జాతీయ వార్తలు

సిఎం అభ్యర్థిగా ప్రియాంక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ప్రియాంకా గాంధీని రంగంలోకి దించాలనే ప్రతిపాదనను అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
సోనియా గాంధీ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించినప్పుడు ప్రియాం కా గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే కాంగ్రెస్ అధినాయకత్వం లక్ష్యం. ఈ లక్ష్య సాధనకోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలు తీసుకుంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్‌కు పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కాంగ్రెస్‌కోసం ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేసే బాధ్యతను ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ప్రశాంత్ కిశోర్ ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి పార్టీ సీనియర్, జూనియర్ నాయకులతో చర్చించిన అనంతరం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు ప్రకటించాలని మొదట ప్రతిపాదించారు. అయితే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థి కాబట్టి ఆయనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం సాధ్యం కాదని అధినాయకత్వం స్పష్టం చేసింది. అలాకాని పక్షంలో ప్రియాంకకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచటం కష్టమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రియాంకా గాంధీ ఇంతకాలం రాయబరేలీ, అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సోనియా, రాహుల్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ నియోజకవర్గాల అభివృద్ధి, ఇతర పనులను సైతం సమీక్షిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర మొత్తం రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో పర్యటించి పార్టీని పటిష్టం చేయటంతోపాటు స్థానిక నాయకత్వానికి విశ్వాసం కలిగించే పక్షంలోనే ఎన్నికల్లో విజయం సాధించగలుగుతామని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ప్రియాంకా గాంధీని వీలున్నంత త్వరగా రాజకీయాల్లోకి తీసుకురావటం మంచిదని వారు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాది, ప్రధాన ప్రతిపక్షమైన బహుజన సమాజ్‌వాది పార్టీలు ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లలో మునిగిపోయాయి. రాష్ట్రంలోని 80 లోక్‌సభ సీట్లలో బిజెపికి 71, దాని మిత్రపక్షమైన అప్నాదళ్‌కు రెండు సీట్లుంటే సమాజ్‌వాదీ పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సీట్లు గెలుచుకున్నా, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి కూడా రోజురోజుకూ దిగజారుతోంది. మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి బాగా మెరుగుపడుతోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్‌పి విజయం సాధించటం ఖాయమనే మాట వినిపిస్తోంది. అందుకే మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించటం లేదు. బిఎస్‌పితో పొత్తు పెట్టుకుంటే మంచి ఫలితాలను సాధించగలుగుతామని కాంగ్రెస్ భావిస్తోంది. మాయావతి పొత్తుకు ఒప్పుకోకుంటే చిన్నాచితకా పార్టీలతో కలిసి బరిలోకి దిగాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగితేతప్ప కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగపడవనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది.