AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శునశే్శపుడితో వెళ్తూ అంబరీషుడు మధ్యాహ్నం పుష్కర క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు దాహంతో, అలసటతో ఉన్న శునశే్శపుడు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకునే విశ్వామిత్రుడ్ని చూసి, ఆయన ఒడిలోకి వెళ్లి చెప్పాడు.
‘ఓ మహామునీ! నాకు తల్లి లేదు. తండ్రి లేడు. ఇక జ్ఞాతులు, బంధువుల మాట ఏం చెప్పను? అందరికీ రక్షకుడివైన నువ్వే నన్ను ధర్మంగా రక్షించాలి. నేను నాశనం లేని వాడినై, ఎక్కువ ఆయుర్దాయంతో జీవించి, తపస్సు చేసి స్వర్గానికి వెళ్లేలా అందరినీ రక్షించే నువ్వు నన్ను అనుగ్రహించి రక్షించు. నీ కొడుకులా భావించి నన్ను రక్షించు’
అతన్ని విశ్వామిత్రుడు ఓదార్చి తన కొడుకులతో చెప్పాడు.
‘పరలోక హితం కోసం తల్లిదండ్రులు కొడుకుల్ని కంటారు. అది నెరవేర్చే సమయం మీకు వచ్చింది. ఈ ముని కొడుకు నన్ను శరణు కోరాడు. పుణ్యం, ధర్మం మీద ఆసక్తిగల మీరు ఇతని ప్రాణాల్ని కాపాడటానికి రాజుకి యజ్ఞ పశువులుగా వెళ్లి అగ్నికి ఆహుతై, ఇతనికి ప్రాణభిక్ష పెట్టండి. అందువల్ల శునశే్శపుడు కాపాడబడతాడు. యజ్ఞం కూడా అవిఘ్నంగా జరిగి దేవతలు తృప్తి చెందుతారు. ఇతను నన్ను కోరింది కూడా నెరవేరుతుంది’
ఆ మాటలు విని అహంకారులైన ఆయన కొడుకులు అంతా పరిహాసంగా ఇలా చెప్పారు.
‘స్వంత కొడుకులని విడిచి ఇతరుల కొడుకుని ఎలా రక్షిస్తావు? అది కుక్క మాంసాన్ని తినడంతో సమానంగా భావిస్తున్నాం’
ఆ మాటలకి మండి పడ్డ విశ్వామిత్రుడు వాళ్లని వెంటనే శపించాడు.
‘నా ఆజ్ఞని అతిక్రమించిన మీరు వశిష్టుడి కొడుకుల్లా ముష్టిక జాతుల్లో పుట్టి కుక్క మాంసం తింటూ పదేళ్లు భూమి మీద జీవించండి’
తర్వాత శునశే్శపుడికి మంత్రాలతో రక్ష చేసి చెప్పాడు.
‘నీకు ఎర్రటి పైపూత పూసి, ఎర్రటి పూల దండలు వేసి, పవిత్రమైన తాళ్లతో వైష్ణవ యూపస్తంభానికి కడతారు. నేను ఉపదేశించే మంత్రాలతో అగ్నిని ప్రార్థించు. అప్పుడు నీకేం కాదు’
ఆ మంత్రాలని స్వీకరించి శునశే్శపుడు అంబరీషుడి దగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘వెంటనే యజ్ఞశాలకి వెళ్దాం పదండి. మీరు దీక్షలో కూర్చోండి’
ఆ మాటలకి సంతోషించిన అంబరీషుడు యజ్ఞవాటికకి చేరుకున్నాడు. సభ్యుల అనుమతితో శునశే్శపుడిని దర్భ పవిత్రాలు, ఎర్రటి బట్టలతో బలి పశువుగా చేసి యూపస్తంభానికి కట్టారు. అతను విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాలతో ఇంద్రుడ్ని, ఉపేంద్రుడ్ని శాస్తప్రరంగా స్తుతించాడు. రామా! రహస్యంగా ముని కొడుకు చేసిన ఈ స్తుతికి ఇంద్రుడు సంతోషించి అతనికి దీర్ఘాయువుని ప్రసాదించాడు. అంబరీష మహారాజుకి కూడా దేవేంద్రుడు ఎన్నో రెట్ల యజ్ఞ ఫలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు.
ఆ తపస్సుని పూర్తి చేసి వ్రత స్నానం చేసిన విశ్వామిత్రుడికి దాని ఫలాన్ని ఇవ్వడానికి దేవతలు అంతా వచ్చారు.
‘నీ పుణ్యం చేత నువ్వు మహర్షివి అయ్యావు’ బ్రహ్మ విశ్వామిత్రుడికి చెప్పి తిరిగి స్వర్గానికి వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు మళ్లీ తపస్సుని ఆరంభించాడు.
‘రామా! కాలవశాన ఊర్వశి అనే అప్సరస పుష్కరంలో స్నానం చేయసాగింది. విశ్వామిత్రుడు మేఘం వెనక గల మెరుపు తీగ లాంటి ఆమెని చూశాడు. వెంటనే కోరిక చెలరేగి ఆయన ఇలా కోరాడు.
‘ఓ అప్సరసా! నా ఆశ్రమానికి నీకు స్వాగతం. నాతో ఉంటూ నా కోరికని తీర్చు’
ఆమె అందుకు అంగీకరించింది. అలా పదేళ్లు సుఖంగా గడిచాక విశ్వామిత్రుడు తన తప్పునకు సిగ్గుపడ్డాడు. దుఃఖం కలిగింది. ఇది తనని తపస్సు నించి దూరం చేయడానికి దేవతలు పన్నిన పన్నాగం అని గ్రహించాడు. తన ఆలోచనని గ్రహించి నమస్కరిస్తూ, భయంతో వణికే ఊర్వశిని మంచి మాటలు చెప్పి పంపించి ఉత్తర దిశలోని హిమాలయాలకి వెళ్లాడు.
తన ఇంద్రియాలని జయించాలనే నిష్ఠతో కౌశికీ నదీ తీరంలో తీవ్ర తపస్సుని ఆరంభించాడు. అలా ఆయన ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలకి భయం కలిగింది. ఋషులు, దేవతలు విశ్వామిత్రుడు మహర్షి అయ్యాడని భావించారు. వారి మాటలని విన్న బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘మహర్షీ! నీ తపస్సుకి సంతోషించాను. నీకు మహర్షిత్వాన్ని ఇస్తున్నాను’
ఐతే అందుకు విశ్వామిత్రుడికి సంతోషం కాని, దుఃఖం కాని కలగలేదు. ఆయనకి నమస్కరించి వినమ్రంగా ఇలా చెప్పాడు.
‘మహర్షిత్వం వల్ల నేను ఇంద్రియాలని జయించిన వాడిని అయ్యాను’
‘లేదు. నువ్వు ఇంకా ఇంద్రియాలని జయించలేదు. కాబట్టి ఇంకా ప్రయత్నించు’ చెప్పి బ్రహ్మ స్వర్గానికి వెళ్లిపోయాడు.
విశ్వామిత్రుడు చేతులని పైకి ఎత్తి, గాలినే ఆహారంగా తీసుకుంటూ గొప్ప తపస్సుని మళ్లీ ఆరంభించాడు. గ్రీష్మ ఋతువులో (వేసవిలో) పంచాగ్నుల మధ్య, వర్షాకాలంలో ఆరు బయట తడుస్తూ, చలికాలంలో పగలు, రాత్రి నీళ్లల్లో నిలిచి వేయి సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అది చూసి దేవేంద్రుడు, దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు అప్సరసైన మేనకని పిలిచి తనకి మేలు, విశ్వామిత్రుడికి కీలు చేసే మాటలని చెప్పాడు. (బాలకాండ సర్గ 62-63)
మీరు ఆ ఏడు తప్పులని కనుక్కోగలిగారా?

