AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి అర్థంతో, బతిమాలుతూ చెప్పే సుమంత్రుడి మాటలు విన్న దశరథుడి విచారం ఇంకా పెరిగింది. ధార్మికుడు, శ్రీమంతుడు ఐన ఆ రాజు కొడుకుని గురించిన ఆలోచనతో సంతోషం నశించి, దుఃఖంతో ఎర్రబడ్డ కళ్లతో ఆ సారధిని చూసి ‘నీ మాటలతో నా మర్మస్థానాలని ఛేదిస్తున్నావు’ అని చెప్పాడు. జాలితో కూడిన ఆ మాటలు వినగానే, వాటిని చెప్పిన దీనుడైన దశరథుడ్ని చూసి సుమంత్రుడు నమస్కరించి కొద్దిగా దూరంగా జరిగాడు. దీనుడైన దశరథుడు ఏం మాట్లాడలేక పోయాడు. ఆలోచనల్లో సమర్థురాలైన మంధర ఇలా చెప్పింది.
‘సుమంత్రా! రాముడికి రాజ్యాభిషేకం జరుగుతుందనే ఆనందావేశాలతో రాజు రాత్రంతా నిద్రలేక అలసిపోయి ఇప్పుడు నిద్రపోతున్నాడు. అందువల్ల నువ్వు మరో ఆలోచన లేకుండా త్వరగా వెళ్లి రాజకుమారుడు, కీర్తిమంతుడు ఐన రాముడ్ని తీసుకురా, నీకు శుభం జరుగు గాక!’
ఆమె మాటలు విన్న సుమంత్రుడు, ధర్మాత్ముడైన రాముడు అభిషేకం కోసం అక్కడికి తప్పక వస్తాడు అని అనుకున్నాడు. శుభకార్యం జరగబోతోందని మనసులో సంతోషిస్తూ రాజాజ్ఞ ప్రకారం వెంటనే మహాబాహువైన రాముడి దగ్గరికి బయలుదేరాడు. సముద్రంలోని లోతైన ప్రదేశంతో సమానమైన అంతఃపురంలోంచి బయటికి వచ్చిన సుమంత్రుడు ఎదురుగా జనంతో కిక్కిరిసి ఉన్న ద్వారాన్ని చూశాడు. అక్కడ అప్పటికే ఎదురుచూస్తున్న రాజుల్ని, మహాధనవంతులైన పౌరుల్ని చూశాడు.
(అయోధ్య కాండ సర్గ 14 శ్లోకాలు 59 నించి 68 దాకా)
సకల వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారగానే వశిష్టుడితో చేరారు. అత్యంత ఆనందభరితులైన మంత్రులు, సేనాధిపతులు, నగర ప్రముఖులు కూడా రామాభిషేకం కోసం అక్కడ చేరారు. సూర్యోదయం అయాక పగటిపూట, పుష్యమీ నక్షత్రంలో రాముడి జన్మలగ్నం కన్యా లగ్నం రాగానే రాముడికి రాజ్యాభిషేకం చేయాలని, ఉత్తములైన బ్రాహ్మణులు నిర్ణయించారు. బంగారు పూర్ణ కుంభాలు, బాగా అలంకరించిన ఆసనం, అందమైన పులి చర్మం చక్కగా పరిచిన రథం మెరుస్తున్నాయి. పవిత్రమైన గంగా యమునల సంగమం నించి, ఇతర పుణ్యనదుల నించి, పెద్ద చెరువుల నించి, కూపాల నించి, సరస్సుల నించి, తూర్పు వైపు, పడమర వైపు అడ్డంగా ప్రవహించే నదుల నించి, ఒకదానితో మరొకటి కలిసిన నదుల నించి, నాలుగు సముద్రాల నించి తీసుకువచ్చిన నీరు మెరుస్తోంది. ఆ పవిత్రమైన నీటితో నింపి పేలాలు పోసి, పాలు కారే చెట్ల