జాతీయ వార్తలు

ముంబయికి పంపిస్తే ముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున అతన్ని ముంబయిలోని ప్రత్యేక మోకా కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచడం సాధ్యం కాదని ఢిల్లీలోని ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం తెలిపింది. ఇక్కడి తీహార్ జైలులో ఉన్న రాజన్‌ను మోకా కోర్టు విచారించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి వినోద్ కుమార్ ఆదేశించారు. వేర్వేరు అండర్ వరల్డ్ మాఫియా గ్రూపుల నుంచి రాజన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని అంతకుముందు ప్రత్యేక న్యాయమూర్తి వినోద్ కుమార్‌కు సిబిఐ తెలియజేసింది. రాజన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచడానికి అనుమతించాలని ముంబయిలోని మోకా కోర్టును అభ్యర్థించనున్నట్లు కూడా సిబిఐ తెలిపింది. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రాజన్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. తీహార్ జైలు సూపరింటెండెంట్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై ఇచ్చిన సమాధానంలో సిబిఐ ఈ వివరాలను ప్రత్యేక న్యాయమూర్తికి తెలిపింది. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలు ఆవరణలో గల మోకా కోర్టులో గురువారంలోపు రాజన్‌ను హాజరు పరచాలని ఆ కోర్టు నుంచి వారంట్ జారీ అయిందని జైలు సూపరింటెండెంట్ సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయిన రాజన్.. తనను విచారణ కోసం ముంబయికి పంపిస్తే ప్రత్యర్థులు హతమారుస్తారని కోర్టుకు విన్నవించారు. రాజన్ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందని అతని తరపు న్యాయవాది కూడా కోర్టుకు విన్నవించారు.
అన్ని అంశాలను పరిశీలించి, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తరువాత రాజన్‌ను ముంబయిలోని మోకా కోర్టులో ప్రత్యక్షంగా హాజరు పరచడం సాధ్యం కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి వినోద్ కుమార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల ప్రతిని జైలు సూపరింటెండెంట్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాల ప్రతిని ముంబయిలోని మోకా కోర్టుకు వెంటనే పంపించాలని కూడా సిబిఐని న్యాయమూర్తి ఆదేశించారు.