జాతీయ వార్తలు

‘జిఎస్‌టి’ని ప్రతిపాదించింది కాంగ్రెసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 25: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అవసరమేనని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందని, అయితే పన్ను రేటు పరిమితిసహా కొన్ని అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గురువారంనుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వివాదాస్పదంగా మారిన జిఎస్‌టి బిల్లుపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయడం గమనార్హం. గత సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనకారణంగా నిలిచిపోయిన జిఎస్‌టి బిల్లు లాంటి కీలక సంస్కరణల బిల్లులను ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏ విధంగానైనా ఆమోదింపజేసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే.
బుధవారం నగరంలోని ఓ మహిళా కళాశాల విద్యార్థినులతో చర్చాగోష్ఠి సందర్భంగా రాహుల్ గాంధీ అనేక అంశాలపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాహుల్ గాంధీ దేశంలో అసహనం పెరిగి పోవడంపై కూడా మాట్లాడుతూ, ఒక భారతీయుడిగా అది తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అంతేకాదు తాను జీవిస్తూ, ఇతరులు జీవించేలా చేయడం (శాంతియుత సహజీవనం) ఈ దేశానికున్న అతిపెద్ద బలమని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ, దేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుంచి నడపవచ్చని, తానొక్కడినే దేశాన్ని మార్చి వేయగలనని ఆయన అనుకుంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థి లోకానికి చేరువకావడానికి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న వరస సమావేశాల్లో ఈ రోజు జరిగిన చర్చాగోష్ఠి మొట్టమొదటిది.
మోదీ ప్రభుత్వం పనితీరును రాహుల్ తప్పుబడుతూ, కేంద్రంలో నిర్ణయాలు తీసుకునే అధికారాలున్న వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారని, ప్రతి ఒక్క నిర్ణయంపైనా ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘అన్ని సమాధానాలు ఒకే వ్యక్తి వద్ద ఉండవు’ అని ఆయన అంటూ, చర్చ అనేది చాలా ముఖ్యమన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టి గురించి అడగ్గా, జిఎస్‌టి అవసరమని తమ పార్టీ బలంగా నమ్ముతోందని రాహుల్ చెప్పారు. జిఎస్‌టి, ఇతర బిల్లులు చాలా ముఖ్యమైనవేనని, అయితే ప్రభుత్వ వైఖరి ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడంగా ఉండాలని ఆయన అన్నారు.
అనంతరం రాహుల్ గాంధీ విలేఖరులతో మాట్లాడుతూ, దేశంలో అన్ని వర్గాలకు అత్యంత ఆందోళన కలిగిస్తున్న ‘అసహనం పెరిగిపోతుండడం’, జిఎస్‌టి, అనేక అంశాలపై ప్రధాని వౌనంలాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో లేవనెత్తుతుందని చెప్పారు. జిఎస్‌టి బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారని విలేఖరులు ప్రశ్నించగా, ఈ బిల్లును తీసుకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీఅని, తమ పార్టీ జిఎస్‌టిని సమర్థిస్తోందని చెప్పారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి మూడేళ్ల పాటు ఈ బిల్లును అడ్డుకుందని, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండిన ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ఈ బిల్లును అడ్డుకోవడాన్ని ఒక వ్యూహంగా అభివర్ణించారని ఆయన గుర్తుచేసారు. జిఎస్‌టిపై కాంగ్రెస్, బిజెపిల మధ్య మూడు అభిప్రాయ భేదాలున్నాయని రాహుల్ చెప్పారు. విధించే పన్నుపై పరిమితి, వివాదాల పరిష్కారం, రాష్ట్రాల మధ్య అమ్మకాలపై ఒక శాతం పన్ను విధింపు అనేవి ఈ అంశాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఒక అభిప్రాయం ఉందని, కాంగ్రెస్ పార్టీకి 20 శాతం ప్రజల ఆకాంక్ష (ప్రజా తీర్పు) ఉందనే వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించాలని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రతిపక్షంతో మాట్లాడకపోవడంపై ఆయన ధ్వజమెత్తుతూ ప్రధాని నరేంద్ర మోదీ కనీసం ఒక్కసారి కూడా ఏ కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడలేదని, అదే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తరచూ ప్రతిపక్ష నేతలతో మాట్లాడే వారని అన్నారు.
chitram...
బెంగళూరులో బుధవారం ఓ మహిళా కళాశాలలో ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో కరచాలనం చేస్తున్న విద్యార్థినులు