జాతీయ వార్తలు

రాజస్తాన్ నుంచి వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ అభ్యర్థిత్వాల పట్ల కర్నాటక బిజెపి, ఆంధ్ర తెలుగుదేశం పార్టీల నుంచి గట్టి వ్యతిరేకత రావటంతో బిజెపి అధినాయకత్వం చివరి నిమిషంలో నిర్ణయాలు మార్చుకుంది. వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల కర్నాటక బిజెపిలో తిరుగుబాటు పరిస్థితులు తలెత్తడంతో, ఆయనకు రాజస్తాన్ నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించింది. సీతారామన్ విషయంలో తెలుగుదేశం పార్టీ సైతం గట్టి పట్టుదలతో ఉండటంతో, ఆమెకు ఆంధ్రకు బదులు కర్నాటక నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించారు. బిజెపి అధినాయకత్వం ఆదివారం సాయంత్రం రాజ్యసభకు పార్టీ తరఫున పోటీ చేయబోయే 12మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. వెంకయ్య సహా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓంప్రకాశ్ మాథుర్, కేంద్ర సహాయ మంత్రి హర్షవర్ధన్, రాంకుమార్ వర్మలకు రాజస్తాన్ నుండి అవకాశం కల్పించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, కేంద్ర ఇంధన మంత్రి పియూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రూపాల, అనిల్ మాధవ్ ధవేలకు హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల నుంచి అవకాశం కల్పించింది. అలాగే రాంవిచార్ నేతం, గోపాల్ నారాయణ్ సింగ్‌లకు చత్తీస్‌గఢ్, బీహార్ నుంచి టికెట్ కేటాయించింది. వెంకయ్యనాయుడిని ముందు నిర్ణయించిన ప్రకారం కర్నాటక నుంచి నాలుగోసారి రాజ్యసభకు తీసుకురావాలని అధినాయకత్వం నిర్ణయించింది. బిజెపి కర్నాటక శాఖ అధ్యక్షుడు యెడ్యూరప్ప బెంగళూరులో పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి వెంకయ్యను రాజ్యసభకు పంపించేందుకు ఒక తీర్మానం చేసి ప్రకటించారు. అయితే వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల కర్నాటక బిజెపి ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు సైతం గట్టిగా వ్యతిరేకించటం, సోషల్ మీడియాలో ఈ అంశంపై దుమారం చెలరేగటంతో బిజెపి అధినాయకత్వం వెంకయ్య అభ్యర్థిత్వం విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంది. కర్నాటక బిజెపి ఎమ్మెల్యేలు అంతర్గతంగా తిరుగుబాటుకు సిద్ధం కావటంతో వెంకయ్యకు బదులు నిర్మలా సీతారామన్‌కు రాజ్యసభ టికెట్ ఇచ్చారని అంటున్నారు. వెంకయ్యకు బదులు మరెవ్వరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని పార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పటంతో అధినాయకత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు.
రాష్ట్రానికి ఏమీ చేయలేదు
వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదని, ఈ పరిస్థితుల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించటం సాధ్యంకాదని తెలుగుదేశం బిజెపికి స్పష్టంగా చెప్పటంతో పరిస్థితి మారిందని అంటున్నారు. పైగా తెలుగుదేశం ఎంపీలతో ఆమె సక్యంగా ఉండేవారు కాదని పార్టీ నేతలు ఆరోపించినట్టు తెలిసింది. కేంద్ర శాస్త్ర, విజ్ఞాన శాఖామంత్రి సుజనా చౌదరి ఇటీవల ఢిల్లీకి వచ్చి తెలుగుదేశం నిర్ణయాన్ని బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు తెలియజేసి వెళ్లారని అంటున్నారు. నిర్మలా సీతారామన్‌కు బదులు బిజెపికి చెందిన మరెవ్వరికైనా టికెట్ కేటాయించేందుకు తాము సిద్ధమేనని తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు తెలిసింది. అందుకే బిజెపి అధినాయకత్వం ఇప్పుడు నిర్మలా సీతారామన్ స్థానంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించాలని ఆలోచిస్తోంది. సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ప్రతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులును గవర్నర్‌గా నియమించటంతోపాటు పార్టీ సూచించే మరో నాయకుడిని ఒక జాతీయ కార్పొరేషన్‌కు అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం రెండు గవర్నర్ పదవులను డిమాండ్ చేస్తున్నా, బిజెపి ప్రస్తుతానికి ఒక గవర్నర్ పదవి, మరో నాయకుడికి కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వొచ్చని అంటున్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న తెలుగుదేశం పార్టీ డిమాండ్ కూడా బిజెపి అధినాయకుల పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.