AADIVAVRAM - Others

అర్థాలే వేరులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లీషులో దగ్గర దగ్గరగా అర్థాలు ఉన్న మాటల జంటలలో ‘వెదర్’(weather),, క్లైమేట్ (Climate) అనేది ఒక జంట. వీటికి సమానార్థకమైన తెలుగు మాటలు గురించి ఆలోచించే ముందు ఈ రెండు మాటల అర్థాలలో పోలికలు, తేడాలు ఏమిటో చూద్దాం. బయట వేడిగా ఉందో, చలిగా ఉందో, వర్షపాతం ఉందో, వాయు వేగం ఎంతో, మేఘచ్ఛాదం ఎంతో వర్ణించి చెప్పడానికి ఈ రెండు మాటలూ వాడతారు. కాని ‘వెదర్’ అన్న మాటని ఒకచోట ఉన్న తాత్కాలిక, తక్షణ పరిస్థితులు - ఉదాహరణకి, గంట గంటకీ వచ్చే మార్పులని కానీ, రోజువారీగా వచ్చే మార్పులని కానీ, వారం వారం వచ్చే మార్పులని గానీ - సూచించడానికి వాడతారు. ‘క్లైమేట్’ అన్నప్పుడు ఒక ప్రదేశంలో దీర్ఘకాల సగటు పరిస్థితులు - అంటే, దశాబ్దాలు, శతాబ్దాల తరబడి ఉండే పరిస్థితులని వర్ణించడానికి వాడతారు. ‘దీర్ఘకాలం’ అంటే కనీసం 30 సంవత్సరాలు ఉండాలని ఒక ఒప్పందం ఉంది.
తెలుగులో మనకి ‘వాతావరణం’ ‘శీతోష్ణస్థితి’ అనే మాటలు ఉన్నాయి. వీటిని కొంచెం నిశితంగా పరిశీలిద్దాం. నిజానికి ‘వాత’ అంటే గాలి అనిన్నీ, ‘ఆవరణం’ అంటే ఆవరించిన ప్రదేశం అనిన్నీ అర్థాలు కనుక వాతావరణం అంటే మన చుట్టు గాలితో ఆవరించి ఉన్న గాలిగోళం. దీనిని ఇంగ్లీషులో ‘ఎట్మొస్ఫియర్’ (atmosphere) అంటారు. ఈ ఇంగ్లీషు మాటకి మూలం లేటిన్ ‘ఆత్మో’. గ్రీకు ‘ఆత్మోస్’లలో ఉంది. వీటికి ఆవిరి (steam), కావిరి లేదా ఊష్మం vapor), వాయువు (gas), అనే అర్థాలు ఉన్నాయి. కనుక ఇంగ్లీషులో ‘ఏట్మొస్ఫియర్’ అన్నా, తెలుగులో వాతావరణం అన్నా ఆ మాట ఒక ఫ్రదేశం (గాలిగోళం) గురించి చెబుతుంది. ఈ ప్రదేశంలో ఉన్న గాలి తక్షణ లేదా తరుణ పరిస్థితిని (acute state) గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లీషులో వెదర్ (తీళ్ఘఆ్దళూ) అన్న మాటని వాడతారు. ఈ ప్రదేశంలో ఉన్న గాలి దీర్ఘ లేదా సదా పరిస్థితిని (chronic state) గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లీషులో క్లైమేట్ (Climate) అన్న మాటని వాడతారు.