ఆకులు, పద్మాలు, కలువలు కప్పిన బంగారు, వెండి కలశాలు మెరుస్తున్నాయి. తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు సిద్ధం చేయబడి ప్రకాశిస్తున్నాయి. ఆచారవంతులై చక్కగా అలంకరించుకున్న వేశ్యా స్ర్తిలు కూడా అక్కడ ప్రకాశిస్తున్నారు. బంగారంతో నిర్మించబడి రత్నాలతో అలంకరించబడిన, వికసించిన చంద్ర కిరణంతో సమానమైన ఉత్తమమైన వింజామర రాముడి కోసం సిద్ధం చేయబడింది. అభిషేక సమయాల్లో ముందుగా అమర్చబడే చంద్రమండలంలా ఉన్న అందమైన తెల్ల గొడుగు, తెల్లటి ఎద్దు, తెల్లటి గుర్రం, రాజులు ఎక్కతగిన, మదోదకం స్రవించే ఏనుగు కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఆభరణాలు అలంకరించుకున్న మంగళకరమైన కన్యలు, అన్ని విధాలైన సంగీత వాద్యాలు, వందిమాగధులు, తదితరులు కూడా వేచి ఉన్నారు. ఇక్ష్వాకు వంశ రాజ్యంలో ఎలాంటి అభిషేక ద్రవ్యాన్ని సమకూరుస్తారో ఆ ద్రవ్యాలని, ఆ వంశానికి చెందిన రాజపుత్రుడి అభిషేకానికి ఉపయోగించడానికి రాజాజ్ఞ ప్రకారం సమకూర్చుకుని అక్కడికి వచ్చిన వారంతా రాజు కనపడకపోవడంతో ‘మనం వచ్చినట్లుగా రాజుకి ఎవరి ద్వారా తెలియజేయాలి?’ అని అనుకున్నారు.
‘రాజు కనపడటం లేదు. సూర్యుడు ఉదయించాడు. ధీమంతుడైన రాముడికి పట్ట్భాషేకానికి అంతా సిద్ధంగా ఉంది’ అని అనేక మంది అనుకుంటున్నారు. గౌరవనీయుడైన సుమంత్రుడు ఆ మాటలని విని, అనేక దేశాల నించి వచ్చిన రాజులతో ఇలా చెప్పాడు.
‘నేను రాజాజ్ఞ ప్రకారం రాముడి దగ్గరికి వెళ్తున్నాను. మీరంతా దశరథుడికి, ముఖ్యంగా రాముడికి పూజనీయులు. మేలుకున్న రాజు సుఖంగా ఉన్నాడా అనే విషయాన్ని, ఇక్కడికి రాకపోవడానికి కారణాన్ని మీ మాటగా నేను అడుగుతాను’
తర్వాత అతను తిరిగి అంతఃపుర ద్వారాన్ని సమీపించి ఎప్పుడూ మూసి ఉండే అంతఃపురంలోకి ప్రవేశించి, రాజవంశాన్ని స్తుతించి రాజు పడక గది దగ్గర నిలబడి దశరథుడి గుణాలని కీర్తించాడు.
‘దశరథ మహారాజా! సూర్యచంద్రులు, శివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు అంతా నీకు విజయాన్ని ఇవ్వుగాక! పూజనీయమైన రాజుల్లో గొప్పవాడా! పూజనీయమైన రాత్రి గడిచి మంగళకరమైన పగలు వచ్చింది. మేలుకుని చేయాల్సిన పనులని చెయ్యి. రాజా! బ్రాహ్మణులు, సేనాధిపతులు, వ్యాపారస్థులు వచ్చి నీ దర్శనం కోసం వేచి ఉన్నారు. నిద్ర లే’
అలా తనని స్తుతించే మంత్రవేత్త, తన సారధి ఐన సుమంత్రుడితో దశరథుడు ఇలా చెప్పాడు.
