ఓ చిన్నమాట!

సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ నెల అతి క్రూరమైన మాసం’ అన్న పదాలతో టి.ఎస్.ఈలియట్ రాసిన ప్రసిద్ధ కవిత ‘ది వేస్ట్‌ల్యాండ్’ మొదలవుతుంది. ఏప్రిల్ నెలని ఎందుకు క్రూరమైనదని అన్నాడో తెలియదుగానీ మేం కాలేజీ చదువులకి వచ్చినప్పుడు ఆ విధంగానే అన్పించేది. అదే నెలలో పరీక్షలు ఉండేవి. ఫలితాలు వచ్చేవి. పాసై కొంతమంది ఆనందపడితే, సరైన మార్కులు రాక, ఫెయిలై ఎంతోమంది బాధపడేవాళ్లు. అప్పుడు ఈ పద ప్రయోగం సరైందని అన్పించేది.
పదవ తరగతి చదవడానికి ముందు ఏప్రిల్ నెల వస్తుందంటే ఆనందం వేసేది. ఎందుకంటే సెలవులు వచ్చేవి. అందుకని ఎగిరి గంతేసేవాళ్లం. మా చిన్నప్పుడు ఇప్పటిలా వివిధ ప్రదేశాలు తిరుగకపోయినా చాలా హాయిగా వుండేవాళ్లం. ఎలాంటి చదువు బాదరా బందీలు లేక హాయిగా తిరిగేవాళ్లం. అప్పుడప్పుడు పెద్దవాళ్లు ఎక్కాలు (టేబుల్స్) చదివించేవాళ్లు. కొన్ని పద్యాలు చదివించేవాళ్లు.
ఏప్రిల్, మే నెలల్లో మధ్యాహ్నం పూట మాత్రమే పిల్లల్ని పెద్దలు కట్టడి చేసేవాళ్లు. ఉదయాలూ, సాయంత్రాలూ పూర్తిగా మా అదుపు ఆజ్ఞల్లో వుండేవి. అప్పుడు మా సమయాన్ని తినెయ్యడానికి టీవీలు, ఫోన్లు లేవు. ఇంటర్నెట్లూ లేవు. అపుడు వున్నది ఒకే ఒకటి -రేడియో. ఒక్క ఆదివారం మాత్రమే చిన్నపిల్లల కార్యక్రమాలు వచ్చేవి. ఆ ఒక్క రెండు గంటలు తప్ప మిగతా అన్ని రోజులు పూర్తిగా మా సొంతం.
మా సృజనాత్మక శక్తికి పనిపెట్టేవాళ్లం. కొత్త ఆటలూ, పాటలూ, కొత్త కథలని సృష్టించేవాళ్లం. కోతులు మమ్మల్ని చూసి ఆశ్చర్యపడేలా ఎగిరి గంతేసేవాళ్లం. చెట్టు వున్నప్పుడు కోతి కొమ్మచ్చి, గుంజలు కన్పిస్తే గుంజలతో ఆటలు, తొక్కుడుబిళ్ల... ఎన్నని చెప్పేది. లెక్కలేనన్ని ఆటలు, పాటలు. అలసిసొలసి నిద్రపోయేవాళ్లం.
అమ్మమ్మల దగ్గరికి వెళ్లేవాళ్లం. అక్కల దగ్గరికి వెళ్లేవాళ్లం. అక్కకు కొత్త స్నేహితులు, కొత్త బంధువులు, కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు ఎన్నో.. సెలవులు వస్తున్నాయంటే ఆనందంతో మనస్సు ఊగిపోయేది.
పదవ తరగతి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. సెలవులు సెలవుల్లా కాకుండా పోయాయి. ఇప్పుడు పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. సెలవుల్లో కూడా సెలవు స్కూళ్లు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు కానీ మనుషులతో మమేకం కావడం తగ్గిపోయింది. ఇంట్లో వుంటున్నారు కానీ మనుషులతో కాదు. పరికరాలతో. మాట్లాడుతున్నారు. కానీ మనసుతో కాదు. చాటింగ్ చేస్తున్నారు కానీ పనికొచ్చేది కాదు.
సెలవులు అప్పుడూ వున్నాయి. ఇప్పుడూ వున్నాయి. మార్పు మనుషుల్లోనే. ఏప్రిల్ క్రూరమైన మాసమని ఈలియట్ ఎందుకన్నాడో తెలియదుగానీ ఇప్పుడు సెలవులన్నీ పిల్లల పట్ల క్రూరంగానే కన్పిస్తున్నాయి.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001