జాగ్రత్తగా ఆలోచించి చూస్తే వాతావరణం (లేదా ‘ఏట్మొస్ఫియర్’) అన్న మాట ‘వెదర్’ అన్న ఇంగ్లీషు మాటకి సమానార్థకం కాదని తెలుస్తుంది. కానీ, ‘ఈ రోజు వాతావరణం పొడిగా ఉంటుంది. వాతావరణ కేంద్రంలో’ వంటి ప్రయోగాలలో ‘వెదర్’ అనే అర్థం స్ఫురిస్తోంది కానీ విజ్ఞాన వీధులలో ఈ మాటకి ‘ఒక గ్రహం చుట్టూ గాలితో ఆవరించి ఉన్న ప్రదేశం’ అనే అర్థం. ‘చంద్రుడి మీద వాతావరణం లేదు, అంగారక గ్రహం మీద వాతావరణం చాలా పలచగా ఉంటుంది’ వగైరా ప్రయోగాలు చూడండి. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని, పెద్ద గొడవ చెయ్యకుండా, వాతావరణం అన్న మాటని ‘ఏట్మొస్ఫియర్’ అన్న ఇంగ్లీషు మాటకి సమానార్థకంగా స్థిరపరుద్దాం.
ఇప్పుడు ‘శీతోష్ణస్థితి’ అన్న మాటని తీసుకుందాం. ఇది వాతావరణం యొక్క పరిస్థితిని (state of the atmosphere) వర్ణించే మాట. తరుణకాల శీతోష్ణస్థితి అంటే వెదర్, దీర్ఘకాల శీతోష్ణస్థితి అంటే క్లైమేట్ అని వివరణ చెప్పవచ్చు. ఈ వివరణతో వెదర్, క్లైమేట్ అనే ఇంగ్లీషు మాటల అర్థాలలో తేడాలు సుబోధకం అయి ఉండాలి. కానీ ఈ రెండు మాటలకి సమానార్థకమైన తెలుగు మాటలు ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ముందు ఈ మాటలు ఎక్కడ నుండి వచ్చాయో చూద్దాం. మూలంలో వెదర్ అంటే ‘గాలి’ అని అర్థం. క్లైమేట్ అంటే ‘ప్రాంతం’ అని అర్థం. ‘ఆ ప్రాంతం ఎలా ఉంటుంది?’ అని అడిగినప్పుడు, ‘అక్కడ వర్షాలు ఎక్కువ, అక్కడ పొడిగా ఉంటుంది, అక్కడ చలి ఎక్కువ’ వగైరా సమాధానాలు చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో దీర్ఘకాల పరిస్థితులని చెబుతున్నాం అన్న మాటే కదా. తరుణ కాల పరిస్థితులని చెప్పవలసి వచ్చినప్పుడు, ‘ఇది వర్షాకాలం, ఇప్పుడు అక్కడ వర్షాలు పడతాయి’ అని చెబుతాం.
కనుక ఈ దిగువ మాటలని ఈ కింద చూపిన విధంగా తెలుగు చేస్తే బాగుంటుందంటాను. మీరేమంటారు?
atmosphere వాతావరణం
state of the atmosphere శీతోష్ణస్థితి
weather తరుణావరణం
climate సదావరణం
* * *
దగ్గర దగ్గరగా అర్థాలు ఉన్న కొన్ని ఇంగ్లీషు మాటల మధ్య ఉన్న తేడాలు ఇంగ్లీషు మాతృభాషగా కలవారికే తరచు అర్థం కావు. ఉదాహరణకి జెనెటిక్ (genetic),, కంజెనిటల్ (congenital) అనే మాటలనే తీసుకుంధాం. జెనిటిక్ అంటే జన్యువులకి సంబంధించిన అని అర్థం కనుక జెనిటిక్ డిసీజ్ (genetic disease) అనే మాట జన్యువులకి సంబంధించిన జబ్బు అని అర్థం. మన శరీరాలలో ఉన్న జన్యు సంపద (అనగా డిఎన్‌ఏ) తల్లి నుండి కొంత, తండ్రి నుండి కొంత వస్తుంది కనుక మనకి తల్లిదండ్రుల నుండే కాకుండా పై తరాల నుండి కూడా - అంటే అనువంశికంగా - రోగాలు వచ్చే సావకాశం ఉంది. ఇలా జన్యువులలో ఉండే దోషాల వల్ల వచ్చే రోగాలని జన్యు రోగాలు అని కానీ అనువంశిక రోగాలు అని కానీ అనొచ్చు.
