జాతీయ వార్తలు

కాపులను రెచ్చగొడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వైఎస్‌ఆర్‌సి అధినాయకుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నారని, కాపులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్ష ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, ఏపిపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై కూడా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. కుల రాజకీయాలు చేస్తే కఠిన చర్యలను ఎదుర్కొనవలసి వస్తుందని ఆయన ఈ నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తుని సంఘటనల వెనుక బయటి నుండి వచ్చిన వారి హస్తం ఉన్నదని ఆరోపించారు. గతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి దింపేందుకు వైఎస్.రాజశేఖర రెడ్డి ఇలాంటి సంఘటనలు చేయించారని బహిరంగ ఆరోపణలు వచ్చాయని, అసెంబ్లీలో ఆరోపించారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వారిది అలాంటి స్వభావమని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారు, ప్రతి రోజు కోర్టుల చుట్టు తిరుగుతున్న వారు తనపై ఆరోపణలు చేయటం ఏమిటంటూ ఆయన పరోక్షంగా జగన్‌మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు. తుని సంఘటన ముందు వేసుకున్న పథకం ప్రకారం చేసినదేనంటూ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు. తుని సంఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చిరంజీవి, దాసరి నారాయణరావు, రఘువీరారెడ్డి తదితరులు తుని వెళ్లవలసిన అవసరం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. కాపులకు న్యాయం చేస్తానంటూ స్వంత పార్టీ పెట్టిన చిరంజీవి చివరకు ఏం చేశారు కాంగ్రెస్‌లో విలీనం చేయలేదా? అని ముఖ్యమంత్రి నిలదీశారు. వీరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైలు, పోలీసు స్టేషన్ తగలబెట్టారని, దీనికి ఎవరు బధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. ‘కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే అన్ని అంశాలను పరిశీలించాలా? వద్దా? బాగా వెనుకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని తానంటే దానిని వక్రీకరిస్తారా? వీరికి కామన్ సెన్స్ ఉన్నదా?’ అని ఆయన ప్రశ్నించారు. మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టేవారు నేరస్థులవుతారని చంద్రబాబు ప్రకటించారు. రఘువీరారెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఎందుకు సాధించలేదన్నారు. చిరంజీవి తదితరులు కాపులకు రిజర్వేషన్లు సాధించటంలో విఫలమై ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న తనపై ఆరోపణలు చేస్తున్నారని బాబు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజలు తనకు పూర్తి మద్దతు ఇస్తున్నారని, వారు తుని సంఘటనలకు బాధ్యులు కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.