జాతీయ వార్తలు
జిఎస్టి బిల్లుకు మోక్షం?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, నవంబర్ 27: పార్లమెంటులో వస్తు, సేవల పన్ను (జిఎస్టి) బిల్లు ఆమోదానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే పరిణామాలు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి జిఎస్టి బిల్లు ఆమోదానికి సహకరించాల్సిందిగా నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరడంతో ఈ దిశగా సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో తాను లేవనెత్తిన మూడు అభ్యంతరాల పట్ల ప్రభుత్వ స్పందనపై పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. ప్రధాని మోదీ.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన తరువాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిన మూడు అంశాల పట్ల ప్రభుత్వం వ్యక్తం చేసిన స్పందనపై ఆ పార్టీ అంతర్గతంగా చర్చించుకున్న తరువాత ప్రభుత్వం ఆ పార్టీతో తాజా సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ నేరుగా ప్రధాన ప్రతిపక్షంతో భేటీ కావడం ఇదే మొదటిసారి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా చూసే ప్రయత్నంలో భాగంగా మోదీ.. మన్మోహన్, సోనియాలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ శుక్రవారం సోనియాగాంధీని తేనీటి విందుకోసం తన నివాసానికి ఆహ్వానించారు. ఈ తేనీటి విందుకు సోనియా, మన్మోహన్ హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కూడా ప్రధానితో పాటు ఈ భేటీలో పాల్గొన్నారు. పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
ముఖ్యంగా గత రెండు సెషన్ల సమావేశాలలో ఆమోదానికి నోచుకోకుండా పార్లమెంటు ముందు పోగుపడిన అనేక బిల్లులు ప్రస్తావనకు వచ్చాయి. జిఎస్టి బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆందోళనగా ఉన్న మూడు అంశాలను ఆ పార్టీ 45 నిమిషాల సేపు సాగిన ఈ భేటీలో ప్రభుత్వం ముందు ఉంచిందని జైట్లీ వెల్లడించారు. రాజ్యాంగ బిల్లులో జిఎస్టిని నిర్దిష్టంగా 18 శాతంగా పేర్కొనాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల మధ్య సరుకు రవాణాపై అదనంగా ఒక శాతం లెవీ విధించడాన్ని వ్యతిరేకిస్తోంది. ఆదాయాన్ని కోల్పోయే రాష్ట్రాలకు అయిదు సంవత్సరాల పాటు వంద శాతం నష్టపరిహారం చెల్లించాలని కోరుతోంది. జిఎస్టి బిల్లు తీసుకురావడానికి గల నేపథ్యంతో పాటు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన మూడు అంశాలపై తన స్పందనను ప్రభుత్వం ఆ పార్టీకి వివరించిందని జైట్లీ చెప్పారు. ప్రభుత్వ స్పందనపై కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకున్న తరువాత ఆ పార్టీతో ప్రభుత్వం తిరిగి తాజా సంప్రదింపులు జరుపుతుందని మంత్రి వివరించారు.
శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. చిత్రంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా వున్నారు.