‘రాముడ్ని తీసుకురమ్మని కైకేయి చెప్పింది కదా. నా ఆ ఆజ్ఞని పాటించకపోవడానికి కారణం ఏమిటి? నేను నిద్ర పోవడం లేదు. వెంటనే రాముడ్ని ఇక్కడికి తీసుకుని రా’
అతను రాజాజ్ఞ విని, తల వంచి నమస్కరించి మంచి జరగాలని ఆశిస్తూ రాజగృహం నించి బయటకి వచ్చాడు. జెండాలతో అందంగా ఉన్న రాజవీధిని చూసి బాగా సంతోషిస్తూ వెళ్లాడు. గుమిగూడిన ప్రజలంతా చెప్పుకుంటున్న రాముడికి, రామాభిషేకానికి చెందిన మాటలని సుమంత్రుడు విన్నాడు. తర్వాత సుమంత్రుడు కైలాస శిఖరంలా ఎత్తుగా, ఇంద్రభవనంలా అందంగా ఉన్న రామభవనాన్ని చూశాడు.
శ్రీరాముడి ఇల్లు పెద్దపెద్ద తలుపులతో, వందల కొద్దీ అరుగులతో అందంగా ఉంది. ఒక శిఖరం మీద బంగారు శిల్పాలు ఉన్నాయి. రత్నాలతో, పగడాలతో ద్వారాలు అలంకరించబడి ఉన్నాయి. శరత్కాలంలో మేఘంలా, మేరు పర్వత గుహలా ప్రకాశించే అనేక మణులతో ఆ ఇల్లు అలంకరించబడి ఉంది. గంధం, ఇతర సువాసనలు వస్తున్నాయి. సారస పక్షులు, నెమళ్లు మధురంగా కూస్తున్నాయి. అక్కడక్కడా జంతువుల ఆకృతులు అందంగా చెక్కబడి ఉన్నాయి. చంద్ర, సూర్య మండలాల్లా దేదీప్యమానంగా ఉండి అక్కడి వెలుగు ప్రాణుల మనసుని, చూపుని ఆకర్షిస్తూ, ముత్యాలు చల్లిన ఆ ఇల్లు కుబేరుడి భవనంలా, ఇంద్రుడి ప్రాసాదంలా ప్రకాశిస్తోంది. అనేక పక్షుల పాటలతో నిండి ఉంది. మేరు శిఖరంలా ఎత్తుగా ఉంది. మహామేఘంలా ఉన్నతమైన, వివిధ రత్నాలతో అలంకరించబడిన ఆ ఇల్లు గూని పనివాళ్లు, సేవకులతో నిండి ఉంది. అలాంటి రాజప్రాసాదాన్ని సుమంత్రుడు చూశాడు.
వివిధ గ్రామాల నించి వచ్చిన ప్రజలు రామాభిషేకం కోసం ఎదురుచూస్తూ కానుకలు పట్టుకుని వేచి ఉన్నారు. జనాలతో నిండిన ఆ రాజగృహాన్ని ప్రకాశింపజేస్తూ, పౌరులకి సంతోషాన్ని కలిగిస్తూ రాముడి ఇంటి వైపు వెళ్లాడు.
మహాత్ముడైన ఆ రాముడి అంతఃపురం దేవేంద్రుడి భవనంలా సంపన్నంగా ఉంది. అనేక మృగాలు, నెమళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోగానే సుమంత్రుడికి గగుర్పాటు కలిగింది. కైలాసంలా ఎతె్తైన వాకిళ్లు గల, చక్కగా అలంకరించబడిన రాముడి ఇల్లు దేవతా గృహంలా ఉంది. సుమంత్రుడు అక్కడ ఉన్న రాముడి మిత్రులని అనేక మందిని దాటుతూ అంతఃపురానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీరాముడి అభిషేకాన్ని గురించి, రాముడి శుభం కోరి చేయబోయే పనుల గురించి అంతా ఆనందంగా చెప్పుకునే మాటలు విన్నాడు. రాముడి ప్రాసాదం మేరుశిఖరంలా ఎత్తుగా ఉండి ప్రకాశిస్తోంది. జంతువులతో నిండి ఉన్న దాన్ని సుమంత్రుడు చూశాడు. కోట్ల కొలది పల్లెల వాళ్లు, ఇతర ప్రజలు వచ్చి తమ వాహనాలని నిలిపి చేతులు కట్టుకుని ఆ ద్వార ప్రవేశం దగ్గర నిల్చుని ఉండటాన్ని సుమంత్రుడు చూశాడు. రాముడు ఎక్కాల్సిన, ఎతె్తైన శరీరంగల అందమైన మృత్యుంజయం అనే ఏనుగుని చూశాడు. అది మదాన్ని స్రవిస్తూ అంకుశాన్ని కూడా లెక్కచేయకుండా మేఘంలా, పర్వతంలా ఉంది.
