జాతీయ వార్తలు

ఇకపై రైల్వే బడ్జెట్ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఇకపై రైల్వేలకు విడిగా ప్రత్యేక బడ్జెట్ ఉండదు. 2017-18 ఆర్థిక సంవత్సరంనుంచి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో సాధారణ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను సమర్పించే తొమ్మిది దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి స్వస్తి చెప్పినట్లయింది. దీనితో పాటే సాధారణ బడ్జెట్ సమర్పణను నెల రోజుల ముందే జరపాలని, అలాగే బడ్జెట్ వ్యయంలో ప్రణాళిక, ప్రణాళికేతర అంటూ విడివిడిగా వ్యయాలు చూపించే పద్ధతికి స్వస్తి చెప్పాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మార్పుల వల్ల బడ్జెట్ సమర్పణ ప్రక్రియ మరింత సులభతరమవుతుంది. ఇప్పటివరకు సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున పార్లమెంటులో ప్రతిపాదిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై ఏప్రిల్ 1వ తేదీన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే వార్షిక వ్యయం, పన్నుల ప్రతిపాదనలకు పార్లమెంటు ఆమోదం పొందేలా చూడాలనే ఉద్దేశంతో సాధారణ బడ్జెట్ సమర్పణను ఒక నెల రోజులు ముందుకు జరపాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, అలాగే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను ప్రత్యేకంగా చూపించే పద్ధతికి స్వస్తి చెప్పాలన్న ప్రతిపాదనలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. దీనికోసం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను నెల రోజుల ముందే అంటే జనవరి 25కు ముందే ఏర్పాటు చేస్తారు. దీనికి అనుగుణంగా బడ్జెట్ తయారీని అక్టోబర్ నెల ప్రారంభంలోనే ప్రారంభిస్తారు. అలాగే జిడిపి అంచనాలను ఇప్పుడు చేస్తున్న మాదిరిగా ఫిబ్రవరి 7న కాకుండా జనవరి 7నే అంటే నెల రోజుల ముందే వెల్లడిస్తారు.
ఇప్పటివరకు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల చివరి రోజున సమర్పించడం ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంటు రెండు దశల్లో మే నెల మధ్య నాటికి గానీ దీనికి ఆమోదం తెలపడం లేదు. జూన్ నెలలో రుతుపవనాలు రావడంతో రాష్ట్రాలు చాలా పథకాలను అమలు చేయడం, వాటికోసం నిధులు ఖర్చు చేయడం అక్టోబర్ నెలలో కానీ ప్రారంభం కావడం లేదు. అంటే వాటి అమలుకు కేవలం ఆరునెలల సమయం మాత్రమే ఉంటోంది. అయితే బడ్జెట్‌ను ముం దుగా సమర్పించడం వల్ల మార్చి 31 నాటికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయిపోతుంది. దీంతో ఖర్చులు, పన్ను ప్రతిపాదనలు రెండూ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంనుంచే మొదలవుతాయి కనుక వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. అలాగే 92 ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న రైల్వేలకు విడిగా బడ్జెట్‌ను సమర్పించడం ప్రతిపాదనకు కూడా స్వస్తి చెప్పి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర బడ్జెట్‌లో భాగంగా చూపించనున్నారు. రైల్వేలకు సంబంధించిన ప్రతిపాదనలనుకూడా చేర్చి ఒకే ద్రవ్య వినిమయ బిల్లును సమర్పించడానికి వీలవుతుంది. దీనివల్ల రెండు ద్రవ్య వినిమయ బిల్లులపై విడివిడిగా చర్చించి ఆమోదించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విలువైన పార్లమెంటు సమయం ఆదా అవుతుంది. అలాగే ఇప్పటివరకు బడ్జెట్ వ్యయాన్ని ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అంటూ విడివిడిగా చూపిస్తున్నారు. దీని ఫలితంగా ప్రణాళికా వ్యయంపైన ఎక్కువగా దృష్టిపెట్టడం, ప్రణాళికేతర వ్యయం కిందికి వచ్చే నిర్వహణలాంటి అంశాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. ఇకపై ఈ పద్ధతికి కూడా స్వస్తి చెప్పాలని కేబినెట్ నిర్ణయించింది. 1959-60 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మొట్టమొదటిసారిగా బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయాన్ని విడిగా చూపించారు.