AADIVAVRAM - Others
చిత్రాలను ‘అల్లే’ బొల్లు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మూడు పదులు నిండిన బొల్లు నరేశ్ విశేష... వినూత్న చిత్రకారుడు. ప్రపంచ చిత్రకళ చరిత్రలో ఓ సరికొత్త ప్రయోగంతో ఆయన రంగుల చిత్రాలను రూపొందిస్తున్నారు. సరికొత్త వ్యక్తీకరణతో తనదైన ప్రత్యేక ‘సిగ్నేచర్ శైలి’లో ఆ బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. ఆ బొమ్మల్ని గీయడం అనడంకన్నా ‘‘నేయడం’’ అంటేనే బాగుంటుంది. ఏ చిత్రకారుడైనా బొమ్మల్ని గీస్తాడు... కాని నరేశ్ అల్లుతాడు... పోగులతో అల్లుతాడు. ఈ ప్రక్రియ వింతగా- వినూత్నంగా అనిపిస్తుంది.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బొల్లు నరేశ్ చేనేత కార్మికుల పని విధానం తెలిసినవాడిగా ఈ ‘ప్రయోగం’ ఆయనకు కొట్టిన పిండిలా అనిపిస్తోంది.
నూలు వడకడాన్ని ఓ ఉద్యమంగా మార్చిన మహాత్మాగాంధీని ఆరాధిస్తూ అతని బొమ్మల్ని తన ప్రత్యేక శైలిలో ‘‘అల్లాడు’’. అదెలాగంటే...
మొదటగా నరేశ్ రెండు కాన్వాసులను ముందుపెట్టుకుంటాడు. వాటిపై ముందు రంగులు చల్లుతాడు. ఒకే తరహాలో రంగులు చల్లినాక సముద్ర ఉప్పు (కళ్లు)ను దానిపై చల్లుతాడు. ఆ రంగులకు చల్లిన ఉప్పు పట్టుకుంటుంది. దాంతో ఓ రసాయనిక చర్య ఏర్పడుతుంది. కొంత సేపయ్యాక నీళ్ళతో రెండు కాన్వాసులను కడిగేస్తాడు. అప్పుడు ఉప్పు రాలిపోయి కాన్వాసుపై ఓ ‘టెక్చర్’ ఏర్పడుతుంది. ఆ రంగుల టెక్చర్‌పై తాను గీయాలనుకున్న గాంధీ బొమ్మ స్కెచ్‌వేసి అనంతరం రంగులతో నింపుతాడు. ఆ రెండు కాన్వాసులపై ఒకే రకమైన బొమ్మల చిత్రణ సంతృప్తికరంగా వచ్చాక పక్కన పెట్టి... ఆరాక స్కేల్, కట్టర్ ఆధారంగా ఒక కాన్వాసును నిలువుగా, మరో కాన్వాసును అడ్డంగా చదరంగంలోని ‘చెక్స్’మాదిరి కట్‌చేస్తాడు. దాంతో రెండు కాన్వాసుల ‘‘పోగులు’’ వేలాడుతూ కనిపిస్తాయి. ఈ దశలోనే నరేశ్ నైపుణ్యం బయటపడుతుంది. అలా వేలాడే పోగులను నవారు మంచం తాడును అల్లిన చందంగా రెండు కాన్వాసుల పోగులను అల్లుతాడు. ఆ అల్లికతో ఒకే గాంధీ బొమ్మ ఆవిష్కృతమవుతుంది. ఓ అద్భుతం కళ్ళముందు కాంతులీనుతుంది. ఆ అల్లిక పూర్తయిందంటే తన ‘‘చిత్రం’’ తుది రూపం దాల్చినట్టే. చివరగా ఆ నేసిన ఆకారాన్ని ఫ్రేమ్‌కు పెట్టి ‘‘స్టాపులర్ గన్’’తో కొడతాడు. ఇప్పుడు ఆ కాన్వాసు సుందరంగా కనిపించడమేగాక గోడకు వేలాడ తీసుకునేందుకు అనువుగా మారిపోతుంది.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి సైజునుబట్టి పది-ఇరవై రోజుల సమయం పడుతుందని బొల్లు నరేశ్ వివరించారు. వాస్తవానికిదొక విప్లవాత్మక ప్రక్రియ. దీన్ని ఆయన ‘‘లీవింగ్ ఆర్ట్’’గా పిలుస్తున్నారు. నేతకు...చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన మహాత్మాగాంధీపైనే నరేశ్ ఎన్నో బొమ్మలు అల్లాడు. ఒక్కో బొమ్మలో ఒక్కో పద్ధతిలో గాంధీ కనిపిస్తారు. పిక్సెల్స్‌లో చిత్రం దాగున్న అనుభూతి కలుగుతుంది. ఆ పిక్సెల్స్ డిజిటల్‌విగాక చేత్తో అల్లడంతో అవి అద్భుతమైన అనుభూతిని పంచుతాయి. ఆకట్టుకుంటాయి. సరికొత్త శైలి కళ్ళముందు నిలుస్తుంది.
