జాతీయ వార్తలు

ఇక ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆత్మరక్షణలో పడిన సర్కారుపై ముప్పేట దాడికి సమైక్య ప్రతిపక్షం సిద్ధమవుతోంది. దీంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాలం సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. బిహారు విధానసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం, పెరుగుతున్న ధరలు, అసహనంపై పెల్లుబుకుతున్న నిరసనలతో ఇరుకునపడిన మోదీ సర్కారుపై కత్తులు దూసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. భాజపాలోని అసంతృప్తులతోపాటు, కొందరు మంత్రులు చేసిన వివాదాస్పద ప్రకటనలతో మోదీ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 16వ లోక్‌సభ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ జరిగిన ఐదు సమావేశాల్లో ఎదురుకాని అనూహ్య పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ ప్రభుత్వం, సవాళ్లను అధిగమించి గట్టెక్కుతుందా? లేక వర్షాకాల సమావేశాలకు పట్టినగతే పునరావృతం అవుతుందా? అన్న సస్పెన్స్‌కు సోమవారం చోటుచేసుకునే పరిణామాలు సంకేతమవుతాయి. గురువారం నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు డిసెంబర్ 23 వరకూ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో పార్లమెంట్ ఉభయ సభలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించే కార్యక్రమంలో భాగంగా దళితుల సమస్యలపై చర్చించి, అన్ని రంగాల్లో వారికి సామాజిక న్యాయం, గౌరవప్రదమైన స్థానం దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికకు రూపమిచ్చే అవకాశాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన అంశంపై జరుగుతున్న చర్చకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినందున, ఈ రెండు రోజుల సమావేశం నిర్మాణాత్మకంగా జరుగుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సోమవారం నుంచి సభ జరిగే తీరుపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోవటానికి ప్రధాన కారణమైన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ రాజీనామా, రాజస్థాన్ సిఎం వసుంధర రాజె రాజీనామాల వ్యవహారం ఎటూ తేలనందున గతంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని కాంగ్రెస్ చేస్తున్న వాదన సభ నిర్వహణపై అనుమానాలకు తావిస్తోంది. వర్షాకాలం సమావేశాలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ దేశంలో ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్న అసహనం, ధరల పెరుగుదల, తిరోగమనంలో నడుస్తున్న పారిశ్రామిక వృద్ధి, రక్షణపరంగా ఎదురవుతున్న సమస్యలపై చర్చించి తీరాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ రాజకీయ పార్టీలు, మేధావులు, కళాకారులు వివిధ రూపాల్లో వ్యక్తం చేసిన నిరసనలు ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారుతున్నాయి. అసహనంపై చర్చకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, అసహనాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఉభయ సభల్లో ఆమోదించి తీరాలని విపక్షాలు పెడుతున్న మెలికతో ప్రభుత్వం ఇరుకునపడనుంది. తీర్మానంతో పనిలేకుండా చర్చకే పరిమితం కావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రతిపక్షాలు ఒప్పుకునే అవకాశాలు లేనందున, ఏం జరుగుతుందో వేచిచూడక తప్పదు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాకరంగా భావిస్తున్న జిఎస్‌టి బిల్లుకు ఈ సమావేశంలోనైనా మోక్షం లభించటం, అసహనం విషయంలో ప్రభుత్వం వ్యవహరించే తీరుపైనే ఆధారపడి ఉంటుంది. దేశాభివృద్ధి దృష్ట్యా జిఎస్‌టికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విజ్ఞప్తి చేశారు. మరోపక్క ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నాయకత్వంతో ముఖాముఖి మాట్లాడి, ఆ పార్టీ ప్రతిపాదించిన సవరణల ఆమోదానికి అంగీకరించారు. ఒకపక్క తమ మద్దతు కోరుతూనే మరోపక్క ఆర్థిక మంత్రి జైట్లీ సహా అనేకమంది మంత్రులు ప్రతిపక్షాలు సహకరించనందునే జిఎస్‌టి ఆగిపోతోందని దుమ్మెత్తి పోస్తున్నందున, జిఎస్‌టి బిల్లుకు తమ మద్దతు ఆశించటం అత్యాశే అవుతుందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించటం గమనార్హం. ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్న ధరలను అదుపు చేయటంలో విఫలమవుతున్న ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలపై అదనపు పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఎం పక్ష నాయకుడు సీతారామ్ ఏచూరి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్ల నుంచి 45 డాలర్లుకు పడిపోయినప్పటికీ, పెట్రోల్, డీజీల్ ధరలు ఆ మేరకు తగ్గకపోగా ఎప్పటికప్పుడు ధరలను చమురు కంపెనీలు పెంచటం ధరలపై విపరీతమైన ప్రభావం చూపిస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు, ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానాలో సజీవ దహనమైన దళిత పిల్లలను కించపర్చే తీరులో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్, గొడ్డు మాంసం విషయంలో సంఘీయులైన మంత్రులు చేసిన వ్యాఖ్యలపై దుమారం లేచే అవకాశాలు ఉన్నాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను అగౌరవ పర్చే తీరులో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసే అవకాశాలున్నాయి.