జాతీయ వార్తలు

మూడోపక్షం జోక్యం అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 24: కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత ఆందోళనకు దిగిన ప్రజలు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణలతో ఉద్రిక్తంగా మారిన కాశ్మీర్ లోయలో పరిస్థితిని సమీక్షించడానికి రాజ్‌నాథ్ సింగ్ శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించారు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 46 మంది మృతి చెందగా, మూడు వేల మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇక్కడ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ కాశ్మీర్ లోయలో శాంతిని పునరుద్ధరించడానికి, సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి సహకరించాలని ప్రజలను కోరారు. ‘పాకిస్తాన్ స్వయంగా ఓ ఉగ్రవాద బాధిత దేశం. అందువల్ల అది కాశ్మీర్‌లో హింసను ప్రోత్సహించకూడదు. వారి ప్రవర్తనను మార్చుకోవలసిన అవసరం ఉంది. జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడంలో మాకు మూడో పక్షం జోక్యం అవసరం లేదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘్భరత ప్రభుత్వం కాశ్మీర్‌తో అవసరాల ప్రాతిపదికన గల సంబంధాలను మాత్రమే కోరుకోవడం లేదని, భావోద్వేగాలతో కూడిన సంబంధాలను కోరుకుంటోందని నేను స్పష్టం చేయదలచుకున్నాను. ఎవరికైనా ఏవైనా సమస్యలుంటే, అవి చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని పునరుద్ఘాటించదలచుకున్నాను’ అని ఆయన అన్నారు. ‘రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే మేము ఎవరితోనైనా చర్చలు జరుపుతాము’ అని ఆయన స్పష్టం చేశారు.
పెల్లెట్ తుపాకుల వినియోగంపై అడిగిన ఒక ప్రశ్నకు రాజ్‌నాథ్ సింగ్ బదులిస్తూ ప్రమాదకరం కాని ఆయుధాల వినియోగంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ రెండు నెలలలోగా తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. వీలయినంత వరకు పెల్లెట్ గన్‌లు ఉపయోగించకుండా సంయమనం పాటించాలని భద్రతా బలగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అయితే భద్రతా బలగాలపైకి మళ్లీ రాళ్లు విసరకూడదని ఆయన యువతను కోరారు.
రాజ్‌నాథ్ సింగ్ అధికార పిడిపి, బిజెపి, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి బృందాలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తరువాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి బృందం రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయింది.

చిత్రం... శ్రీనగర్‌లో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. చిత్రంలో కాశ్మీర్ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్