AADIVAVRAM - Others

పంతులమ్మ ‘రంగుల’ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకళలో లైన్ (గీత) ఎలా ఉండాలి? రంగులు ఎలా వాడాలి?.. అన్న చిత్రకళలో విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే ఆ విషయాన్ని ఇతరులకు బోధించేందుకు అవకాశముంది. హైదరాబాద్ నగరానికి చెందిన బిలుక నిర్మల ఆ పని చేస్తున్నారు. మూడు పదుల వయసు కూడా నిండని నిర్మల చిత్రకళపై తనదైన రీతిలో సాధికారత సాధించి ఇప్పుడు చిత్రకళా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అలాగే తన మనోభావాల కనుగుణంగా బొమ్మలూ చిత్రిస్తున్నారు.
ఈ తీవ్రమైన కృషికి ప్రతిఫలంగా ఆమె ఇప్పుడు రెండు వారాల కోసం యూరప్‌లోని లిథివేనియాకు వెళ్లారు. భారతదేశం నుంచి అక్కడికి వెళ్లిన ఇద్దరు చిత్రకారుల్లో ఆమె ఒకరు. ఆర్ట్ రెసిడెన్సీ (చిత్రకారుల ఆదాన ప్రదానం) కార్యక్రమంలో భాగంగా నిర్మల అక్కడికెళ్లారు. ఒక దేశం నుంచి ఇలా ఆహ్వానం అందుకోవడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
ముప్పై ఏళ్లు దాటని నిర్మల సాధించిన ఆ ఘటన వెనుక ఎంతో పరిశ్రమ కనిపిస్తోంది. చిత్రకళ పట్ల అంకితభావం దర్శనమిస్తోంది. కష్టపడే తత్వం వెల్లడవుతోంది. తనలోని భావాలను రంగులు రేఖల్లో బంధించాలన్న తపన కనిపిస్తోంది. ఈ గుణం లక్షణం చిత్రకారులకు ఎంతో ముఖ్యమని గుర్తించి ఆ దారిలో నడుస్తున్న నిర్మలకు ఆ అవకాశం దక్కింది. హైదరాబాద్ చిత్రకారులు ఈ పరిణామం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బిలుక నిర్మల 1980లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి బి.ప్రభాకర్ బ్యాంకు ఉద్యోగి, అంతేగాక అతనికి చిత్రకళపై, ఫొటోగ్రఫీపై అమితమైన ఆసక్తి. దాంతో ఆయనకు ఎందరో చిత్రకారులతో, సృజనకారులతో, సామాజిక కార్యకర్తలతో పరిచయాలు ఉండేవి. దాంతో వారి ఇల్లు లలిత కళలకు, ముఖ్యంగా చిత్రలేఖనంతో ముడిపడింది. ఆ ప్రభావం సహజంగానే బాల్యంలో నిర్మలపై పడింది. దాంతో తాను ‘వెంటనే’ చిత్రకారిణి అయిపోవాలని ఉబలాటపడింది. ఆ ఉబలాటమే ఆమెను ముందుకు నడిపింది. తన నాన్న తీసే ఫొటోలను నకలు చేస్తూ కాగితాలను ‘ఖరాబు’ చేయడం అలవాటైంది. అనంతరం నాంపల్లిలోని జవహర్ బాలభవన్‌లో చిత్రలేఖన పాఠాలు నేర్చుకుంది. ఆ పట్టుదలతో వివిధ పోటీలలో పాల్గొన్నది. బహుమతులు వచ్చినా, రాకున్నా బొమ్మలు గీయడం మానలేదు. ఈ తత్వమే ఆమెకు కలిసొచ్చింది. చివరకది 1998లో జెఎన్‌టియులో బిఎఫ్‌ఏలో చేరేలా చేసింది. అక్కడ తన బాల్యచేష్టలన్నీ పటాపంచలయ్యాయి. చిత్రరచన ఎంత ‘సీరియస్’ సబ్జెక్టో తెలిసొచ్చింది. దాని వెనక ఎంత తపస్సు దాగి ఉంటుందో లీలగా బోధపడింది. చిత్రరచన వెనుక సముద్రమంతటి సబ్జెక్ట్ దాగుందని తెలిసింది. మేథోపథనం చేస్తే తప్పమేలు రకం బొమ్మలు కాన్వాసుపైకి, కాగితంపైకి రావని అవగతమైంది.
బాల్యంలోనే చిత్రకారిణిని కావాలని తీర్మానించుకున్న నిర్మలకు ఈ సవాళ్లు సవాళ్లుగా గాక మామూలు మెట్లుగా అనిపించింది. అవలీలగా అధిరోహిస్తానన్న ధైర్యంతో అడుగు ముందుకేసింది.
తొలుత పాత విషయాలన్నీ మరిచిపోయి కొత్తగా స్కెచ్‌లు ఎక్కువ వేసేలా అధ్యాపకులు అభ్యాసం చేయించారు. దాంతో శక్తిమంతమైన లైన్ (గీత) గీసేందుకు ఆ ప్రాక్టీస్ దోహదపడింది. ఆ సాధన అభ్యాసం, కఠోర శ్రమ కారణంగానే వర్తమానంలో తన విద్యార్థులకు లైన్ (గీత) గూర్చి ‘గీతోపదేశం’ చేయగలుగుతున్నారు. అలాగే ఆ రోజుల్లో లాండ్‌స్కేప్స్ గీసేందుకు తరచూ టూర్లకు తీసుకెళ్లేవాళ్లు. అలా బహిరంగ ప్రదేశాల్లో (ఔట్‌డోర్) బొమ్మలు గీసేవాళ్లు ఆ అభ్యాసంతోపాటు ఇతర ప్రాథమిక అంశాలు, రంగుల రహస్యాలు, ప్రింట్ మేకింగ్ మెలకువలు ఇలా ఒకటా రెండా.. అనేక సెమిస్టర్లలో చిత్రకళా మాధ్యమంలోని ప్రాథమికాంశాలపై సశాస్ర్తియ అవగాహనను కళాశాల అందించింది. అలా తాను జీర్ణించుకున్న సబ్జెక్ట్‌కు మరి కొంత విలువ (వాల్యూ)ను జతపరిచి ఆమె ఇప్పుడు బిఎఫ్‌ఏ ఎంఎఫ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. తానెక్కడ బిఎఫ్‌ఏ చేశారో అక్కడే వర్ధమాన చిత్రకారులైన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఏ తరగతి గదిలో తాను నేర్చుకున్నదో అక్కడే కొత్త తరానికి ‘ఆర్ట్ హిస్టరీ’ని చెబుతున్నారు. రంగుల రహస్యాలను వివరిస్తున్నారు. ఇది గర్వించదగ్గ అంశమే కదా?
అయితే ఈ నేర్పును, నైపుణ్యాన్ని సంపాదించేందుకు ఆమె బరోడాలోని ఎం.ఎస్. యూనివర్సిటీ నుంచి పెయింటింగ్‌లో ఎంఎఫ్‌ఏ చేశారు. బరోడా అంటే భారతీయ చిత్రకారులకు ‘మక్కా’ లాంటిది. అలాంటి చోట ఆమె పది సంవత్సరాలు గడిపారు. అక్కడ మరో ప్రపంచం.. రంగుల ప్రపంచం ద్వారాలు తెరుచుకున్నాయి. స్వేచ్ఛ, సృజన, చిత్రరచన ఇవి మూడూ ఒకే ‘సూత్రం’లో బంధించినప్పుడే విలువైన సారాంశం వెలుగు చూస్తుందని ఆమెకు తెలిసొచ్చింది.
కె.జి.సుబ్రహ్మణ్యం, బాలకృష్ణమాచారి లాంటి దిగ్గజాలైన ఆచార్యులను ప్రత్యక్షంగా చూడ్డం, వారితో కొన్ని క్షణాలైనా ముచ్చటించడం జీవితకాలపు అనుభవం. అలాంటి ఎన్నో అనుభవాలు ఆమె సొంతం చేసుకున్నారు. చిత్రర రచనలో తాదాత్మ్యం కోసం అక్కడే అసంఖ్యాకంగా ఉండే ‘స్టూడియో’లలో ఆమె కొన్ని వసంతాలు గడిపింది.
దేశం నలుమూలల నుంచి తనలాంటి ఎందరో ఉత్సాహవంతులు అక్కడ కనిపించారు. వారి చిత్రరచనా విధానం, పనితీరును పరిశీలించింది. హిమాలయాల్లో సాధకులు తపస్సు చేస్తున్నట్టుగా చిత్రకారులు తమ తమ స్టూడియోలకు అంకితమై తమలోని సృజనకు ఓ రూపం ఇచ్చేందుకు ఏకాగ్రతతో పనిచేసే వైనం ఆమెకు ఎంతో నచ్చింది. ఆ వాతావరణానే్న తాను కోరుకుంది. అదే కళ్ల ముందు కనిపిస్తోంది. దాంతో మరింత ఉత్సాహంగా తనదైన ‘శైలి’లో బొమ్మలు గీయసాగింది. 2005 సం.లో ఎంఎఫ్‌ఏ పూర్తయ్యాక మరిన్ని కొత్త బొమ్మలు గీసి 2007 సం.లో నిర్మల తన తొలి ‘సోలో షో’ను ముంబాయిలో నిర్వహించారు. దాని శీర్షిక పేరు ‘సిగ్నల్స్’. ఇందులో ట్రాఫిక్ సిగ్నల్స్‌తోపాటు మూగ భాష.. సంజ్ఞల ద్వారా (సిగ్నల్స్) తెలుసుకునే సరికొత్త ప్రయోగంతో బొమ్మలు ప్రదర్శించి పలువురి మన్ననలు అందుకున్నారు. వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్‌ను ప్రదర్శించి తన ప్రతిభను చాటుకున్నారు. తన జీవితంలో అదొక పెద్ద మలుపు. ప్రతి చిత్రకారుడికి తొలి చిత్రకళా ప్రదర్శన తీయటి అనుభూతిని కలిగిస్తుంది. నిర్మలకు సైతం అదే అనుభూతిని మిగిల్చింది. అమెరికాలోనూ ఓ సోలో షో నిర్వహించారు. ఆ తరువాత అసంఖ్యాక గ్రూపు షోలలో తన బొమ్మలను ప్రదర్శించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ శీర్షికతో ఆమె గీసిన చిత్రాలు చెప్పుకోదగ్గవి. ఇందులో భారతదేశ ప్రముఖ ప్రాంతాలతోపాటు సంస్కృతి, వారసత్వ కట్టడాలు కనిపిస్తాయి అయితే అవన్నీ ఓ స్ర్తిమూర్తి నేపథ్యంలో కనిపిస్తాయి. ఆ బొమ్మల నేపథ్యంలో ‘యెల్లో ఆక్రే’ రంగు కనిపిస్తుంది. ఆయిల్, వాటర్ కలర్స్‌తో ఆమె కాన్వాస్‌పై, కాగితంపై అనేక బొమ్మలు గీశారు. స్ర్తివాద ఆలోచనలుగల నిర్మల పౌరాణిక స్ర్తిమూర్తుల పక్షాన నిలబడి ఆలోచనలు చేస్తూ కొన్ని చిత్రాలను చిత్రించారు. అందులో ‘సీత’కు సంబంధించిన పలు చిత్రాలున్నాయి. ‘శక్తి’ సిరీస్‌లో ఆమె ఎన్నో పురాణ స్ర్తిల చిత్రణ చేశారు. తనదైన ఈ శైలి ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. దశాబ్దం తరువాత నిర్మల బరోడా నుంచి హైదరాబాద్‌కు (2012 సం.లో) తిరిగొచ్చి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం (ఇఎఫ్‌ఎల్‌యు)లో పిహెచ్.డి చేశారు. ఫిలిం విజువల్ సంస్కృతి విభాగంలో ఈ పరిశోధన జరిగింది. తెలంగాణ గ్రామ దేవతల రూపాలు, రంగులు పరిణామాలపై ఈ పరిశోధన కొనసాగింది. ఇతర రాష్ట్రాలలోని గ్రామ దేవతల తులనాత్మక అధ్యయనం చేశారు. ఇదంతా తిరిగి ఫెమినిజం ఛాయల్లో వర్తమాన ఆలోచనల నేపథ్యంలో కొనసాగింది. అమ్మోరు, సమ్మక్క సారక్క తెలుగు చలనచిత్రాలపై కొంత చర్చ చేశారు. ఇదంతా ‘విజువల్ కల్చర్’లో అంతర్భాగమని, ఆ విధంగా అది చిత్రకళ గర్భస్థ అంశమని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రయాణమంతా తనకెంతో అనుభవాన్ని ఇచ్చిందని, మూలాలను అర్థం చేసుకునేందుకు అవకాశం లభించిందని ఆమె చెప్పారు. వివిధ సెమినార్లలో పత్రాలు సమర్పించడం, ఉపన్యాసాలు చేయడం, క్యూరేటర్‌గా ఉండటం, క్యాంపుల్లో పాల్గొనడం ఈ అనుభవ సారమంతా రంగరించి, ప్రస్తుతం బిఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
అంతేగాక ప్రస్తుతం గిరిజన తెగల చిత్రకళలోని మోటిఫ్స్, డిజైన్, కలర్‌స్కీంలను తన లైన్‌కు అన్వయించుకుని చిన్న సైజు కాన్వాసులపై చిత్రాలను వేస్తున్నారు. వీటిలో ప్రకృతితోపాటు మహిళలను చిత్రీకరిస్తున్నారు. దశాబ్దం క్రితం బరోడాలో గీసిన బొమ్మలకు వర్తమానంలో గీస్తున్న ఈ ‘్ఫక్ ఆర్ట్’ శైలి బొమ్మలకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకే దగ్గర ఆగిపోరాదని చిత్రకారుల మాట. తదనుగుణంగానే ఆమె చిత్రకళా ప్రస్థానం ఇలా కొనసాగుతోంది. ఈ సరికొత్త రంగుల రేఖల శైలీ, సొగసులను ఇతర చిత్రకారుల బొమ్మలతోపాటు ‘చెన్నై’లో ప్రదర్శనకు పెట్టారు. ఇటు స్వదేశంలో, అటు విదేశం (లిథివేనియా)లోనూ ఆమె తన సృజన, ప్రతిభ, పనితనం ప్రదర్శించడంతో ఎలాగైనా తాను చిత్రకారిణిని కావాలన్న బాల్యంలోని ‘కల’ సాకారమైంది. జీవితంలో కల నెరవేరడానికి మించింది ఏముంటుంది? అదీ ముప్పై ఏళ్ల వయసులో!...
బిలుక నిర్మల 77020 43739

-వుప్పల నరసింహం 99857 81799