జాతీయ వార్తలు

బాలలకు ఇక బేడీలుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న బాల నేరస్థుల చట్టం (జువనైల్ జస్టిస్ యాక్ట్) 2015 ప్రకారం చట్టవిరుద్ధంగా 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులకు చేతులు బేడీలు వేయడం కానీ జైల్లో లేదా పోలీసు స్టేషన్‌లోని లాకప్‌లో పెట్టడం కానీ చేయకూడదు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేశారు. పోలీసులు, జువనైల్ జస్టిస్ బోర్డు, బాల న్యాయస్థానాలులాంటివి బాల నేరస్థుల విషయంలో చట్ట విరుద్ధంగా పాటించకూడని అనేక అంశాలు ఈ ముసాయిదా నిబంధనల్లో ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం బాల నేరస్థులకు సరయిన వైద్య చికిత్స అందించడంతో పాటు ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. చిన్నారుల ప్రయోజనాలను పూర్తిగా కాపాడాలన్న, పునరావాసం కల్పించి, సమాజంలో వారు తిరిగి మమేకం అయ్యేలా చూడాలన్న సూత్రానికి జువనైల్ బోర్డు, బాలల న్యాయస్థానం పూర్తిగా కట్టుబడి ఉండాలని ముసాయిదా నిబంధనలను విడుదల చేసిన తర్వాత మేనకా గాంధీ అన్నారు.
ఈ నిబంధనల ప్రకారం నేరాలకు పాల్పడిన పిల్లలకు పునరావాసం కల్పించడం కోసం ప్రతి రాష్ట్రం కూడా కనీసం ఒక సురక్షిత ప్రాంతాన్నయినా ఏర్పాటు చేయాలి. ఒక సీనియర్ జడ్జి, అడ్వకేట్లు, జువనైల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు, మానసిక చికిత్స నిపుణులు, పౌర సమాజం వంటి వివిధ రంగాలకు చెందిన వారితో కూడిన కమిటీ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ఏ అవసరాలకయినా చిన్నారులను విక్రయించడం, సమీకరించడం, బాలల సంరక్షణ కేంద్రాల్లో కఠిన శిక్షలు విధించడం, మిలిటెంట్లు, లేదా పెద్దల ముఠాలు పిల్లలను ఉపయోగించుకోవడం, మద్యం, మాదకద్రవ్యాలు, మత్తు కలిగించే పొగాకు ఉత్పత్తులు లాంటివి పిల్లలకు ఇవ్వడం లాంటి బాలలపై జరుగుతున్న కొత్త నేరాలను కూడా ఈ ముసాయిదాలో చేర్చారు.
అలాగే బాల నేరస్థుల వయసు నిర్ధారణకు పాటించాల్సిన నిబంధనలను సైతం ఇందులో పొందుపర్చారు. దరఖాస్తు సమర్పించిన 30 రోజుల్లోగా జువనైల్ జస్టిస్ బోర్డు లేదా కమిటీ చిన్నారి వయసును ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ వైద్యుల అభిప్రాయం అవసరమైన పక్షంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేసే మెడికల్ బోర్డులనుంచి దాన్ని తీసుకోవాలి. ‘ఒక వేళ మెడికల్ బోర్డులు గనుక భిన్నమైన వయసులను ఇచ్చినట్లయితే చిన్నారికి ప్రయోజనం కల్పించడం కోసం తక్కువ వయసును పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఓ అధికారి స్పష్టం చేశారు.

జర్నలిస్టు హత్య కేసులో
ఐదుగురు అరెస్టు

పాట్నా, మే 25: బిహార్‌లో పాత్రికేయుడు రాజ్‌డియో రంజన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సివాన్ జిల్లాలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ సునీల్‌కుమార్ వెల్లడించారు. రోహిత్ కుమార్, విజయ్ కుమార్ గుప్తా, రాజేశ్ కుమార్, ఐషు కుమార్, సోను కుమార్ గుప్తాలను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 7.56 బోర్ దేశవాళీ తుపాకీ, మూడు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జర్నలిస్టు రంజన్‌పై తానే కాల్పులు జరిపినట్టు రోహిత్ కుమార్ ఒప్పుకున్నాడని పోలీసు అధికారి చెప్పారు. ఈ కేసులో మరికొందరి కోసం గాలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాజ్‌డియో రంజన్ ఓ స్థానిక పత్రికకు బ్యూరో ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ నెల 13న సివాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని పండ్ల దుకాణం వద్ద ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జర్నలిస్టు హత్య ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బిహార్‌లో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి రంజన్ హత్యే ఉదాహరణగా పేర్కొన్నారు.

తాలిబన్ కొత్త అధినేతగా
హయిబతుల్లా అఖుంద్‌జద

కాబూల్, మే 25: అఫ్గాన్ తాలిబన్ అధినేత ముల్లా అఖ్తర్ మన్సూర్ అమెరికా ద్రోన్ దాడిలో మృతిచెందిన విషయం వాస్తవమేనని ఆ ఉగ్రవాద సంస్థ ధ్రువీకరించింది. ప్రభావశీలుడయిన మత నాయకుడు హయిబతుల్లా అఖుంద్‌జదను కొత్త అధినేతగా ప్రకటించింది. ‘షురా (సుప్రీం కౌన్సిల్) ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం మేరకు ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబన్) కొత్త నాయకుడిగా హయిబతుల్లా అఖుంద్‌జద నియమితుడయ్యాడు. సభ్యులంతా హయిబతుల్లా పట్ల విధేయతను ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేశారు’ అని ఆ సంస్థ పేర్కొంది. పాకిస్తాన్‌లో సమావేశమైన తాలిబన్ సుప్రీం కౌన్సిల్ హయిబతుల్లాను తమ కొత్త అధినేతగా ఎన్నుకుంది. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకుబ్, అమెరికా బలగాలకు కొరకరాని కొయ్యగా భావిస్తున్న సిరాజుద్దీన్ హక్కాని.. అఖుంద్‌జదకు డిప్యూటీలుగా నియమితులయ్యారు.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ముల్లా యాకుబ్, సిరాజుద్దీన్ హక్కానీలే తాలిబన్ అధినేత పదవికి తొలుత ముందు వరుసలో ఉన్నారు. కాని, వారిద్దరు ఆ పదవిని స్వీకరించడానికి తిరస్కరించడంతో హయిబతుల్లా అధినేత అయ్యాడు. తాను చాలా చిన్న వయస్సు వాడినయినందున ఆ పదవిని స్వీకరించబోనని ముల్లా యాకుబ్ పేర్కొన్నాడు. మన్సూర్ డిప్యూటి, హక్కాని నెట్‌వర్క్ ఆపరేషనల్ అధినేత అయిన సిరాజుద్దీన్ హక్కాని వ్యక్తిగత కారణాల వల్ల తాలిబన్ అధినేత పదవిని స్వీకరించడానికి తిరస్కరించాడు. హయిబతుల్లా గతంలో మన్సూర్ డిప్యూటిగా పనిచేశాడు.