జాతీయ వార్తలు

కొలువుదీరిన ‘దీదీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 27: తృణమూల్ కాం గ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు 41 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, రాష్ట్ర బిజెపి మమత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశాయి. అయితే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, అశోక్ గజపతి రాజు, బాబుల్ సుప్రియో మమత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, యుపి సిఎం అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సువిశాలమైన రెడ్‌రోడ్డులో జరిగిన కార్యమ్రంలో రాష్ట్ర గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ 61 ఏళ్ల మమత చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. తన ట్రేడ్‌మార్క్ అయిన తెల్లని నూలుచీర ధరించి దక్షిణ కోల్‌కతా కాళీఘాట్‌లోని తన నివాసంనుంచి బయలుదేరిన మమత కారు ఎక్కడానికి ముందు జనానికి అభివాదాలు చేస్తూ కొద్దిదూరం నడిచారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, బిజెపిలను చిత్తుగా ఓడించి 294 స్థానాలున్న అసెంబ్లీలో 211 స్థానాలను గెలుచుకొని తృణమూల్ కాంగ్రెస్‌ను మమత విజయపథంలో నడిపించిన విషయం తెలిసిందే. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, డిఎంకెకు చెందిన కనిమోళితో ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అయితే ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పాల్పడిన హింసకు నిరసనగా కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, రాష్ట్ర బిజెపి నాయకులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తితో కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయినట్లు అరుణ్ జైట్లీ విలేఖరులకు చెప్పారు.
42 మంది సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 29 మంది క్యాబినెట్ మంత్రులు, అయిదుగురు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రులు, 8 మంది సహాయ మంత్రులున్నారు. క్యాబినెట్ మంత్రుల్లో అమిత్ మిత్రా, సుబ్రతా ముఖర్జీ, పార్థా చటర్జీ, శోభనాదేబ్ చటోపాధ్యాయ్, ఫిర్హాద్ హకీమ్ లాంటి ప్రముఖులతో పాటుగా కోల్‌కతా మేయర్ సోవన్ చటర్జీ ఉన్నారు. మహిళా మంత్రుల్లో శశి పంజా, అసిమా పాత్రా, సంధ్యారాణి తుడు ఉన్నారు. మంత్రుల్లో 18 మంది కొత్త వారున్నారు. టీమిండియా జట్టులో గతంలో ఆడిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లాతోపాటుగా ఇటీవల రిటైరయిన ఇద్దరు మాజీ ఐపిఎస్ అధికారులు అబనీ జోర్దార్, జేమ్స్ కుజుర్, ప్రముఖ నేపథ్య గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రనీల్ సేన్‌కు కూడా మమత తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
ప్రమాణ స్వీకారం తర్వాత మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయం అయిన ‘నబన్నా’కు వెళ్లారు. అక్కడ ఆమెకు రాష్ట్ర పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మమత సచివాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆమెపై పుష్పవర్షం కురిపించారు. కాగా, తాను ఒక మామూలు మనిషినని, తన జీవితం ప్రజల కోసమే అంకితమని ఈ సందర్భంగా మమత అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీని అభినందిస్తున్న రాష్ట్ర గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