రాజుకి ఇష్టమైన ముఖ్యమైన మంత్రులు చక్కగా అలంకరించుకుని, గుర్రాలు, రథాలు, ఏనుగుల్ని ఎక్కి అక్కడికి వచ్చి ఉన్నారు. సుమంత్రుడు గుమిగూడి ఉన్న వారందర్నీ తప్పించుకుని సమృద్ధమైన రాముడి అంతఃపురంలోకి ప్రవేశించాడు. పర్వత శిఖరంలా, కదలని మేఘంలా ఉండి చుట్టూ గొప్ప విమానాల్లాంటి ఇళ్లున్న రాముడి భవనంలోకి సుమంత్రుడు రత్నాలుగల సముద్రంలోకి మొసలి ప్రవేశించినట్లుగా ప్రవేశించాడు. అతన్ని ఎవరూ అడ్డుకోలేదు. (సర్గ 15)
ఆశే్లష హరికథని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసుకుని ఇంటికి వెళ్లి తల్లికి వినిపించాడు. శారదాంబ మొత్తం విని చెప్పింది.
‘ఆయన చెప్పిన దాంట్లో ఐదు తప్పులు ఉన్నాయి. అవేమిటో తెలుసా?’
‘తెలీదు’ ఆశే్లష చెప్పాడు.
‘అవేమిటో చెప్తా విను’
మీరు ఆ ఐదు తప్పులని కనుక్కోగలిగారా?

**

మీకో ప్రశ్న
*
అర్ధ సాధకుడు
దశరథుడికి ఏమవుతాడు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
రామాయణంలో ఇది రెండో మేలుకొలుపు. గతంలో ఎవరు ఎవరికి ఇలా మేలుకొలుపు పలికారు?
-బాలకాండలో రాముడికి విశ్వామిత్రుడు మేలుకొలుపు చెప్పాడు.
*
క్రిందటి వారం ప్రశ్నలకు సమాధానాలు
*
1.ఇంద్రుడు ప్రయోగించిన పాశాన్ని ‘బలి చక్రవర్తి’ విడిపించుకోలేనట్లుగా అని వాల్మీకి రాసాడు. కాని హరిదాసు రాక్షసుడు విడిపించుకోలేనట్లుగా అని తప్పుగా చెప్పాడు.
2.వశిష్ఠుడు ‘అభిషేక సంభారాలని కూడా వెంట తెచ్చాడు. ఆ సంగతి హరిదాసు చెప్పలేదు.
3.దేవేంద్రుడి బదులు కుబేరుడి అమరావతిలా ఉన్న అని హరిదాసు తప్పు చెప్పాడు.
(ఆయన ఈ పొరపాటు చేయడం కథ మొదలయ్యాక ఇది రెండోసారి)
4.సుమంత్రుడు వశిష్ఠుడికి స్వాగతం చెప్పలేదు.
5.రాజ్యాభిషేకం కోసం సిద్ధంగా ఉన్న నలభై రెంటి గురించి చెప్తాను. శ్రద్ధగా విను’ అని వశిష్ఠుడు సుమంత్రుడితో చెప్పలేదు. అదీగాక అవి నలభై తప్ప నలభై రెండు కాదు.
6.దశరథుడి దగ్గరికి అందరి కంటే ముందుగా వచ్చిన వాడు సుమంత్రుడు అని వాల్మీకి రాశాడు. ఆ సంగతి హరిదాసు చెప్పలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి