జాతీయ వార్తలు

క్షమాపణా.. విచారణా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: జాతిపిత మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని రాహుల్ గాంధీ ఆరోపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీపై ఆర్‌ఎస్‌ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ‘మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పండి.. లేదంటే విచారణను ఎదుర్కోండి’ అంటూ అల్టిమేటం జారీ చేసింది. ‘చారిత్రక వాస్తవమే అయినప్పటికీ ప్రకటన చేసే ముందు ప్రజా సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది. మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌పై మీరు ఆరోపణ చేసి ఉండకూడదు’ అని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కొడిన బెంచ్ అభిప్రాయ పడింది. ‘స్వేచ్ఛకు ఎలాంటి ఆంక్షలు లేవు.అయితే భావప్రకటన స్వేచ్ఛకు మాత్రం పరిమితులున్నాయి. రచయితలు, రాజకీయ వేత్తలు, విమర్శకులు ఏమి మాట్లాడినా కాస్త సంయమనం కూడా పాటించాలి’ అని వ్యాఖ్యానించింది. రాహుల్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ‘మీరు ఎందుకు తప్పుడు చరిత్రను ప్రస్తావిస్తూ మాట్లాడారు?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్ ఆరోపణలు భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 499 సెక్షన్ (పరువు నష్టం) కిందికి వస్తాయా లేదా అనే విషయాన్ని తాము పరిశీలించాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయ పడింది. ‘మీరు క్షమాపణ చెప్పకపోత విచారణను ఎదుర్కోక తప్పదు’ అని బెంచ్ స్పష్టం చేసింది.ప్రజలను లిటిగెంట్లుగా మార్చడం చట్టం లక్ష్యం కాదని, వారిని చట్టాలకు విధేయులుగా చేయడం అని పేర్కొంది. శాంతి, సామరస్యం పరిఢవిల్లాలే తప్ప అరాచకం కాదని స్పష్టం చేసింది.
సీనియర్ అడ్వకేట్ హరీన్ రావల్ రాహుల్ గాంధీతరఫున వాదిస్తూ ప్రభుత్వ రికార్డులు, పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు ఆధారంగానే రాహుల్ మాట్లాడారన్నారు. అయితే గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అని మాత్రమే పంజాబ్, హర్యానా హైకోర్టు పేర్కొందని బెంచ్ గుర్తు చేసింది. గాంధీజీని నాథూరాం గాడ్సే చంపాడనే దానికి, ఆర్‌ఎస్‌ఎస్ చంపిందనడానికి చాలా తేడా ఉందని, యావత్తు సంస్థను, అందరినీ ఒకే గాట కడుతూ విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించింది.
కాగా, ప్రైవసీకి చరిత్ర గొప్ప శత్రువుని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. చారిత్రకంగా ప్రసిద్ధులైన ప్రముఖుల జీవితాల్లోకి తొంగిచూసి కొత్త కోణాలను వెలికి తీయడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తనపైన, ఇతరులపైన తమిళనాడు ప్రభుత్వం పెట్టిన కేసులను సవాలు చేస్తూ డిఎండికె నేత, తమిళ నటుడు విజయకాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును మిశ్రా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించడం, చరిత్ర ప్రసిద్ధి పొందిన వారిని విమర్శించడం రెండూ వేర్వేరని అన్నారు.
రాహుల్ క్షమాపణ చెప్పరు: కాంగ్రెస్
కాగా, మహాత్మాగాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమంటూ చేసిన వ్యాఖ్యలకుగాను రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని లేదంటే విచారణను ఎదుర్కోక తప్పదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పడం, లేదా విచారం వ్యక్తం చేయడమన్న ప్రసక్తే తలెత్తదు. గతంలో కూడా రాహుల్ క్షమాపణ చెప్పాలన్న సూచన వచ్చింది. దానిని ఆయన అంగీకరించలేదు. రాహుల్ గాంధీ పరిణతి చెందిన నాయకుడు. ఆయనకు చారిత్రక అంశాలపై పూర్తి అవగాహన ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలను రాహుల్, కాంగ్రెస్ పార్టీ సముచిత వేదికపై సమర్థించుకోగలవు’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విలేఖరులతో అన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి స్పందించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.