జాతీయ వార్తలు

హరీశ్‌రావతే విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11:ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య విరుద్ధంగా బర్త్ఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించారంటూ చివరివరకూ న్యాయపోరాటం చేసిన హరీశ్‌రావత్ అంతిమ విజయం సాధించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం జరిగిన బల పరీక్షలో హరీశ్ రావత్ ప్రభుత్వం విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులోనే ఈ విషయాన్ని ప్రకటించడం ద్వారా ఉత్తరాఖండ్ వివాదం నుంచి కేంద్రం గౌరవప్రదంగా బయటపడగలిగింది. రావత్ సర్కార్ విజయం సాధించిన నేపథ్యంలో రాష్టప్రతి పాలనను తొలగిస్తామని, అది జరిగిన వెంటనే ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు సంబంధించిన ఫలితాల సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఎస్‌కె సింగ్‌లతో కూడిన బెంచి తెరవక ముందే అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ రాజ్యాంగ, రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టు రావత్ సర్కార్ బలపరీక్షను నిర్వహించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. పోలైన మొత్తం 61ఓట్లలో రావత్‌కు 33 బిజెపికి 28ఓట్లు వచ్చాయన్న విషయాన్నీ రోహద్గీ సుప్రీం కోర్టుకు నివేదించారు. ఆ సమయంలో కోర్టులోనే ఉన్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు నిష్పాయిక ప్రకటన అంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇందుకు సంబంధించి ఉత్తర్వు జారీ చేసిన సుప్రీం కోర్టు ‘కేంద్రం ప్రజాస్వామ్యానికి పట్టం కట్టింది’అని వ్యాఖ్యానించి ఆ మాటను రికార్డు చేసింది. మే పదో తేదీన ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నిష్పాక్షిక రీతిలో, ఎలాంటి రాజకీయ అలజడులకు తావు లేకుండా ఓటింగ్ జరిగిందని, అందులో రావత్ విజయం సాధించారని రోహద్గీ విచారణకు ముందే వెల్లడించారు. అయితే రాష్టప్రతి పాలన రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్ కొనసాగుతుందని, దాన్ని న్యాయబద్ధంగా సమీక్షిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ స్పీకర్ తమపై అనర్హత వేటువేయడాన్ని సవాలుచేస్తూ తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని కోర్టు తెలిపింది. వీరందరికీ ఓటు హక్కును కల్పించి ఉంటే బిజెపికి అనుకూలంగానే ఫలితం వెలువడి ఉండేదన్న విషయం ఫలితాల మధ్య ఉన్న స్వల్ప తేడాను బట్టి తెలుస్తోంది. కాగా, ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లదని భవిష్యత్ విచారణలో కోర్టు స్పష్టం చేసే పక్షంలో రావత్ సర్కార్ అసెంబ్లీలో మరోసారి బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి పదవిని రావత్ చేపట్టినా అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు అనుకూలంగానే తాము తీర్పును వెలువరించే పక్షంలో ఆయన మళ్లీ బలపరీక్షను ఎదుర్కోవాల్సిందేనని జస్టీస్ మిశ్రా తెలిపారు. స్పీకర్ తనపై అనర్హత వేటువేయడాన్ని సవాలు చేస్తూ రెబెల్ ఎమ్మెల్యే షీలా రాణి రావత్ అలజడి సృష్టించడంతో కోర్టు వ్యవహారాలకు కొంత అంతరాయం కలిగింది. మార్చి 27న ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించారని, ఆ రోజు సాయంత్రమే స్పీకర్ తనపై అనర్హత వేటు వేశారని పేర్కొన్న షీలా రాణి ‘రాష్టప్రతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత నాపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఎక్కడ ఉంటుంది’అని ప్రశ్నించారు. రాష్ట్ర శాసన సభే రద్దయినప్పుడు..రాష్టప్రతి పాలన అమలులో వచ్చిన తర్వాత అసలు స్పీకర్‌కు ఏ రకమైన అధికారం ఉంటుందని నిలదీశారు. ఇప్పటి వరకూ ఎందుకు తమ ముందుకు రాలేదని ప్రశ్నించిన సుప్రీం బెంచి ఆమె పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

చిత్రం... సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా ప్రకటించడంతో రావత్ అభిమానుల ఆనందం