జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వీలైనంత త్వరగా రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. తక్షణం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూనే, రెవెన్యూ లోటు ఐదారేళ్లు ఉంటుంది కనుక ప్యాకేజీ ప్రకటించాలని కోరామన్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం కోరుతూ, ఈ ఏడాది నాలుగు వేల కోట్లు డిమాండ్ చేశామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌ను పరిశీలిస్తామని మోదీ హామీ ఇచ్చారన్నారు. మంగళవారం ప్రధాని మోదీతో చర్చించిన అంశాల వివరాలను చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరీంద్ర సింగ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను విడివిడిగా కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. మంగళవారం సాయంత్రం మోదీతో సమావేశమై విభజన చట్టంలోని హామీలను గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు, అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం తదితర అంశాలను చర్చించారు. బీసీ రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రంలో కాపు ఉద్యమం కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అమరావతికి పన్ను రాయితీలిచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించకుంటే అనుకున్నట్టుగా నిర్మాణం సాధ్యంకాదన్న విషయాన్ని మోదీకి వివరించినట్టు చంద్రబాబు వివరించారు. విభజన చట్టంలోని పలు హామీలు నెరవేరితేనే, సమస్యలపై దృష్టి కేంద్రీకరించే వీలుంటుందని మోదీతో చెప్పామన్నారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు 2566 కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరామన్నారు. కడపలో స్టీల్ ప్లాంటు, విజయవాడ, విశాఖపట్టణానికి మెట్రో రైలు అంశాలు చర్చించామన్నారు. శాసన సభ స్థానాల పెంపునకు తగు చర్యలు తీసుకోవాలని మోదీని కోరామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన చంద్రబాబు, ప్రత్యేక హోదా, రాజధానికి ప్రత్యేక నిధి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుల అంశాలు చర్చించామని సుజనాచౌదరి వివరించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులకు సంబంధించిన ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందన్నారు. విభజన చట్టం హామీమేరకు అసెంబ్లీ సీట్లను 175 నుండి 225కు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుందన్నారు. ఈ అంశాన్ని న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడతో చర్చిస్తామని జైట్లీ హామీ ఇచ్చారన్నారు. విభజన చట్టం హామీల నేపథ్యంలో రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం ప్యాకేజీ సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు మరో 50 పెరగడం ఖాయమన్నారు. రెవెన్యూ లోటు కింద 12,106 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారన్నారు. రాష్ట్రానికి విదేశీ ఆర్థిక సాయం ఎనిమిది వేల కోట్లకు పెంచాలని జైట్లీని కోరామన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రెండు వందల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజప్తి చేశామన్నారు. విశాఖలో సమాచార సాంకేతిక పెట్టుబడుల కేంద్రానికి 7,444 కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఆంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రతిపాదనను కేబినెట్ పరిశీలనకు పంపుతున్నట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చంద్రబాబుకు చెప్పారు. రైల్వే భవన్‌లో సురేష్ ప్రభుతో సమావేశమై బడ్జెట్‌లో పొందుపర్చాల్సిన రాష్ట్ర పథకాలపై చర్చించారు. రాజధాని అమరావతికి ఇతర ప్రాంతాలతో రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్న సిఎం ప్రతిపాదనను సురేష్‌ప్రభు ఆమోదించారని కేంద్ర సైన్సు, టెక్నాలజీ సహాయ మంత్రి సుజనాచౌదరి సమావేశం తరువాత మీడియాకు వెల్లడించారు. విశాఖ నుంచి చెన్నై వరకు మూడో రైల్వే లైను నిర్మించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జాయింట్ వెంచర్ల ద్వారా తిరుపతి, ఇతర రైల్వే టెర్మినల్స్ అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతి నుంచి గుంటూరుకు ఫీడర్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి అమరావతికి శతాబ్ది రైళ్లు లేదా హైస్పీడ్ రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సిఎం చంద్రబాబు