జాతీయ వార్తలు

స్తంభించిన ఉభయ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ఆం ఆద్మీ పార్టీ సభ్యుడు భగవంత్ మాన్ చేసిన నిర్వాకం మూలంగా శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటు భద్రతకు ముప్పు తెచ్చిన భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేశాయి. మాన్‌పై చర్య తీసుకునే విషయం పరిశీలిస్తానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హామీ ఇచ్చారు. లోక్‌సభ శుక్రవారం ఉదయం సమావేశం కాగానే బిజెపి, అకాలీదళ్ సభ్యులు లేచి భగవంత్ మాన్ నిర్వాకం గురించి వివరించారు. భగవంత్ సింగ్ మాన్ ఉదయం 8.30 గంటలకు లోక్‌సభకు వస్తూ మొదటి గేటు నుండి పార్లమెంటు ఆవరణలోని టేబుల్ ఆఫీస్ వరకు వీడియో తీసి ఆ వెంటనే ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఈ విషయాన్ని బిజెపి, అకాలీదళ్‌తో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు ఉభయ సభల్లో ప్రస్తావించారు. భద్రతకు సంబంధించిన అంశాలను మాన్ ఫేస్‌బుక్‌లో పెట్టటం ద్వారా పార్లమెంటును దెబ్బతీశారని వారంతా ఆరోపించారు. భగవంత్ మాన్‌పై చర్య తీసుకోవాలంటూ అధికార పక్షం సభ్యులు ఇచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా అకాలీదళ్‌కు చెందిన సభ్యులు సభ దద్దరిల్లిపోయేలా నినాదాలు ఇచ్చారు. దీనితో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా అధికార పక్షం సభ్యులు పోడియం వద్దకు దూసుకువెళ్లి భగవంత్ మాన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ నినాదాలు ఇచ్చారు. జీరో అవర్ అవకాశాలు ఎలా వస్తాయనేది తన నియోజకవర్గం ప్రజలకు వివరించేందుకే వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టానంటూ భగవంత్ మాన్ చేసిన వాదనతో ఎవ్వరూ ఏకీభవించలేదు. దీనితో సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే అధికార పక్షం సభ్యులు భగవంత్ మాన్ వ్యవహారం లేవదీశారు. పార్లమెంటు భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ వారు తీవ్రస్థాయిలో తమ అభ్యంతరం తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కురియన్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో ఆయన సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తిరిగి పనె్నండు గంటలకు సమావేశమైనప్పుడు చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం సభ్యులు కూడా భగవంత్ చర్యను ఖండించారు.
మాన్‌పై చర్య తీసుకోవలసిందేనంటూ పట్టుపడుతూ గొడవ చేయటంతో సభ స్తంభించిపోయింది. దీనితో హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. బిజెపి, అకాలీదళ్‌కు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇస్తూ గొడవ చేశారు. దీనితో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.