కంజెనిటల్ డిసీజ్ (congenital disease) అంటే ఫుట్టుకతో ఉండే జబ్బు. దీనిని బర్త్ డిఫెక్ట్ ((birth defect)) లేదా ‘పుట్టు రోగం’ అని కూడా అంటారు. పుట్టు రోగాలకి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. 1.పైన చెప్పినటు వంటి జన్యు సంబంధమైన లోపాలు కావచ్చు. 2.జన్యు సంబంధమైన లోపం లేకపోయినా బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు శరీర అవయవాల నిర్మాణంలో కానీ, పని చేసే పద్ధతిలో కానీ లోపం కావచ్చు. వీటిని ఇక్కడ క్లుప్తంగా పరిశీలిద్దాం.
1.పుట్టుకతో వచ్చే లోపాలు పుట్టులోపాలు. గుడ్డితనం, తొర్రి, ఆరో వేలు, హృద్రోగం, ఇలా ఏదయినా సరే పుట్టుకతో వచ్చేది పుట్టు లోపం లేదా పుట్టురోగం లేదా ఆగర్భ రోగం. దీనికి కారణం ఏదయినా కావచ్చు. అనగా ఈ రకం రోగం తల్లిదండ్రుల నుండి పిల్లలకి సంక్రమించి ఉండవచ్చు. అప్పుడు అది జన్యు రోగం లేదా అనువంశిక రోగం (genetic disease) అవుతుంధి. కొన్ని పుట్టురోగాలకి తల్లిదండ్రుల జన్యు పదార్థం కారణం కాదు. తల్లికి పోషణ సరిగ్గా లేకపోయినా, రోగగ్రస్తమైనా, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు ఉన్నా, పర్యావరణంలోని దుష్ప్రభావాల కారణంగా కడుపులో ఉన్న బిడ్డ సరిగ్గా పెరగక వచ్చే రోగాలు కూడా ఆగర్భ రోగాలు; అనువంశిక రోగాలు కావు.
పుట్టుకతో వచ్చే జబ్బులలో కొనే్న జన్యు రోగాల జాతికి చెందుతాయి. మిగిలినవి పుట్టుకతోటే వచ్చిన అవకతవకలు కానీ, పుట్టిన కొద్ది రోజులలో బయటపడ్డ జబ్బులు కానీ అయి ఉంటాయి. ఉదాహరణకి కానుపు విపరీతంగా కష్టమైనప్పుడు బిడ్డకి హాని కలగవచ్చు. దీనివల్ల అవిటితనం రావచ్చు. దీనికి కారణం వారస వాహికలలో (అనగా క్రోమోజోములలో, అనగా డిఎన్‌ఏలో) కనిపించదు. కనుక పుట్టుకతో వచ్చే జబ్బులు చాలామట్టుకు వంశానుగతంగా పిల్లలకి సంక్రమించవు. (ఇక్కడా మినహాయింపులు ఉన్నాయి). ఉదాహరణకి మనందరిలోనూ 23 జతల వారసవాహికలు ఉంటాయి. కానీ డౌన్స్ సిండ్రోము అనే వ్యాధి వచ్చిన వారి శరీరంలోని ప్రతి జీవకణంలోనూ 21వ వారసవాహిక జతతోపాటు మరొకటి ఎక్కువ ఉంటుంది. ఇది గర్భోత్ఫత్తి జరిగే సందర్భంలో జరిగిన ‘ప్రమాదం’ వల్ల కలిగిన వ్యాధి. వంశంలో ఎక్కడా లేకపోయినా ఈ వ్యాధి పిల్లకి రావచ్చు. గర్భవతి అయిన తల్లి తిన్న మందుల ప్రభావం వల్ల కూడా పుట్టుకతో వచ్చే అవిటితనాలు ఉన్నాయి. అందుకనే ఆల్కహాలు వంటి మాదక ద్రవ్యాలు తాగడం, ధూమపానం చెయ్యడం, ముందూ వెనకా చూసుకోకుండా మందులు వేసుకోవడం వంటి పనులు పిల్లలని కనే వయస్సులో ఉన్న ఆడవాళ్లు చెయ్యడం మంచిది కాదు. గర్భవతిగా ఉన్న తల్లికి కొన్ని వ్యాధులు సోకితే (రుబెల్ల వంటి వ్యాధులు) వాటి వల్ల గర్భంలో ఉన్న శిశువుకి హాని కలిగే సావకాశాలు ఉన్నాయి.
2.ప్రతి వ్యక్తి శరీరంలోని కోట్లాదికోట్ల జీవకణాలలో - ప్రతి ఒక్క కణంలో - తల్లిదండ్రుల నుండి సంక్రమించిన వారసవాహికలు ఉంటాయి. ఈ వారస వాహికలనే క్రోమోజోములనిన్నీ, డిఎన్‌ఏ అనిన్నీ కూడా పిలుస్తారు. మానవ శరీరంలోని ప్రతి జీవకణంలోను (చిన్న మినహాయింపు ఉంది) 23 జతల వారస వాహికలు ఉంటాయి. (దీనికీ చిన్న మినహాయింపు ఉంది) ప్రతి జతలోని జన్యు పదార్థంలో కొంత భాగం (సగం అవాలని నిబంధన ఏదీ లేదు) తల్లి నుండ్రి, కొంత భాగం తండ్రి నుండి మనిషికి ప్రాప్తిస్తాయి. ఇలా ప్రాప్తించిన జన్యు పదార్థంలో ఏదైనా లొసుగు ఉంటే దానిని ప్రతివర్తిత mutation)అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే నేను చెబుతూన్న ప్రతివర్తిత (జన్యువులో లొసుగు) రోగికి వంశానుగతంగా సంక్రమించినదే కానీ, రోగి శరీరంలో కొత్తగా పుట్టుకొచ్చినది కాదు. ఇలా తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ప్రతివర్తిత వల్ల ఒక వ్యక్తికి ఏదైనా రోగం వస్తే దానిని జన్యు రోగం అంటారు.
కొన్ని ప్రతివర్తితలు రోగి శరీరంలోనే సంభవించవచ్చు. సర్వసాధారణంగా ఈ ప్రతివర్తితలు పుట్టిన తరువాత జరిగేవి. ఉదాహరణకి కొన్ని రసాయనాల తాకిడి వల్ల కానీ, ఎక్స్ కిరణాల ప్రభావం వల్ల కానీ ప్రతివర్తితలు వచ్చి, ఆ కారణంగా ఒక వ్యక్తికి కేన్సర్ రావచ్చు. అంటే ఆ వ్యక్తి శరీరంలోని ఏదో ఒక జీవ కణంలో - కారణాంతరాల వల్ల - ఒక ప్రతివర్తిత వచ్చి, ఆ కారణంగా ఆ జీవకణం అదుపు లేకుండా పునరోత్పత్తి చెందినప్పుడు దానిని కేన్సర్ అంటాం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే శరీరంలో దెబ్బతిన్న ఒక కణం మితిమీరి పిల్లలని పెట్టినప్పుడు ఆ తల్లి కణం, ఆ పిల్ల కణాలలోనే ఈ ప్రతివర్తిత కనిపిస్తుంది; మిగిలిన సాధారణ కణాలలో కనిపించదు. కేన్సర్ విషయంలో అయితే వారస వాహికలలో వచ్చే ప్రతివర్తితలు - దరిదాపుగా అన్నీ - పుట్టుక తరువాత సంభవించేవే కానీ, తల్లిదండ్రుల నుండి సంక్రమించేవి కావు. (ఇక్కడ కూడా మినహాయింపులు ఉన్నాయి; ఆడవారి వక్షోజాలకి వచ్చే కేన్సర్‌లు, 5-10 శాతం వరకు, జన్యు సంబంధిత కేన్సర్లు అని రుజువు చేసేరు.)

-వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా