AADIVAVRAM - Others

అనుభవాల చిత్రిక...బాలల పత్రిక (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకూ భావోద్వేగాలుంటాయి. వారు కూడా తమ భావాలను వ్యక్తీకరించాలని, తమలోని మానసిక ఎత్తుపల్లాలను బహిర్గతం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజం చెప్పాలంటే పిల్లల ప్రపంచమే వేరు. అది పెద్దల ప్రపంచం కంటే భిన్నమైనది. అందమైనది. మాటలతో వర్ణించడానికి అతీతమైనది. పిల్లలు తమ గురించి తాము చర్చించుకోవడానికి, ఒకరి అభిరుచులను మరొకరికి చెప్పుకోవడానికి ఇప్పటి వరకు సరైన వేదికంటూ లేదనే చెప్పుకోవాలి. మన దేశ జనాభాలో 39 శాతం మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న బాలల వికాసానికి చక్కటి కాన్వాస్ లేదు. ఆ లోటును భర్తీ చేయడానికి అన్నట్లు 2002లో చేతనా అనే ఛారిటబుల్ ట్రస్టు కేవలం బాలల కోసమే ఒక చిరు పత్రికను మొదలుపెట్టింది. తొలుత కేవలం రెండు పేజీల్లోనే ఈ సంచికను ముద్రించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా ముప్ఫై అయిదు మంది వీధి బాలలను ఆ సంస్థ సభ్యులుగా చేర్చుకుని వారి అనుభవాలను, వారి కలలు, ఆకాంక్షలను ఆ పత్రికలో రాసింది. ‘బడ్‌తే కదం’ పేరిట వీధి బాలల కోసం ప్రత్యేక శీర్షిక నిర్వహించడం మొదలుపెట్టారు. పనె్నండు నుండి ఇరవై సంవత్సరాల వారు ఈ పత్రిక నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. రొటీన్‌గా వస్తున్న పత్రికల్లా కాకుండా పిల్లల దీనగాథలు, వారి కష్టాలు, వారి మనోగతం ప్రతిబింబించేలా వివిధ శీర్షికలతో వెలువడే ఈ పత్రికకు ‘బాలక్‌నామా’ అని నామకరణం చేశారు. ఈ పత్రిక వెలువడడం మొదలైన కొద్ది కాలంలోనే చక్కటి ఆదరణ చూరగొంది. దాంతో ఇది తొలుత రెండు, తర్వాత నాలుగు, అటు తర్వాత ఎనిమిది పేజీలకు చేరుకుని ఇప్పుడు పదహారు పేజీలతో సంపూర్ణంగా ముద్రితమవుతోంది. మన దేశం నుండి వెలువడే వీధి బాలలకు చెందిన ఒకే ఒక్క మాసపత్రిక బాలక్‌నామ. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఈ పత్రికను తమదిగా భావించి దీనికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించడం మొదలుపెట్టిన తర్వాత బాలక్‌నామ ఇప్పుడు విజయవిహారం చేస్తూ దూసుకుపోతోంది. నెలకి ఎనిమిది వేల కాపీల వరకు ప్రింటయ్యే ఈ పత్రికకి పోలీసులు, ఎన్‌జీవోలు, స్వచ్ఛంద సంస్థలు, పబ్లిక్‌లో చాలా మంది చందాదారులుగా ఉండడం విశేషం. అనాథలైన బాలలు, తల్లిదండ్రులు లేకుండా వీధిబాలలుగా మారిన చిన్నారులు, పలు విధాలుగా బాధలు పడుతున్న పిల్లల కథలు ఇందులో వరుసగా ప్రచురిస్తున్నారు. దీనికి పద్దెనిమిది సంవత్సరాల బాలుడు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. పనె్నండు నుండి పద్దెనిమిది సంవత్సరాల బాలలు తమ చదువు పూర్తయిన తర్వాత సాయంత్రాల పూట దీనికి రిపోర్టర్లుగా పని చేస్తున్నారు. రేపటి ఆశాకిరణాలు బాలల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న ఈ పత్రిక ఉన్నతికి పెద్ద మనసు కలిగిన వారంతా తమ వంతు సాయమందిస్తున్నారు. బాలక్‌నామలో పని చేసే పిల్లలు, దానిని చదివే పిల్లలు ఆ విలువైన సమాచారాన్ని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మంచి మనసుతో, మంచి వైపు సూటిగా పయనించే సదాశయంతో ఏ పని ప్రారంభించినా దానికి నలుగురూ సహకరిస్తారని, అది లక్ష్యాన్ని సునాయాశంగా చేరుకుంటుందని పిల్లలు నడిపే ‘బాలక్‌నామ’ నిరూపించింది.

- దుర్గాప్రసాద్ సర్కార్