జాతీయ వార్తలు

ఐదుగురికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలో రెండున్నరేళ్ల క్రితం డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక పర్యాటకురాలిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన అయిదుగురు దోషులకు ఇక్కడి కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 52 ఏళ్ల డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. దోషులు మహేందర్ అలియాస్ గంజా (25), మహమ్మద్ రజా (25), రాజు (23), అర్జున్ (21), రాజు చక్కా (30)లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి రమేశ్ కుమార్ తీర్పు చెప్పారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 డి కింద నేరానికి పాల్పడిన దోషులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఇతర నేరాలకు గాను శిక్షలు విధించింది. ఆరో నిందితుడయిన 56 ఏళ్ల శ్యామ్‌లాల్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మృతి చెందాడు. దీంతో అతనిపై విచారణను నిలిపివేశారు. మరో ముగ్గురు నిందితులు మైనారిటీ తీరని పిల్లలు. ఈ ముగ్గురిని జువెనైల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది.

అడవి జంతువుల వధ సరికాదు
కేంద్రానికి ఎన్‌జిఓల సమాఖ్య లేఖ
న్యూఢిల్లీ, జూన్ 10: పంటలను ధ్వంసం చేస్తున్నాయనే కారణంతో అడవి జంతువులను వధించడం తగదని అడవి జంతువుల రక్షణ కోసం కృషి చేస్తున్న వందకు పైగా స్వచ్ఛంద సంస్థలు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. ఇలాంటి తాత్కాలిక పరిష్కారాల వల్ల మానవ-జంతు వైరుధ్యం మరింత తీవ్రమవుతుందని, అందువల్ల అడవి జంతువుల వధను వెంటనే నిలిపివేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నాయి. వందకుపైగా స్వచ్ఛంద సంస్థలతో కూడిన భారతీయ జంతు పరిరక్షణ సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఎపిఒ) శుక్రవారం ఈ విషయమై కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు ఒక లేఖ రాసింది. అడవి జంతువుల వధపై గురువారం మరో కేంద్ర మంత్రి మేనకాగాంధీకి, జావడేకర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగిన మరుసటి రోజే సమాఖ్య ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీలో బెంచ్ ఎక్కిన
ఢిల్లీ బిజెపి ఎమ్మెల్యే గుప్తా
న్యూఢిల్లీ, జూన్ 10: తనకు సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదంటూ ఢిల్లీ బిజెపి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వినూత్న నిరసన తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. టాంకర్ల కుంభకోణంపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని విజేందర్ కోరారు. అయితే స్పీకర్ రామ్‌నివాస్ గోయల్ విపక్షనేత గుప్తాకు అనుమతి నిరాకరించారు. దీంతో బిజెపి ఎమ్మెల్యే ఒక్కసారిగా బెంచ్‌పైకి ఎక్కేసి మాట్లాడం మొదలెట్టారు. సభ్యుడి తీరుపై స్పీకర్ తీవ్రంగా మండిపడ్డారు. సమయాన్ని వృధా చేయొద్దని చెప్పినా బిజెపి ఎమ్మెల్యే వినిమించుకోకుండా నిరసన తెలుపుతునే ఉన్నారు. ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను ఉపసభాపతిగా నియమించడాన్ని గుప్తా తప్పుపట్టారు. ఎమ్మెల్యే బెంచ్ ఎక్కి హల్‌చల్ చేస్తున్న దృశ్యాన్ని మిగతా సభ్యులంతా తమ తమ సెల్‌ఫోన్లతలో చిత్రించడానికి పోటీపడ్డారు. ఇది జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభలోనే ఉన్నారు. రాఖీ బిర్లాను డిప్యూటీ స్పీకర్‌గా నియమిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టడంతో విజేందర్ గుప్తా బెంచ్ దిగారు.
భద్రత కరువైన తాళపత్ర గ్రంథాలు
బెర్హంపూర్ (ఒడిశా), జూన్ 10: ఎన్నో విభాగాలు, ఎంతో మంది ఔత్సాహికులు శ్రమించి సేకరించిన అమూల్యమైన పురాతన తాళపత్ర గ్రంథాలకు రక్షణ లేకుండాపోయిన ఉదంతమిది. ఒడిశాలోని బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో గల దక్షిణ ఒడిశా సాంస్కృతిక అధ్యయన కేంద్రం (ఎస్‌ఒసిఎస్‌సి)కి చెంది న పురాతన పత్ర భాండాగారంలో సుమారు అయిదు వేల తాళ పత్ర గ్రంథాలు దిక్కూమొక్కూ లేకుండా పడిఉన్నాయి. నిధుల లేమి, సిబ్బంది కొరత వల్ల వీటిని సరిగా పరిరక్షించలేకపోతున్నారు. ఈ తాళపత్ర గ్రంథాలలోని విషయాన్ని తిరిగి రాయడానికి యూనివర్శిటీ ఒక ఉద్యోగిని నియమించింది.

తమిళ జాలర్లను విడిపించండి
మోదీకి జయ లేఖ
చెన్నై, జూన్ 10: శ్రీలంక నేవీ అధీనంలో ఉన్న 21మంది జాలర్లు, 91 పడవలను విడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. చేపలు పట్టేందుకు వెళ్లిన ఆరుగురు జాలర్లను శ్రీలంక నేవీ దళాలు అదుపులోకి తీసుకున్నాయని, తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలతో జాలర్లు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 21మంది జాలర్లను శ్రీలంక అదుపులోకి తీసుకుందని, జాలర్లను భయపెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడుతోందని జయ వివరించారు. తమ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లిన జాలర్లను అరెస్టు చేయడం శ్రీలంకకు పరిపాటిగా మారిందని పేర్కొన్నారు.