జాతీయ వార్తలు

విహారయాత్రలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ అద్దంకి, మే 29: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సమీపంలో గల టప్పల్ జేవర్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఆగివున్న చమురు ట్యాంకర్‌ను ఢీకొనడంతో అద్దంకి పట్టణానికి చెందిన ట్రావెల్ ఏజెంట్ గడిపల్లి ఆంజనేయులు (50), క్లీనర్ శ్రీధర్ (25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల సమీపప్రాంతం జేవర్‌లోని కైలాష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చుట్టుపక్కల గ్రామాల నుంచి తీర్థ యాత్రలకు బయల్దేరిన 40 మంది యాత్రికులు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆగ్రా వైపు వెళ్తుండగా అర్ధ రాత్రి రెండున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ప్రాంతం జేవర్‌లోని కైలాష్ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన గడ్డమడుగు వెంకటేశ్వర్లు, బొల్లినేని అరుణ, సందిరెడ్డి రమాదేవి, చప్పిడి హనుమంతరావు, కందిమళ్ల అంజమ్మ, చప్పిడి శివలక్ష్మమ్మ, నాదెండ్ల హైమావతి, సుబ్బాయమ్మ, నరసమ్మ, వాణి, తేజ, అద్దంకి పట్టణానికి చెందిన కొల్లా అంజమ్మ తీవ్రంగా గాయపడిన వారిలో ఉన్నారు. అర్ధ రాత్రి ఈ ఘటన జరగటం వల్ల చాలామంది నిద్రలో ఉన్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన గంట తర్వాత ధాభాలో అల్పాహారం తీసుకున్న తర్వాత తనకు నిద్ర వస్తోందని ట్రావెల్ ఏజెంట్‌కు చెప్పినా వినలేదని డ్రైవర్ సురేశ్ విలేఖరులకు తెలిపాడు. యమునా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఆగి ఉన్న విషయం తాను గమనించానని, 50 అడుగుల దూరంలో ఉన్నప్పుడు చూశానని, అప్పుడు బ్రేకులు వేసినప్పటికీ బస్సు నియంత్రణలోకి రాలేదని ఆ బస్సు డ్రైవర్ సురేశ్ తెలిపాడు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించి ఢిల్లీ తరలించి, ఇక్కడి నుంచి సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గాయపడిన వారిలో 15 మందిని ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలించిన అధికారులు, ఈ ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను సోమవారం విజయవాడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
కొటికలపూడిలో మిన్నంటిన రోదనలు
విహారయాత్రకు వెళ్లిన తమ కుటుంబీకులు రోడ్డుప్రమాదం బారిన పడ్డారన్న వార్త తెలియగానే గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విహారయాత్రలో ఎక్కువ మంది కొటికలపూడి గ్రామస్థులే కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ వారికి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫోన్లు చేసినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏమైందోనని ఆందోళన చెందారు. కొటికలపూడి గ్రామస్థులు ఎవరూ మృతి చెందలేదని, తీవ్ర గాయాలయ్యాయని తెలియడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.