 2011 సంవత్సరంలో పాసయ్యారు. అక్కడ చేసిన సాధన వల్ల అనేకానేక విషయాలు బోధపడ్డాయి. అలా తెలిసిన విషయాలను, ఎంతో కొంత అబ్బిన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు గాను 2012 సంవత్సరంలో మాసాబ్ ట్యాంక్‌లోని జెఎన్‌యులో ఎంఎఫ్‌ఏ కోర్సులో చేరి పెయింటింగ్‌లో స్పెషలైజేషన్ చేశారు. ఆ సమయంలో అధ్యాపకుల బోధన - సూచన, సలహా మేరకు పరిసరాల అధ్యయనం చేయగా ప్రకృతి ‘విధ్వంసం’ గగుర్పొడిచేట్టు కనిపించింది. దాంతో తన కార్యక్షేత్రం ఏమిటో అవగతమై అప్పటి నుంచి ఈ బొమ్మలు గీయడం ప్రారంభించారు. ఈ బొమ్మలను వివిధ గ్రూప్ షోలలో ప్రదర్శించారు. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీల నుంచి బహుమతులు అందుకున్నారు.
ప్రయోగాత్మక రీతిలో క్యూబిజం పద్ధతిలో కొన్ని బొమ్మలు సైతం ఆయన గీశారు. పికాసో అంటే ఎంతో ఇష్టం వల్ల ఆ బొమ్మలు వేశారు. కానీ ఆయన సిగ్నేచర్ శైలి ప్రకృతి విధ్వంసంపై వేసిన అనేక బొమ్మల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన హృదయం అందులో అగుపిస్తోంది. అద్భుత నైపుణ్యం కూడా వాటిలో తొంగి చూస్తోంది. ప్రస్తుతం ప్రశాంతాచారి ఓ గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నారు.
*
కె.ప్రశాంతాచారి 7799550086
*