జాతీయ వార్తలు

కేరళలో ఎల్‌డిఎఫ్‌దే హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు మాదిరిగా కేరళ ప్రజలు కూడా ఒకసారి యుడిఎఫ్, ఒకసారి ఎల్‌డిఎఫ్‌కు ఓటు వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అధికారంలో ఉన్న యుడిఎఫ్‌ను ఇంటికి పంపించి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వామపక్షాల మెజారిటీని బిజెపి కూటమి దెబ్బతీసే అవకాశాలు మెరుగవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమకు లభించిన పది శాతం ఓట్లను అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పెంచుకోగలిగితే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.
బిజెపి తన సత్తా చాటుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు చీలిపోయే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో మొత్తం మైనారిటీలు దాదాపు నలభై ఎనిమిది శాతం ఉన్నారు. ఇందులో ముస్లింలు దాదాపు ఇరవై నాలుగు శాతం కాగా, క్రైస్తవుల సంఖ్య కూడా దాదాపుగా ఇంతే ఉంది. బిజెపి రంగంలోకి దిగటంతో అసెంబ్లీ ఎన్నికలకు కొంత మతం రంగు కూడా పులుముకుంటోంది. అధికారాన్ని నిలుపుకునేందుకు నానా కష్టాలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు బిజెపి బూచి చూపించటం ద్వారా ముస్లిం, క్రైస్తవుల ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యూహం ఫలిస్తే కొన్ని మైనారిటీ ఓట్లు ముఖ్యంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కు పడవచ్చునని అంచనా వేస్తున్నారు. బిజెపి హిందువులను తమవైపు ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నించటంతోపాటు కేరళలోని వెనుకబడిన కులాల్లో అత్యధికులైన ఎజవ వర్గం (కల్లుగీత కార్మికుల) మద్దతు సంపాదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈడవ వర్గం మద్దతు లభించే పక్షంలో బిజెపికి కొన్ని అసెంబ్లీ సీట్లు లభించవచ్చునని అంచనా వేస్తున్నారు. మామూలుగా అయితే ఎజవ వర్గం వామపక్షాలకు మద్దతు ఇస్తుంది. బిజెపి మూలంగా ఈసారి పరిస్థితి మారుతుందని అంటున్నారు. ఎజవ వర్గం నాయకుడు నటేసన్ నాయకత్వంలోని భారత ధర్మ జన సేన పార్టీ బిజెపికి మద్దతు ఇస్తోంది. ఎజవ వర్గానికి చెందిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. శ్రీ నారాయణ గురు స్థాపించిన ఈ మఠం కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హాజరు కావటం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసిని ఓడించేందుకు కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో ప్రత్యర్థులు కావటం తెలిసిందే. కాంగ్రెస్, వామపక్షాలు అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని కేరళ ప్రజలు అంతగా హర్షించటం లేదు. కాంగ్రెస్, వామపక్షాల ద్వంద్వ నీతిని బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సంపాదించిన బిజెపి 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓట్ల శాతాన్ని పదికి పెంచుకున్నది. పెరిగిన ఓట్లు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. బిజెపి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పది సీట్లు గెలుచుకుంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. బిజెపికి ఓట్లు పెరగటం వలన ఏ కూటమికి నష్టం వాటిల్లుతుందనేది చర్చనీయాంశంగా మారింది. బిజెపికి పెరుగుతున్న బలం యుడిఎఫ్‌ను దెబ్బతీస్తుందని ఒక వర్గం చెబుతుంటే మరో వర్గం మాత్రం ఎల్‌డిఎఫ్‌ను దెబ్బ తీస్తుందని అంటున్నారు. యుడిఎఫ్ ప్రభుత్వం అమలు చేసిన మద్య నిషేధం కాంగ్రెస్‌ను గట్టిగా దెబ్బతీయవచ్చునని భావిస్తున్నారు.