AADIVAVRAM - Others

రామాయణం.. 47 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిదాసు కథని మొదలుపెట్టే ముందు చెప్పాడు.
‘రామాయణం మీద మీకు గల ఆసక్తికి సంతోషం. నిన్న అయోధ్య కాండ 21వ సర్గ దాకా చెప్పాను. ఇవాళ 23 సర్గ దాకా చెప్తాను’
తర్వాత గట్టి మనసు గల రాముడు ధైర్యంగా తన మనోభావాలని అణచుకుని, మానసిక దుఃఖం వల్ల దీనుడు, బాగా కోపం వచ్చి నాగుపాములా బుసకొట్టే వాడు, మంచి మనసు గలవాడు, కోపంతో కళ్లు పెద్దవైన ప్రియ తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాడు.
‘నువ్వు రోషాన్ని, శోకాన్ని విడిచిపెట్టు. ఈ అవమానాన్ని లెక్క చేయకుండా, కేవలం ధైర్యాన్ని ఆశ్రయించి గొప్ప ఆనందాన్ని పొందు. ఈనాడు నా అభిషేకం కోసం చేసిందంతా విడిచిపెట్టి వెంటనే హాని లేని పని చెయ్యి. నా రాజ్యాభిషేకం కోసం కావాల్సిన సంబారాలని తెచ్చేందుకు చూపించిన ఉత్సాహాన్ని అభిషేకం జరక్కుండా ఉండటంలో చూపించు. నాకు అభిషేకం జరుగుతుందని మనసులో బాధపడే కైకేయికి ఎలాంటి అనుమానం కలగకుండా ప్రవర్తించు. ఆమె మనసులో అనుమానం వల్ల విచారం క్షణమైనా కలగడం నేను అంగీకరించను. నాకు తెలిసి కాని, తెలీక కాని ఎన్నడూ తల్లులకి కాని, తండ్రికి కాని కొంచెమైనా ఇష్టం లేని పని చేసినట్లు నాకు గుర్తులేదు.
‘నిజమే మాట్లాడేవాడు, నిజమైన పరాక్రమం కలవాడు, పరలోక భయం కలవాడు ఐన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యమగుగాక! ఆయనకి ఎలాంటి భయం లేకుండా ఉండాలి. ఈ పట్ట్భాషేకం మానకపోతే నా మాట అబద్ధమైంది కదా అని మన తండ్రికి మనస్థాపం కలుగుతుంది. దాంతో నాకు బాధ కలుగుతుంది. లక్ష్మణా! ఇందువల్ల అభిషేకాన్ని నిలిపేసి నేను వెంటనే, ఇక్కడ నించే అడవికి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను అరణ్యానికి వెళ్తేనే కైకేయికి మనశ్శాంతి. ఇప్పుడు నేను అడవికి వెళ్లగానే కైకేయి పని పూరె్తైన దానిలా నిర్భయంగా తన కొడుక్కి రాజ్యాభిషేకాన్ని చేయిస్తుంది. మనసు గట్టి పరచుకుని ఈ నిర్ణయం తీసుకున్న మన తండ్రికి బాధ కలిగించడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే వెంటనే అడవికి వెళ్తాను.
‘ఇచ్చిన రాజ్యాన్ని వెనక్కి తీసుకుని నన్ను అడవికి పంపడానికి కారణం దైవమే అని తెలుసుకో. దైవమే కైకేయికి ఈ ఆలోచన కలిగించకపోతే నాకు బాధ కలిగించాలనే బుద్ధి ఎలా పుడుతుంది? గతంలో ఎప్పుడూ నాకు తల్లుల విషయంలో భేద బుద్ధి లేదని, అలాగే కైకేయికి నా మీద కాని, తన కొడుకైన భరతుడి మీద కాని ఎలాంటి భేద బుద్ధీ లేదని నీకు తెలుసు కదా? కైకేయి నా అభిషేకాన్ని నిలిపేయమని, నన్ను ప్రవాసానికి పంపమని పలకకూడని ఆ కోపపు మాటలు పలికిందంటే దానికి దైవం తప్ప మరో కారణం ఏదీ నాకు కనిపించడంలేదు. ఇందుకు దైవమే కారణం కాకపోతే రాజవంశంలో పుట్టిన, ఉత్తమ స్వభావం కల కైకేయి ఒక సామాన్య స్ర్తిలా తన భర్తకి బాధ కలిగించే మాటలు మాట్లాడగలదా?
