జాతీయ వార్తలు

రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ‘రోమ్ నగరం మండిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు’ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుంటే అధినాయకత్వం మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారినా అధిష్ఠానం మాత్రం చక్కదిద్దే చర్యలు తీసుకోవటం లేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజీత్ జోగి పార్టీకి రాజీనామా చేసి స్వంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్టక్రు చెందిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, గాంధీ కుటుంబం విధేయుడు గురుదాస్ కామత్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతవరకు స్పందించలేదు. చత్తీస్‌గఢ్, మహారాష్టల్రో సీనియర్ నాయకులు పార్టీని వీడిన మరుసటిరోజే త్రిపురలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు శాసభసభ్యులు మంగళవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మరో శాసనసభ్యుడు ఒకటి, రెండు రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు వెళ్లిపోయే అవకాశాలున్నాయి. త్రిపురలో కాంగ్రెస్‌కు మొత్తం పదిమంది సభ్యులుంటే అందులో ఆరుగురు మంగళవారం వెళ్లిపోయారు. త్రిపుర ప్రభావం మణిపూర్ మీదకూడా పడుతున్నట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో పదిమంది కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీకి రాజీనామా చేసి బిజెపితో చేతులు కలపటం తెలిసిందే. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పు మూలంగా కాంగ్రెస్ ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్నా అక్కడ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నదని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవటం తెలిసిందే. రాష్ట్రంనుండి కాంగ్రెస్‌కు ఇద్దరు లోక్‌సభ సభ్యులుంటే ఇందులోనుండి గుత్తా సుఖేందర్ రెడ్డి, మరో శాసనసభ్యుడు త్వరలోనే టిఆర్‌ఎస్‌లో చేరిపోతారనే వార్తలు వచ్చాయి. తెలంగాణలోకూడా కాంగ్రెస్ బీటలు వారుతున్నా అధినాయకత్వం పట్టించుకోవట లేదు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ రెండు, మూడుసార్లు రాష్ట్రంలో పర్యటించినా కాంగ్రెస్ పరిస్థితి మారలేదు.
మహారాష్టల్రో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని గురుదాస్ కామత్ గత నెలలోనే సోనియా, రాహుల్ గాంధీలను కోరారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌ను చక్కదిద్దకపోతే తాను పార్టీలో కొనసాగటం కష్టమవుతుందని ఆయన సోనియాకు లేఖ రాసినట్లు తెలిసింది. ఆయన స్వయంగా రాహుల్‌ను కలిసి పరిస్థితి వివరించినా ఎలాంటి ఫలితం కనిపించకపోవటం వల్లే కామత్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు. కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో బీటలు వారుతుంటే రాహుల్ గాంధీ మాత్రం కీలకాంశాలపై విధానపరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పదిమంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటంపై దృష్టి కేంద్రీకరించారని ఓ రాజ్యసభ సభ్యుడు వాపోయారు. పార్టీ దుస్థితి గురించి తాము పలుమార్లు సోనియా, రాహుల్‌కు వివరించినా ఫలితం కనిపించలేదు కాబట్టే తామిప్పుడు వౌనం వహిస్తున్నామని పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా నియమించటంపై పార్టీకి చెందిన సీనియర్, జూనియర్ నాయకుల మధ్య అంతర్గత పోరాటం ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవటం అందోళన కలిగిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చెబుతున్నారు.