జాతీయ వార్తలు

మత గ్రంథాల పేర ట్రేడ్‌మార్క్ కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: పవిత్ర మత గ్రంథాల పేర్లను ట్రేడ్‌మార్క్‌గా వినియోగించుకునే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రామాయణం, ఖురాన్ వంటి మత గ్రంథాల పేర్లను ట్రేడ్‌మార్క్‌గా వాడుకోరాదని పేర్కొంది. ‘రామాయణ, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్ వంటి ఎన్నో పవిత్ర మత గ్రంథాలు ఉన్నాయి. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు, అమ్ముకునేందుకు మత గ్రంథాల పేర్లను ఉపయోగించుకునే అధికారం ఎవరికీ లేదు’ అని రంజన్ గగోయ్, ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. అలాగే దేవుళ్ల పేర్లనుగానీ, మంత్ర గ్రంథాల పేర్లను ట్రేడ్‌మార్క్‌గా అనుమతిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంది. బీహార్‌కు చెందిన లాల్ బాబు ప్రియదర్శి అనే వ్యక్తి అగరబత్తీలు, సెంట్లు అమ్ముకునేందుకు ‘రామాయణ’ పేరును ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేయగా ఇంటలెక్చువల్ ప్రోపర్టీ అప్పీలేట్ బోర్డు (ఐపిఎబి) తిరస్కరించింది. దీంతో లాల్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో విచారించిన డివిజన్ బెంచ్ పైవిధంగా వ్యాఖ్యానించింది. ‘రామాయణ్ అనే పదం మహర్షి వాల్మీకి రచించిన గ్రంథమని, దేశంలోని హిందువులకు ఆరాధ్య గ్రంథమని, అలాంటి పేరును ట్రేడ్‌మార్క్‌గా వాడుకునేందుకు ఎంతమాత్రం అనుమతించబోమ’ని బెంచ్ తన 16 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. పిటిషనర్ ఇప్పటికే దేవుళ్ల పేర్లను వాడుతూ వ్యాపారం చేస్తున్నాడని స్పష్టమవుతోందని, అగరబత్తీ లేబుళ్లపై రాముడు, సీత, లక్ష్మణుల చిత్రాలను ముద్రించాడనీ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తులు ఆ తీర్పులో వ్యాఖ్యానించారు. రామాయణ్ పేరుతో 1981నుంచి ఉత్పత్తులను అమ్ముతున్నాననీ, ఈ పేరును మరొకరు వాడకుండా ఉండేందుకు, వినియోగదారులు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు వీలుగా తనకు ట్రేడ్‌మార్క్ కేటాయించాలని లాల్ ప్రభు కోర్టును అభ్యర్థించాడు. అయితే, రామాయణ్ పేరుకు ముందుగానీ, తర్వాతగానీ, ఒక పదంగానీ, ఒక అక్షరం గానీ జతచేర్చిన పక్షంలో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌కు పరిశీలించవచ్చని బెంచ్ అభిప్రాయపడింది.

దళితుల కోసం
ఎన్నికల ప్రణాళిక
కాంగ్రెస్ వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న దళిత విభాగాలను దేశ వ్యాప్తంగా పటిష్టం చేయడంతోపాటు వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎన్నికల ప్రణాళికకు రూపకల్పన చేస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన దళిత విభాగాల నాయకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. దళితుల అభ్యున్నతికి చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశంలోచర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ఈ సమావేశానికి సారధ్యం వహించారు. దళిత విభాగాలను రానున్న కాలంలో మరింత బలోపేతం చేయనున్నట్టు ఆయన తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో చదివే తమిళులకూ తిప్పలే

అల్టిమేటమ్ ఇవ్వాలి తెలుగు ఎంపీలకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచన

ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, నవంబర్ 25: తమిళనాడులో భాషాపరంగా అల్పసంఖ్యాకులైన తెలుగు విద్యార్థులకు పరీక్షల విషయంలో ప్రభుత్వం సృష్టించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో చదువుకుంటున్న తమిళ విద్యార్థులకు అంతకంటే ఎక్కువ సమస్యలు తప్పవని తెలుగు రాష్ట్రాల ఎంపీలు తమిళ ఎంపీలకు అల్టిమేటమ్ ఇవ్వవలసిందిగా మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. తమిళనాడులో చదువుకుంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నుంచి తమ మాతృభాషలోకాక తమిళంలోనే పరీక్షలను రాసి తీరాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు పనె్నండువేల మంది తెలుగు విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలో పడవేస్తోందని ఆయన విలేఖరులకు చెప్పారు. అయితే ఈ విద్యాసంవత్సరానికి మినహాయింపు ఇస్తూ తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలిక ఉపశమనమే అయినందున ప్రభుత్వం తన నిర్ణయాన్ని శాశ్వతంగా రద్దుచేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ తమ మాతృభాషలోనే పరీక్షలు రాయటానికి అలవాటుపడిన తెలుగు విద్యార్థులకు దిగ్భ్రాంతి కలిగిస్తూ, తమిళంలోనే పరీక్షలు రాయలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషలోనే విద్యాబోధన పరీక్షలు రాసే వీలు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించి తీరాలని రాజ్యాంగం నిర్ధారించిందని ఆయన గుర్తుచేశారు. పరీక్షలు జరగటానికి నాలుగు నెలల ముందు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయించటానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒత్తిడి పెంచాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తమిళ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తోందని యార్లగడ్డ తెలియచేశారు. తెలుగుకు తమిళనాడు ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకమేనని ఆయన ఆరోపించారు. తమ భాషకు ప్రాచీన హోదా లభించగానే అప్పటి కేంద్ర మంత్రి దయానిధి మారన్ కేంద్రంపై ఒత్తిడి పెంచి 1500 సంవత్సరాల చరిత్ర ఉంటే తప్పించి ప్రాచీన హోదాను ఏ బాషకూ ఇవ్వరాదన్న నిబంధన తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. తెలుగుకు వెయ్యి సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్నందున ప్రాచీన భాష హోదా ఇవ్వటానికి వీలులేదని మారన్ అనేక ఆవరోధాలు సృస్టించినా ఫలితం లేకపోయిందని ఆయన చెప్పారు. తెలుగు విద్యార్థులు తమిళంలోనే పరీక్షలు రాయలన్న డిఎంకె ప్రభుత్వం విడుదల చేసిన జీవోను తాను అధికారంలోకి వస్తే రద్దుచేస్తానని ప్రతిపక్ష నాయకురాలిగా హామీ ఇచ్చిన జయలలిత, వెంటనే జోక్యం చేసుకుని మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.