జాతీయ వార్తలు

గేటు బయటా నిలబడనివ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశం సందర్భంగా పాకిస్తాన్ అధికారులు భారతీయ జర్నలిస్టులను కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా నిలబడనివ్వలేదు. సార్క్ దేశాల మంత్రుల సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియాను అనుమతించడం ఆనవాయితీ. తరువాత జరిగే కార్యక్రమానికి మాత్రం మీడియాను దూరంగా ఉంచుతారు. సార్క్ దేశాల సమావేశాన్ని కవర్ చేసేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు పాకిస్తాన్ ఆరుగురు భారతీయ జర్నలిస్టులకు వీసాలు ఇచ్చింది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారతీయ జర్నలిస్టులను అనుమతించని పాకిస్తాన్ అధికారులు కనీసం ప్రవేశమార్గం వద్ద నిలబడి భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫొటోలను కూడా తీసుకోనివ్వలేదు. వివిధ దేశాల హోంమంత్రులను పాకిస్తాన్ హోంమంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలికి ఆహ్వానించారు. రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు పాకిస్తాన్ జర్నలిస్టులు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. వారితోపాటు భారతీయ జర్నలిస్టులు కూడా ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నించగా పాకిస్తాన్ అధికారులు వెంటనే వారిని ఇక్కడినుంచి వెళ్లిపోవలసిందిగా ఆదేశించారు. దీంతో భారత్‌కు చెందిన ఒక దౌత్యవేత్త వారితో వాదనకు దిగారు. అయితే పాకిస్తాన్ అధికారులు మాత్రం భారతీయ జర్నలిస్టులు ఫొటోలు, వీడియోలు తీసుకోకుండా అడ్డుగా ఉండాలని వారి జూనియర్ అధికారులను ఆదేశించారు. దీంతో అనేకమంది వారికి చుట్టూ చేరి అడ్డుగా నిలబడ్డారు. వారిలో చాలామంది సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఉన్నారు. దీంతో రాజ్‌నాథ్ సింగ్‌తో పాకిస్తాన్ హోంమంత్రి కరచాలనం చేస్తున్న ఫొటోను, వీడియోను భారతీయ జర్నలిస్టులు తీసుకోలేకపోయారు.
రాజ్‌నాథ్‌పై దుష్ప్రచారం
పాకిస్తాన్ యంత్రాంగం స్థానిక మీడియాకు తప్పుడు వార్తలను అందించింది. సార్క్ మంత్రుల సమావేశం కొనసాగుతుండగా భారత హోంమంత్రి స్వదేశానికి ఫోన్లు చేసుకోవడానికి ఎనిమిదిసార్లు వాష్‌రూమ్‌కు వెళ్లారని తెలిపింది. వాస్తవానికి వాష్‌రూమ్ కాన్ఫరెన్స్ హాలుకు బయట ఉంది. రాజ్‌నాథ్ సింగ్ కేవలం రెండుసార్లే వాష్‌రూమ్‌కు వెళ్లారు. మంత్రుల సమావేశం ప్రారంభం కావడానికి ముందు ఒకసారి, సమావేశం ముగిసిన తరువాత మరోసారి మాత్రమే రాజ్‌నాథ్ సింగ్ వాష్‌రూమ్‌కు వెళ్లారు.

వచ్చే నెల నుంచి
హమ్‌సఫర్ కోచ్‌లు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆకాశ నీలి రంగు వినైల్ షీట్లతో, సీసీటీవి, అగ్నిప్రమాద నిరోధ ఉపకరణాలతో రూపొందించిన హమ్‌సఫర్ కోచ్‌లు వచ్చేనెల నుంచి పట్టాలమీద పరుగులు పెట్టనున్నాయి. ఈ కోచ్‌లలో అంధులకు సౌకర్యంగా ఉండేందుకు బ్రైలీ డిస్ప్లే, జిపిఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచారం గురించి ఎప్పటికప్పుడు తెలిపే వ్యవస్థ కూడా ఈ కోచ్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ కోచ్‌లను రూపొందించారు. త్రీటైర్ ఏసి రైళ్లకు అనుసంధానం కానున్న ఈ కోచ్‌లలో ప్రయాణించే వారికి కోరుకున్న ఆహారాన్ని అందించే వ్యవస్థకూడా అందుబాటులోకి వస్తుంది. కపూర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన 21 హమ్‌సఫర్ కోచ్‌లు వచ్చేనెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాయి. ముందుగా న్యూఢిల్లీ-లక్నో స్టేషన్‌ల మధ్య ఈ ప్రత్యేక రైలు నడుపుతారని భావిస్తున్నారు. ప్రయాణికుల రక్షణ, భద్రతలకు సంబంధించి హమ్‌సఫర్ కోచ్‌లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఎస్సీల ఉద్యమం
దేశవ్యాప్తం కావాలి
హర్యానా నేత సోదేష్ కబీర్
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఆగష్టు 7: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీస్ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు 20వ రోజుకు చేరుకోన్నాయి. ఆదివారం నిరసన కార్యక్రమానికి హర్యానా వర్గీకరణ ఉద్యమసారథి డా. సోదేష్ కబీర్, బిసి సంక్షేమ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. సోదేష్ కబీర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణకోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ అమలవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కొందరు అడ్డుకోవడం జరిగిందని, దానివల్ల హర్యానాలో వర్గీకరణ రద్దయిందని తెలిపారు.
ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల్లో ఎ, బి, సి, డి వర్గీకరణ గత 30 ఏళ్లుగా అమలవుతోందని, తద్వారా బిసిల్లో ఎక్కడా ఐక్యత లోపించలేదని అన్నారు. అలాంటపుడు ఎస్సీల వర్గీకరణకు ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకోసం జరుగుతున్న ఉద్యమానికి బిసిల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర గౌడ్ అన్నారు.