ఓ చిన్నమాట!

వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కారు బ్రేకులు వేస్తుంటే శబ్దం వస్తుంది. దాన్ని సర్వీసింగ్ తీసుకొని వెళ్లాలి సార్’ చెప్పాడు మా డ్రైవర్.
అంతకు ముందే సర్వీస్ స్టేషన్ నుంచి మెసేజ్ వచ్చింది. కారు సర్వీస్ చేయించాల్సి ఉందనిదాని సారాంశం. వచ్చేవారం మా ఊరు వెళ్లాల్సి వుంది. అందుకని దాన్ని సర్వీసింగ్‌కి ఆ మరునాడే పంపించాను. ఓ రెండు రోజులు కారు లేక ఇబ్బంది కలిగినా భరించి సర్వీసింగ్‌కి పంపించాను.
వాహనాలని ప్రతి నెలకి ఒకమారు లేదా అది తిరిగిన కిలోమీటర్లను బట్టి సర్వీసింగ్‌కి పంపిస్తూనే ఉంటాను. ఈ పని నేనే కాదు. చాలామంది చేస్తూ ఉంటారు. క్రమం తప్పకుండా ఈ పని చేస్తుంటారు. అదే విధంగా వాహనాల ఇన్సూరెన్స్ పాలసీలను కూడా దాని ‘డ్యూ’ తేదీలోగా ఆ దాని డబ్బులు చెల్లిస్తూనే ఉంటారు. వస్తువుల మీద, వాహనాల మీద చూపించిన శ్రద్ధ మనలో చాలామంది తమ శరీరం మీద చూపించరు. వాహనం సర్వీసింగ్ చేయించకపోతే అది దార్లో ఎక్కడన్నా ఇబ్బంది పెడుతుంది. వాహన ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు కట్టి పాలసీలని రెన్యువల్ చేయించుకోకపోతే పోలీసులో, రవాణా అధికారులో పట్టుకుంటారని భయం.
మన శరీరం కూడా కొన్ని హెచ్చరికలు చేస్తూంటుంది. కానీ ఆ హెచ్చరికలను మనలో చాలా మంది లెక్క చెయ్యరు. ప్రాణం మీదికి వచ్చేంతవరకు ఇలాగే చేస్తూనే ఉంటారు. మధుమేహ వ్యాధి వున్నవాళ్లు రెండు నెలల కొకసారి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అది చేయించుకోవడానికి జాప్యం చేస్తూ ఉంటారు. పరీక్షకి వెళ్లే ముందు రోజు తక్కువగా తినడం లాంటివి చేస్తూంటారు. తాము చేస్తున్నది తమని తాము మోసగించుకోవడమేననని తెలిసీ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇదొక్కటే కాదు. ఏ అనారోగ్యం అన్పించినా పరీక్షలకి వెళ్లడానికి జంకుతారు.
మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైంది ఆరోగ్యం. ఆరోగ్యంగా వున్న వ్యక్తి ఏమైనా చేసే అవకాశం ఉంది. అనారోగ్యంతో వున్న వ్యక్తి ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకని శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవాలి. త్వరగా పట్టించుకుంటే ఉపద్రవం రాకుండా ఉంటుంది.
మన శరీరం ఇచ్చే సంకేతాలని పట్టించుకోకపోతే మనను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేకపోవచ్చు. కానీ ఇబ్బందుల పాలయ్యే వాళ్లు ఎందరో. అందులో ప్రముఖమైన వ్యక్తి మనమే.
వాహనం కన్నా ముఖ్యమైంది మన శరీరం, మన మనస్సు. వీటికి కొంత విశ్రాంతి, వైద్యం రెండూ అవసరమే.

- జింబో 94404 83001