ఓ చిన్నమాట!

గుడిలో ధ్వని తరంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా పూజారి పేరు బుచ్చి కిష్టయ్య. ఆయనకు ఓ అక్క ఉండేది. ఆమె పేరు కాశమ్మ. ఆమె భర్త చనిపోయాడు. అప్పటికి ఆమె వయస్సు 50 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆమె పిల్లలు పెద్దవాళ్లైపోయారు. ఆమె వాళ్ల పిల్లల దగ్గర ఉండకుండా మా ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో వున్న ఓ రామాలయంలో ఉండేది. అప్పుడప్పుడు మా ఇంటికి, పక్క ఊళ్లో ఉన్న మా పెద్దమ్మ ఇంటికి వచ్చేది. వచ్చినప్పుడు మాత్రం మా దగ్గర ఓ వారం రోజులు ఉండేది. తన వంట తనే చేసుకునేది. తెల్లచీర కట్టుకొని గౌరవంగా కన్పించేది. భర్త లేడు కాబట్టి తల వెంట్రుకలు తీయించేది. మా చిన్నతనంలో ఆమె పేరు చెబితేనే మేం భయపడేవాళ్లం. మేం కొంచెం పెద్దగా అయిన తరువాత భయం తగ్గి ఆమెతో మాట్లాడే పరిస్థితి ఏర్పడింది.
ప్రతిరోజూ ఉదయం ఆమె ఓ గంట పూజ చేసుకునేది. సాయంత్రం గుడికి వెళ్లేది. ఇంట్లో గంట పూజ చేసిన తరువాత ప్రతిరోజూ గుడికి ఎందుకు వెళ్లేదో మాకు అర్థం కాకపొయ్యేది. గుడిలో కూడా పూజ చేసుకొని వచ్చేది.
‘ఇంట్లో పూజ చేసిన తరువాత మళ్లీ ప్రతిరోజూ గుడికి ఎందుకు వెళ్తారు. అక్కడ కూడా ఎందుకు పూజ చేస్తారు’ ఒకరోజు ఉండబట్టలేక అడిగాను. మా అమ్మ, మా అక్కలు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు.
ఆమె నవ్వి ఇలా చెప్పింది. గుడికి ఎందుకు వెళ్లాలో, గుడిలో ఎందుకు పూజ చేయాలో కూడా చెప్పింది.
‘గుడికి వచ్చేవాళ్లు అందరూ తమకి మంచి జరగాలని కోరుకుంటారు. అదే విధంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. అందువల్ల అక్కడ మంచి ధ్వని తరంగాలు ఉంటాయి. అందువల్ల ఆ తరంగాలు మనకి తాకి మనకి కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో పూజ ఎంత ముఖ్యమో గుడిలో అంతకన్నా ముఖ్యం.’
ఆ జవాబుతో, దేవుడు అంతటా వున్నా గుడికి ఎందుకు వెళ్లాలో అర్థమైంది. మా ఇంట్లో అందరూ గుడికి వెళ్లేవాళ్లు. కానీ మా బాపు (నాన్న) గుడికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. ఈ విషయాలు అన్నీ తెలిసిన మా బాపు గుడికి ఎందుకు వెళ్లక పోయేదో నాకర్థం కాకపొయ్యేది. మా బాపు ఓ ఆయుర్వేద డాక్టర్. మా ఊరిలో అతనే మొదటి డాక్టర్. మా ఊరికే కాదు ఆ చుట్టుపక్కలంతటికి అతనే మొదటి డాక్టర్. డబ్బులు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వైద్యం చేసేవాడు. ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా అంతే తీసుకునేవాడు. ఎవరినీ డబ్బు అడగలేదు. ఎప్పుడూ లెక్కపెట్టలేదు కూడా.
‘కాశమ్మ చెప్పినట్టు గుడికి వెళ్లితే మంచిది కదా! మీరు గుడికి ఎందుకు వెళ్లరని’ మా అమ్మ ఓ రోజు మా బాపుని అడిగింది.
మా బాపు నవ్వి ఇలా అన్నారు.
‘మన దవాఖానాకి వచ్చిన వ్యక్తులు కూడా వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటారు. అదే విధంగా అక్కడ వున్న ఇతర రోగులకి కూడా మంచి జరగాలని కోరుకుంటారు. ఇక్కడ కూడా మంచి ధ్వని తరంగాలే ఉంటాయి. అయినా ప్రతి రోగికి మందు ఇస్తూ ఆ దేవుణ్ని తలచుకొని అతని ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుకుంటాను.’
మా అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత మా బాపుని గుడికి రమ్మని, వెళ్లమని ఎప్పుడూ అడుగలేదు. తను మాత్రం తరచూ గుడికి వెళ్లేది. మమ్ములను తన వెంట తీసుకొని వెళ్లేది.
ఇప్పటి దవాఖానాలు మా బాపు దవాఖానాలా ఉంటే ఎంత బాగుండు!!

-జింబో 94404 83001