‘దైవ ప్రభావం ఊహించ శక్యం కానిది. ఏ ప్రాణుల్లోనూ దాని ప్రభావాన్ని అడ్డుకునేవారు లేరు. ఇప్పుడు నా విషయంలోను, కైకేయి విషయంలోను దైవ వైపరీత్యం వచ్చి పడిందన్నది స్పష్టం. దైవం నడిపించేట్లు నడవడం తప్ప దాన్ని ఎదిరించే ఉపాయం ఏదీ లేదు. అలాంటి దైవాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. సుఖ దుఃఖాలు, భయం, కోపం, లాభనష్టాలు, జనన మరణాలు.. ఇవన్నీ దైవచేష్టలే. ఉగ్రమైన తపస్సు చేసే ఋషులు కూడా దైవపీడితులై తీవ్రమైన నియమాలని వదిలి కామక్రోధాలతో భ్రష్టులు అవుతున్నారు. ప్రారంభించిన పనికి అడ్డుగా, ఊహించని విధంగా, అకస్మాత్తుగా ఏదైనా వచ్చి పడితే అది దైవం వల్ల కలిగిందే. నా అభిషేకానికి ఆటంకం వచ్చినా, ఈ యదార్థ బుద్ధితో నన్ను నేను నిగ్రహించుకోవడంతో మనసులో నాకు విచారం లేదు.
‘అందువల్ల నువ్వు కూడా నాలానే విచారాన్ని వదిలి వెంటనే అభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ ఆపేయ్. అందుకు ఏర్పాటు చేసిన ఈ కుండల్లోని నీళ్లతోనే నేను తపోవ్రతం ఆచరించడానికి వ్రత స్నానం చేస్తాను. లేదా రాజు సొతె్తైన ఈ కుండల్లోని నీళ్లు నాకెందుకు? నేనే స్వయంగా తోడుకున్న నీళ్లతో వ్రత స్నానం చేయగలను. లక్ష్మణా! చంచలమైన లక్ష్మి గురించి బాధపడకు. రాజ్యమా? వనవాసమా? అంటే వనవాసమే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దైవ ప్రేరణతో ఇలా ఇష్టం లేని మాటలని మాట్లాడుతోంది. దైవానికి ఎంతటి ప్రభావం ఉందో నీకు తెలుసు కదా?’ (అయోధ్యకాండ సర్గ 23)
ఇలా రాముడు మాట్లాడిన మాటలు విన్న లక్ష్మణుడు తల వంచి, మనసులో మాటిమాటికీ విచారం, సంతోషం కలిగినట్లుగా కనుబొమ్మలని మడిచి, బిలంలోని పగ పట్టిన పాములా నిట్టూర్పులు విడిచాడు. చూడ్డానికి భయం కలిగించేలా ఉన్న అతని మొహం కోపించిన సింహం మొహంలా కనిపించింది. చేతులని ఏనుగు తొండంలా కదిలిస్తూ, తలని అడ్డంగా తిప్పుతూ, కొనకంటితో రాముడ్ని చూస్తూ ఈ విధంగా చెప్పాడు.
