జాతీయ వార్తలు

లాయర్లు సమ్మె చేయకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: న్యాయవాదులు సమ్మెకు దిగడం లేదా కోర్టుల బహిష్కరణకు పిలుపునివ్వడం చేయరాదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి బార్ అసోసియేషన్లకు ఒక నెల రోజుల గడువు ఇచ్చింది. ‘మా దృష్టిలో లాయర్లు సమ్మెకు దిగరాదు’ అని న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
అంతేకాదు, సమ్మె అనేది బ్రహ్మాస్త్రంలాంటిదని, విధిలేని పరిస్థితుల్లో మాత్రం దాన్ని ఉపయోగించాలని, అయితే ఈ రోజుల్లో దాన్ని తరచూ ఉపయోగించడం జరుగుతోందని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. లాయర్లు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని కూడా బెంచ్ గుర్తు చేసింది. ‘ఇది చాలా తీవ్రమైన సమస్య, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టులకు చెందిన లాయర్లు ఇటీవల జరిపిన సమ్మెను వ్యతిరేకిస్తూ ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా, ‘పని చేయకపోవడం కూడా ఒక రాజ్యాంగ హక్కే’నని బార్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రామ్ జెత్మలానీ అన్నారు.
అయితే లాయర్ల కుటుంబం కలిసి కూర్చుని చర్చించుకొని ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని కూడా ఆయన అన్నారు. జెత్మలానీ వ్యాఖ్యలపై స్పందించిన బెంచ్ ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలమో లేదో పరిశీలించడానికి నెల రోజుల్లోగా బార్ అసోసియేషన్ల ముఖ్య విభాగాల సమావేశం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలంటూ జారీ చేసిన నోటీసులకు సమాధానం తెలియజేయాలని జిల్లా బార్ అసోసియేషన్ సమన్వయ కమిటీకి, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ను, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బెంచ్ ఆదేశించింది.