**
కిందటి వారం రామాయణ కథలో తప్పులు
1.విశ్వామిత్రుడు కోపంతో ‘శ్రువం’ అనే హోమ పరికరాన్ని ఎత్తగానే దేవతలంతా రావడం తప్పు. వారు రానే లేదు.
2.త్రిశంకుడు స్వర్గంలోకి వెళ్లనే లేదు. అతన్ని ఇంద్రుడు స్వర్గంలోకి రానివ్వలేదు.
3.ఇంద్రుడు త్రిశంకుడ్ని ‘తలకిందులుగా’ భూమి మీదకి వెళ్లి పడమని శపించాడు. తలకిందులుగా అని హరిదాసు చెప్పలేదు.
4.మరో సప్త ఋషులని, నక్షత్రమాలని, నక్షత్ర వంశాన్ని, మరో ఇంద్రుడ్ని, దేవతా సృష్టిని ఉత్తర దిక్కులో చేయడం ఆరంభించాడు అన్నది తప్పు. దక్షిణ దిక్కులో చేశాడు.
5.తపస్సుకి విఘ్నం కలగడంతో తూర్పు దిక్కుకి కాదు. విశ్వామిత్రుడు పశ్చిమ దిశకి వెళ్లాడు.
6.అంబరీషుడు మిథిలాధిపతి కాదు. అయోధ్య రాజు.
7.చిన్న కొడుకు శునకుడు. మధ్యకొడుకు శునశే్శపుడు. హరిదాసు ఆ పేర్లని అటుదిటుగా చెప్పాడు.

**
మీకో ప్రశ్న

గాయత్రీ మంత్రంలోని మూడో అక్షరం
రామాయణంలోని ఏ సర్గలో, ఏ శ్లోకం?
**

గత వారం ప్రశ్నకి జవాబు

పశ్చిమ ఒరిస్సాలోని మహేంద్ర పర్వతం.

మల్లాది వెంకట కృష్ణమూర్తి