జాతీయ వార్తలు

స్నేహపూర్వకం అంటూనే పుల్లలు పెడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మధ్య అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాగ్వివాదం చోటు చేసుకున్నది. హరీశ్‌రావు ఒక దశలోఏపి నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావుపై కూడా మండిపడ్డారు. ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం తీవ్ర రూపం ధరించే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన బుధవారం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్లు తెలిసింది. తెలంగాణ తరఫున హరీశ్‌రావు ప్రధానంగా వాదించారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరుపక్షాలు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని సూచించినట్లు తెలిసింది. దీనికి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ‘మీరు ఒకవైపు స్నేహ పూర్వకంగా ఉందామంటూనే మరోపక్క తెలంగాణ ప్రాజెక్టులకు పుల్లలు పెడుతూ అడ్డు తగులుతున్నారు’ అని ఆరోపించినట్లు తెలిసింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టవద్దని అపెక్స్ కౌన్సిల్‌లో ఎలా వాదిస్తారని ఆయన నిలదీశారు. నల్గొండ జిల్లా ప్రజలను ఖాళీ చేయించి పులిచింతలలో నీళ్లు నింపుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు సహకరించామని, పంటలు ఎండిపోతున్నాయంటే నాగార్జున సాగర్ నీళ్ళు విడుదల చేశామని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమకు ప్రతి విషయంలో అడ్డుతగులుతోందని ధ్వజమెత్తారు. కర్నాటక రాష్ట్రాన్ని ఒప్పించి ఆర్డీఎస్ పనులు చేయించుకుంటుంటే కూడా అడ్డుతగులు తున్నారంటూ మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తున్నందున కృష్ణలో తమకు 45 టిఎంసిల న్యాయమైన వాటా ఇవ్వాల్సిందేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.
నందిగామ ప్రాంతంలో స్థానిక ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నందున నాగార్గున సాగర్ ఎడమ కాలువ నీళ్లు అక్కడికి చేరే వరకు శ్రద్ధ తీసుకోవాలని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి ఉమా మహేశ్వరరావుకోరినప్పుడు కూడా హరీశ్ రావు ఆగ్రహంతో తీవ్రంగా స్పందించారు. ‘మీరు ఒక వైపు సాగర్ నీరు విడుదల చేయాలంటారు, మరోవైపు శ్రీశైలం నీటిని విడుదల చేయరు, ఏమిటీ రాజకీయం’ అని నిలదీశారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు తీవ్ర రూపం ధరించటంతో కెసిఆర్ జోక్యం చేసుకోక తప్పలేదు. రెండు రాష్ట్రాల ప్రజలు, రైతుల అవసరాల మేరకు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆంధ్ర ప్రాంతం రైతుల సాగునీరు, ప్రజల తాగునీరు అవసరాలను దృష్టిలో పెట్టుకుంటామని భరోసా ఇచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు, డిండి ప్రాజెక్టులను వ్యతిరేకించటాన్ని తప్పు పట్టారు. గతంలో తెలుగుగంగ ప్రాజెక్టును ఏ అనుమతితో నిర్మించారని ప్రశ్నించిన కెసిఆర్ పాలమూరు, డిండి ప్రాజెక్టులను నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. కాగా ఈ వాగ్వాదంపై ఎపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను ప్రశ్నించగా, ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు.