జాతీయ వార్తలు

దేవుడికే అవమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ వ్యాప్తంగా రహదారులు, పేవ్‌మెంట్లపై ఎలాంటి అనుమతి లేకుండా ప్రార్థనా స్థలాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చోట్ల ప్రార్థనా స్థలాలు ఉండటం ‘దేవుడికే అపచారం’అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ‘ఇలాంటి నిర్మాణాలను తొలగించాలి. ఇప్పటి వరకూ మీరు చేసిందేమీ లేదన్న విషయం మాకు తెలుసు. రాష్ట్రాలు కూడా ఇలాంటి అనధికార ప్రార్థనా స్థలాలను తొలగించడంలో చేస్తున్నదేమీ లేదు’అని న్యాయమూర్తులు వి గోపాల గౌడ,అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తెలిపింది. అనుమతి లేని చోట్ల ప్రార్థనా స్థలాలను కొనసాగనిచ్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసిన సుప్రీం బెంచి ‘ ఆ దేవుడు కూడా దారులను మూసివేయాలని భావించలేదు. కానీ మీరు ఆ పని చేస్తున్నారు’అని పేర్కొంది. రహదారులు, పేవ్‌మెంట్లపై నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించేందుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించినా దాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఇందుకు సంబంధించి అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపింది. లేని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది. 2006 నుంచి ఇప్పటి వరకూ తాము జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వీరు సవివరంగా తెలియజేయాల్సి ఉంటుందని సుప్రీం బెంచి తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ అయ్యేది అటకెక్కించడానికి కాదని, వాటిని ఆచరించాల్సిందేనని ఉద్ఘాటించింది. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణిని హర్షించలేమని పేర్కొంది. రాష్ట్ర పాలనా యంత్రాంగాలు, ప్రధాన కార్యదర్శుల వైఖరి ఇలాగే ఉంటే..తామెందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలకు విలువ ఇవ్వని పక్షంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనే తేల్చుకుంటామని తీవ్ర స్వరంతో పేర్కొంది. అనధికార ప్రార్థనా స్థలాలపై నేరుగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు పంపాలని మొదట సుప్రీం కోర్టు భావించింది. అయితే, వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాయర్ల అభ్యర్థన మేరకు తన నిర్ణయాన్ని సడలించుకుంది. ప్రార్థనా స్థలాలు సహా రోడ్లపై ఉన్న అనుమతి లేని కట్టడాలను తొలగించాలంటూ 2006లో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లోనే వీటిని తొలగించాలని రాష్ట్రాలను ఆదేశించినా ఇప్పటి వరకూ పట్టించుకోక పోవడమే సుప్రీం ఆగ్రహానికి ప్రధాన కారణమైంది.