ఈ రకమైన చిత్రశైలిలో నరేశ్ లియో డావిన్‌స్కీ గీసిన మోనాలిసా బొమ్మను అల్లాడు. మోనాలిసా బొమ్మపై అనేకానేక పరిశోధనలు జరిగాయి, ఆ నవ్వులో ఏదో ‘మర్మం’దాగున్నదని, అంత గొప్ప చిత్రం ఇంతవరకు ఎవరూ గీయలేకపోయారని విమర్శకులు అంటూ ఉంటారు. ఇప్పుడు నరేశ్ ఆ మార్మికతను మరింత సంక్లిష్టంచేశారు. విమర్శకులిప్పుడు మరోసారి తలలు పట్టుకునేలా అద్భుతంగా అల్లాడు. మోనాలిసాను గీసాడంటేనే ప్రపంచం అబ్బురపడింది. ఇప్పుడు అల్లడమంటే ఇంకెంత ఆశ్చర్య చకితమవుతుంది?... నరేశ్ నైపుణ్యం, ప్రతిభ, ప్రయోగశీలత, రంగుల పొందికను అక్షరాల్లో చెప్పడం సాధ్యంకాదు. ‘‘మిక్స్‌డ్ మీడియా’’లో అల్లిన ఆ బొమ్మకు ఆయన ‘‘లీవింగ్ బ్యూటీ మోనాలీసా’’ నామకరణం చేశారు. బుద్ధుడి బొమ్మను సైతం ఈ తరహాలోనే అల్లాడు. ఆ బోధిసత్వుని సాత్వికతను ఆ అల్లికలో భద్రపరిచాడు.
గాంధీ, మోనాలీసా, బుద్ధ...లాంటి బొమ్మలేగాక నిజజీవితంలో కనిపించే మహిళల బొమ్మలను సైతం ఈ ప్రత్యేక శైలిలో అల్లాడు. అన్నీ ఆణిముత్యాలే! ఆశ్చర్యంతో ‘ఆర్ట్‌లవర్స్’ మనసు మూర్చనలు పోవలసిందే!
ఈ ప్రత్యేక ప్రతిభగల చిత్రకారుడు వరంగల్‌లోని కొత్తవాడ పద్మశాలి కుటుంబంలో 1986లో జన్మించారు. సరైన జీవన ఆధారం లేని చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూశాడు. కడు పేదరికాన్ని అతిదగ్గర ఉండి అనుభవించాడు. ఇంట్లోగాని, పరిసరాల్లోగాని విషాదం...బాధ- దుఃఖం తప్ప మరొకటి కనిపించేది కాదు.
ఈ సమయంలో మంచిర్యాలలోని శ్రీరామ్‌పూర్ సింగరేణి గనుల్లో తండ్రికి ఉద్యోగం రావడంతో నరేశ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడి పాఠశాలలో చదివాడు. స్కూల్‌లోని డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంవల్ల చిత్రలేఖనంపై ఆసక్తి పెరిగింది. 2002 సంవత్సరంలో పదవ తరగతి పాసయ్యాక 2003లో తిరుపతిలోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో సంప్రదాయ చిత్రలేఖనం డిప్లొమాలో చేరాడు. అక్కడ నిష్టతో పంచె కట్టుకుని, బొట్టుపెట్టుకుని క్రమశిక్షణతో సంప్రదాయ (దేవాలయ) చిత్రలేఖన అధ్యయనం చేశాడు. ఆ డిప్లొమా పూర్తయ్యాక ఆధునిక చిత్రకళపై శాస్ర్తియ అవగాహన అవసరమని భావించి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2008లో బి.ఎఫ్.ఏ.లో చేరాడు. అక్కడ అనాటమీ, మోడల్ డ్రాయింగ్, మెమొరీ డ్రాయింగ్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత 2012 సంవత్సరంలో జె.ఎన్.యులో ఎంఎఫ్‌ఎ కోర్సు పూర్తిచేశాడు. ఈ సందర్భంలోనే వ్యక్తిగత సృజన వెలికితీయడంకోసం జరిగిన తపన-కృషి... అభ్యాసం... సాధనలోంచి ఈ సరికొత్త టెక్నిక్(శైలి) ఉబికి వచ్చింది. అప్పటినుంచి నరేశ్ వెనక్కి తిరిగి చూసుకోకుండా చిత్రకళారంగంలో దూసుకుపోతున్నాడు. రాజస్థాన్‌లో అవార్డు లభించింది. అమృత్‌సర్‌లో ప్రదర్శనకు తన బుద్ధుడి చిత్రం ఎంపికైంది.
ఇంకా అనేక ప్రాంతాల్లో జరిగిన గ్రూప్ షోలో నరేశ్ తన వినూత్న చిత్రాలను ప్రదర్శించి మన్ననలు అందుకున్నారు. విమర్శకుల చేత ‘శభాష్’అనిపించుకున్నారు. ఈరోజు (జనవరి 19) అమలాపురంలోని కోనసీమ చిత్రకళాపరిషత్ నుంచి బొల్లు నరేశ్ బంగారు పతకాన్ని అందుకుంటున్నారు. అతని కృషికిది చంద్రునికో ‘‘రంగుల నూలుపోగు’’ లాంటిది.
*
బొల్లు నరేశ్: 9700510101