‘పరాక్రమవంతులైన క్షత్రియుల్లో గొప్పవాడా! తండ్రి మాటని పాటించక పోవడం అనే అధర్మం కలుగుతుందనే భయంతో, లోకం విషయంలో కొంచెం కూడా అనుమానం లేకపోవడంతో, నువ్వు తీసుకున్న నిర్ణయం సబబైంది కాదు. శక్తి లేని దైవం గురించి నీ వంటి వాడు ఇలా చెప్పచ్చా? దుర్భలుడు, దీనుడైన దైవం గురించి ఇలా ఎందుకు చెప్తున్నావు? పాపాత్ములైన కైకేయి, దశరథుల విషయంలో నీకు అనుమానం ఎందుకు కలగడం లేదు? ధర్మాత్మా! రహస్యంగా అపకారం చేసి, స్వలాభం కోసం నీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూసే ఆ ఇద్దరూ మృదువైన, ధర్మరూపమైన వంచనలని చేస్తున్నారని నువ్వు తెలుసుకోవడం లేదు. వాళ్లిద్దరూ ముందుగానే ఈ విధంగా నిర్ణయించుకోకపోతే - ఆ వరం పూర్వం ఎప్పుడో తీర్చబడి ఉండేది. అంటే వాళ్లిద్దరూ నిన్ను మోసం చేయదలిచారు. అందువల్లే ఏనాటి వరం గురించో ఇప్పుడు చెప్తున్నారు. లేదా ఆ వరాన్ని దశరథుడు ఎన్నడో తీర్చి ఉండేవాడు. నీకు తప్ప ఇతరులకి రాజ్యాభిషేకం చేయడం లోకవిరుద్ధం. ఆరంభించిన ఈ పనిని ఇతరులకి చేయడం నేను సహించను. ఈ విషయంలో నన్ను క్షమించు. బుద్ధిశాలివైన ఓ రామా! నీ ఆలోచనల్లో మార్పు కలిగించి, నీకు మోహం కూడా కలిగించిన ఈ ధర్మాన్ని నేను ద్వేషిస్తున్నాను. నువ్వు ప్రతీకారం చేయడానికి సమర్థుడవై ఉండి కూడా కైక మాటలకి లొంగిపోయి తండ్రి చెప్పిన ధర్మవిరుద్ధం, నిందించదగ్గ పనిని ఎలా ఆచరిస్తావు? (సర్గ 24 - 12వ శ్లోకం దాకా)
ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓసారి రామాయణంలోని తను చెప్పిన కాండలని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో 4 తప్పులు చెప్పాను. క్షంతవ్యుణ్ణి. అవి చెప్తాను. వినండి’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
ఈ సర్గలోని దైవం అనే పదం
దేనికి ప్రత్యామ్నాయంగా వాల్మీకి
ఉపయోగించాడని భాష్యకారులు చెప్పారు?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
రాముడికి దశరథుడు అడవికి వెళ్లమని సూటిగా చెప్పాడా? లేదా?
జ: లేదు. కైకేయే దశరథుడి మాటగా చెప్పింది. దశరథుడు దాన్ని ఖండించక పోవటంతో ఆయన చెప్పినట్లే తప్ప రామాయణంలో ఎక్కడా దశరథుడు అది రాముడికి సూటిగా చెప్పలేదు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.అంతఃపుర స్ర్తిలు రాముడిని వెళ్లద్దని పాదాల మీద పడి ఏడుస్తూ వేడుకున్నారు అని వాల్మీకి రాయలేదు. అది హరిదాసు కల్పితం.
2.నాలుగో వాకిలి లేనే లేదు. ఇదీ హరిదాసు పొరపాటుగా చెప్పిందే. మూడో వాకిలి దాటి కౌసల్య దగ్గరికి రాముడు వెళ్లాడు.
3.‘రాత్రంతా నియమంగా జాగారం చేసిన’ కౌసల్య కొడుకు క్షేమం కోరుతూ ఆ ఉదయం విష్ణుపూజ చేస్తోంది అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు జాగారం చేయడం గురించి చెప్పలేదు.
4.రాముడు ఎదురుగా వచ్చిన తల్లి పాదాలకి నమస్కారం చేశాడు తప్ప ప్రదక్షిణం చేసినట్లు వాల్మీకి రాయలేదు. అది సహజం అనుకుని హరిదాసు చెప్పాడు.
5.‘మాంసాహారాన్ని వదిలి తేనె, దుంపలు, పళ్లు తింటూ’ అని కూడా రాముడు పధ్నాలుగు సంవత్సరాలు మునిలా నిర్మానుష్యమైన అడవిలో నివసించాలి అని చెప్తూ చెప్పాడు. హరిదాసు దీన్ని విస్మరించాడు.
6.సుకుమారంగా పెరిగిన నువ్వు వెంట పరివారం లేకుండా అడవిలో ఎలా జీవించగలవు? అన్న మాటలు కౌసల్య మాట్లాడలేదు. హరిదాసు పొరబాటది.
7.ఈ సర్గలో లక్ష్మణుడు వౌనంగా ఉన్నాడు తప్ప మాట్లాడలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి