జాతీయ వార్తలు

పబ్లిసిటీ స్టంట్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం చేపట్టిన బేసి-సరి విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంత అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషనర్‌ను న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో జస్టిస్ ఎకె సిఖ్రీ, జస్టిస్ ఆర్ భానుమతి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్యం రక్కసికి ప్రజలు చనిపోతున్నారు. ఇవేమీ మీకు పట్టవు. కేవలం ప్రచారం కోసమే పిటిషన్ వేశారు’ అని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ ఓ పబ్లిసిటీ స్టంట్‌గా కోర్టు అభివర్ణించింది. దీనికి అసలు విచారణార్హత లేదని అంత అత్యవసరం కూడా కాదని బెంచ్ వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు కూడా కార్‌పూలింగ్ పద్ధతి కిందే కోర్టుకు హాజరవుతున్న విషయాన్ని వారీ సందర్భంగా గుర్తుచేశారు. ఓ సదుద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమానికి భంగం కలిగించాలనే పిటిషన్ దాఖలు చేసినట్టుందని బెంచ్ పేర్కొంది. ‘మేం అందరం కార్‌పూలింగ్‌ను ఆశ్రయించాం. నీవుమాత్రం ఎలాంటి సహకారం అందించవు గానీ ఆటంకాలు కల్పిస్తావు’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ ప్రభుత్వం వాహనాల వినియోగాన్ని బేసి-సరి పద్ధతిలో అనుమతించడాన్ని సవాల్ చేస్తూ బి బద్రీనాథ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు బేసి-సరి విధానాన్ని సమర్ధించింది. జనవరి 11న హైకోర్టు తీర్పును వెలువరించగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.