AADIVAVRAM - Others

ఏ పుట్టలో ఏ పాముందో? (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగధ దేశపు రాజుకి ఒకసారి విషజ్వరం సోకి ఎన్ని మందులు వాడినా తగ్గక మంచాన పడ్డాడు. రాజవైద్యుడు మందులు మార్చి, మార్చి వైద్యం చేస్తున్నాడు. కాని ఫలితం కనిపించడం లేదు. రాజు రోజురోజుకి నీరసపడుతున్నాడు. అప్పుడు మహామంత్రి ‘అంతుపట్టని రాజుగారి రోగాన్ని గుర్తించి వైద్యం చేసి రాజును సంపూర్ణ ఆరోగ్యవంతుని చేసిన వారికి లక్ష వరహాలు బహుమతిగా ఇయ్యబడతాయి’ అని ప్రకటించాడు. ఆ ప్రకటన విని ఆశతో ఎందరో వైద్యులు రాజధానికి చేరుకున్నారు.
మహామంత్రి సభికులతో, వచ్చిన వైద్యులతో సమావేశమై రాజుగారి ఆరోగ్యం గురించి చర్చిస్తుండగా ఒక పేద రైతు, అక్కడకు వచ్చాడు. ‘నేను రాజుగార్ని ఆరోగ్యవంతుడిని చేస్తాను’ అంటూ. ఆ మాట విని అందరూ మొదట నివ్వెరపోయారు. తరువాత హేళన చెయ్యసాగారు. ‘ఇంతమంది కొమ్ములు తిరిగిన వైద్యులు ఇక్కడ ఉండగా రాజుగారికి నువ్వు నయం చేస్తావా? నువ్వు వైద్యుడివా? నీకు వైద్యం వచ్చా? ఇదేం పొలంలో కలుపు తియ్యడం కాదు’ అన్నారంతా.
అప్పుడు మంత్రి ‘అలా హేళన చేయకండి. ఏ పుట్టలో ఏ పాముందో? అతడిని రాజును చూడనిద్దాం’ అంటూ రాజుగారు పడుకున్న గదికి తీసుకెళ్లాడు.
ఆ రైతు రాజుగారికి నమస్కరించి, ఆయన పడుకున్న మంచం క్రింద నుంచి దూరి బయటకు వచ్చి, రాజుగారి జబ్బు నయమైంది, తగ్గించిన వారికి లక్ష వరహాలు ఇస్తానన్నారు కదా. ఇవ్వండి’ అని అడిగాడు.
రైతు చేసిన పని తెలుసుకున్న సభలోని వారంతా ముక్కున వేలేసుకుని ‘వీడికెంత ఆశ! మందూ మాకూ ఏమీ వెయ్యకుండానే మంచం క్రింద నుంచి దూరి వచ్చి లక్ష వరహాలిమ్మంటున్నాడు. ఎంత ధైర్యం? మంత్రాలకు చింతకాయలు రాల్తాయా?’ అని చెవులు కొరుక్కోవడం మొదలెట్టారు.
ఇదంతా చూసిన రాజవైద్యడు ‘అతడిని అవహేళన చెయ్యకండి. అనారోగ్యంగా వున్న రోగి మంచం క్రింద నుంచి దూరడమంటే, ఆ రోగాన్ని తన మీదకు ఆహ్వానించుకోవడం అన్నమాట. ఈ విషయం గ్రంథాలలో వివరించబడి ఉంది. నాకీ విషయం ఇంతవరకు గుర్తుకు రాకపోవడానికి చింతిస్తున్నా’నన్నాడు.
అవహేళన చేసిన వారందరూ, రైతును తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణ కోరారు. రాజ వైద్యుని మాట విన్న రైతు ‘రాజు దేవుడికి ప్రతిరూపం’ అంటారు. ఆయన చల్లగా వుంటే ఆయన ఏలుబడిలోని ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. నాలాంటి వాడు వున్నా ఒకటే, లేకున్నా ఒకటే’ అని అందరికీ నమస్కరించి వెళ్లిపోయాడు.
రెండు మూడు రోజుల్లో రాజుకి జ్వరం తగ్గి తేరుకుని లేచి కూర్చున్నాడు. క్రమంగా కోలుకున్నాడు. కాని, రోగాన్ని తనపై ఆపాదించుకున్న రైతు ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. ఆ మాట విన్న రాజు స్వయంగా రైతు ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి ఇస్తామని ప్రకటించిన లక్ష వరహాలు ఇవ్వబోయాడు. రైతు బలహీనంగా చేతులు జోడించి ‘మహారాజా మీరు క్షేమంగా ఉంటేనే కదా మీ ప్రజలు చల్లగా ఉంటారు. అదే నేను కోరుకున్నది. నాకెందుకయ్యా ఈ వరహాలు’ అని నీరసంగా అంటూ సొమ్ము నిరాకరించాడు. రైతు ఔన్నత్యానికి అబ్బురపడిన రాజు ‘నీ కుటుంబ పోషణ భారమంతా నాదే. నీ కుటుంబ సభ్యులకు ఏ లోటూ రానియ్యకుండా కంటికి రెప్పలా చూసుకుంటా’ అంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రైతు రెండు చేతులూ పట్టుకుని హామీ ఇచ్చాడు.

-రేవతి