ఓ చిన్నమాట!
టైమ్ మిషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ మధ్య ఇంట్లో పుస్తకాలు సర్దుతుంటే ఓ పాత నోట్‌బుక్ కన్పించింది. 1974వ సం.లో వివిధ పత్రికల్లో వస్తున్న పజిల్స్‌ని ముఖ్య విషయాలని రాసుకున్న పుస్తకం అది. నేను రాసుకున్న చేతివ్రాత, చిన్నచిన్న బొమ్మలు చూస్తూ అలాగే ఎక్కడికో వెళ్లిపోయాను.
ఆ నోట్‌బుక్ నాకు టైమ్‌మిషన్‌లా కన్పించింది. మనస్సు 1974వ సం. లోకి వెళ్లిపోయింది. సైకిల్ త్రొక్కుతూ నాలుగు కిలోమీటర్లు వున్న కాలేజీకీ వెళ్లడం, కరీంనగర్ రోడ్ల మీద నలుగురం మిత్రులం కలిసి ఎలాంటి అవాంతరాలు లేకుండా నడవడం లాంటివి ఎన్నో గుర్తుకు వచ్చాయి.
నా చేతివ్రాత చూస్తూ నా చిన్నప్పటి క్లాస్‌మేట్స్ గుర్తుకొచ్చారు. చేతిరాతకు సంబంధించి గుర్తుకొచ్చే వ్యక్తులు ఇద్దరు. వాళ్లు మా గుణక్కకి, నాకు క్లాస్‌మేట్స్. వాళ్ల పేర్లు రాజ్యం, భాను. వాళ్ల చేతిరాత డబ్బాడబ్బాలుగా వుండేది. చాలా ఆకర్షణీయంగా వుండేది. యాభై సంవత్సరాలు గడిచినా వాళ్ల చేతిరాత నా కళ్ల ముందు కదలాడింది.
ఆ పుస్తకాన్ని అలా తిరగేస్తుంటే ఏవో లెక్కలు కన్పించాయి. అందులో బస్సు ఛార్జీలు కూడా వున్నాయి. మా వేములవాడకి కరీంనగర్‌కి వున్న బస్సు టిక్కెట్ ధర ఒక్క రూపాయలు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.
ఇలా ఎన్నో కన్పించాయి. డిగ్రీలో నాతోపాటు చదువుకున్న మిత్రులు ఎందరో గుర్తుకొచ్చారు. ఇద్దరు ముగ్గురు మిత్రులు తప్ప మిగతా వాళ్లు ఎవరూ నాకు టచ్‌లో లేరు. ఎప్పుడో అకస్మాత్తుగా ఎక్కడో బస్టాండ్‌లో ఎవరో ఒకరు కన్పించేవారు. బస్టాండుకు వెళ్లడం తగ్గిపోవడంతో ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిల్లో ఎవరన్నా దొరుకుతారో చూడాలి.
డిగ్రీలో రాసుకున్న పుస్తకం నన్ను యుక్త వయస్సులోని కాలేజీలోకే కాదు చిన్నప్పటి స్కూల్ వైపు కూడా ప్రయాణం చేయించింది.
నోట్ పుస్తకమే కాదు. ఫొటోలు, ఉత్తరాలు, అప్పటి వారపత్రికలు, చందమామ, బాలమిత్రలు మనల్ని వెనక్కి తీసుకొని వెళ్తాయి. టైమ్ మిషన్‌లా పని చేస్తాయి.
సినిమాల్లోని టైమ్ మిషన్ మాదిరిగా మనం ఆ జీవితాన్ని తిరిగి పొందలేం. అప్పుడు చేసిన తప్పులని సరిదిద్దుకోలేం. కానీ ఆ జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోగలం. మననం చేసుకోగలం.
మళ్లీ పొందలేం.
కానీ.. ఆ అనుభూతి ఆస్వాదించగలం.
టైమ్ మిషన్ కావాలని కోరుకోని వ్యక్తులు ఎంతమంది? ఎవరూ వుండరేమో.