జాతీయ వార్తలు
కోవిడ్‌పై సమర సైరన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మార్చి 19: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా వైరస్‌తో పోరాడేందుకు వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించడం ద్వారా దేశమంతా స్వచ్ఛంద ‘లాక్ డౌన్’ను ప్రకటించింది. కరోనా మూలంగా రానున్న ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు కూడా ప్రజలు సిద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఓడించేందుకు దేశ ప్రజలు రానున్న ఆదివారం అంటే మార్చి 22 తేదీనాడు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించాలని, ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. మహమ్మారిగా మారిన కరోనావైరస్ దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక ప్రభుత్వాలు ఉదయం ఏడు గంటలు, రాత్రి తొమ్మిది గంటలకు సైరన్లు మోగించటం ద్వారా జనతా కర్ప్యూ ప్రారంభం, ముగింపు సంకేతాలు ఇవ్వాలని నరేంద్ర మోదీ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీసీ తదితర సంస్థలు జనతా కర్ప్యూ గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ‘ప్రజలు రానున్న కొన్ని వారాల పాటు ఏకాంతంగా ఉండాలి. 60, 65 సంవత్సరాల వయస్సున్న పెద్ద వారిని, పది సంవత్సరాల లోపు చిన్న పిల్లలను కరోనా వైరస్ అదుపులోకి వచ్చేంత వరకు ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకూడదు’అని మోదీ స్పష్టం చేశారు. అంతా బాగున్నదనుకుంటూ స్వేచ్ఛగా తిరిగితే వైరస్ మహమ్మారి బారిన పడతారని ఆయన ప్రజలను హెచ్చరించారు. కరోనా వైరస్‌తో పోరాడేందుకు దేశ ప్రజలు సంకల్పం, సంయమనంతో వ్యవహరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ‘కరోనా వైరస్ వచ్చిన తరువాత గత రెండు నెలల నుండి మనకు సేవ చేస్తున్న వివిధ సంస్థల వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చే అదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంటి తలుపు, కిటికీ వద్ద లేదా బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టి లేదా గంటలు
మోగించండి’అని ఆయన అన్నారు. పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలే కరోనా వైరస్‌ను ఎదుర్కొనలేకపోతున్నాయనేది గుర్తించాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలు, సలహాలను తూ.చ తప్పకుండా పాటించాలని మోదీ సూచించారు. ఏ మాత్రం ఏమరపాటు తగదని ప్రతి పౌరుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని మోదీ నొక్కిచెప్పారు. ‘నేను మిమ్మల్ని ఎప్పుడు ఏం అడిగినా మీరు నన్ను నిరాశపరచలేదు. ఈరోజు 130 కోట్ల మంది దేశ ప్రజలను అడిగేందుకు ముందుకు వచ్చాను. మీకు చెందిన రానున్న కొన్ని వారాలు నాకు కావాలి. మీ సమయం కావాలి’ అని అని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ‘మన వైద్య విజ్ఞానం కరోనా వైరస్‌ను నిరోధించే మందులు కనిపెట్టలేదు. అదుపు చేసే దారి చూపించలేకపోతోంది. ఈ నేపథ్యంలోప్రజల్లో భయాందోళనలు పెరగటం సహజం’ అని మోదీ అభిప్రాయపడ్డారు. వైరస్ బాగా వ్యాపించిన దేశాల్లో మొదట ఇది కొంత మేరకే వ్యాపించి ఆ తరువాత కొన్ని రోజులకు బాధితులు సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం ఆ దేశ ప్రజలు జాగ్రత్త పడకపోవటమేనని ప్రధాన మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా వైరస్ మూలంగా ఉత్పన్నతమైన సంకటం చిన్నది కాదు, ఇది అత్యంత భయంకరమైందని ఆయన చెప్పారు. ‘పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ సృష్టిస్తున్న అల్లకల్లోలాన్ని మనం చూస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. ఆందుకే అందరం సంకల్పం, సంయమనం పాటించవలసిన అవసరం ఉందన్నారు. 130 కోట్ల మంది భారతీయులు కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు బాధ్యతతో వ్యవహరించవలసిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు. ఒక పౌరుడిగా తన కర్తవ్యాలను పాటిస్తాననే గట్టి నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తూ.చ. తప్పకుండా పాటిస్తాననే సంకల్పం తీసుకోవాలని నరేంద్ర మోదీ చెప్పారు. వైరస్ నుండి తమను తాము కాపాడుకోవటంతోపాటు తోటి వారిని కూడా కాపాడుతామనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘మనం బాగుండాలి. మనవారు కూడా బాగుండాలి. మనం బాగుంటేనే ఇతరులను బాగా ఉంచగలుగుతామనేది గ్రహించాలి’అని ఆయన స్పష్టం చేశారు.
సమూహాలు, గుంపుల నుంచి దూరంగా ఉండాలన్నారు. ఇంటి నుండి బయటకు రాకుండా ఉండటం, అందరి నుండి దూరంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించాలంటే అందరికి దూరంగా ఉండటం చాలా అవసరమని మోదీ స్పష్టం చేశారు.‘మార్కెట్లలో తిరిగితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు అన్యాయం చేసినవారవుతారు’అని ఆయన హెచ్చరించారు. దేశ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, రానున్న కొన్ని వారాల పాటు అవసరముంటేనే ఇంటినుండి బయటకు రావాలి అది మోదీ సూచించారు. వ్యాపారం, కార్యాలయం పనులను వీలుంటే ఇంటి నుండే చేయాలని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులు, మీడియా బయటకు వెళ్లి పని చేయటం అవసరం కానీ సమాజంలోని ఇతర వర్గాల ప్రజలు సభలు, సమావేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర కార్యాలయాలకు వెళ్లకూడదని ఆయన చెప్పారు. 60, 65 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఇంటి నుండి బయటకు రావొద్దని ప్రధాని సూచించారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రభావితం కాని దేశాలు ఇప్పుడు కరోనా వల్ల ప్రభావితమయ్యాయన్నారు. కాగా కరోనా మహమ్మారితో ఏ మేరకు పోరాడగలుగుతామనేది జనతా కర్ప్యూ సూచిస్తుందన్నారు. ఈ కష్టకాలంలో అత్యవసర సేవలు, ఆసుపత్రులపై భారం పెరగకుండా చూసుకోవాలి. వైద్యులు, పారా మెడికల్ స్ట్ఫా కరోనావైరస్పై దృష్టి పెట్టేందుకు వీలు కల్పించాలన్నారు. మామూలు చెకప్‌ల కోసం ఆసుపత్రికి వెళ్లవద్దు, వీలున్నంత వరకు ఆసుపత్రులకు వెళ్లవద్దు, మరీ అవసరమైన కుటుంబ వైద్యుడితో ఫోన్‌పై సలహాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. శస్త్ర చికిత్సల తేదీలు నిర్దారించుకుంటే వాయిదా వేయించుకోవాలన్నారు. ‘కరోనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆర్థిక మంత్రి నాయకత్వంలో ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశాం. వీరు అందరితో మాట్లాడుతూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని అమలు చేస్తుంది’అని అన్నారు. కరోనా వైరస్ మధ్యతరగతి, బడుగు వర్గాల వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. ఉన్నత వర్గాల వారు కింది స్థాయి వారి ఆర్థికావసరాలు తీర్చాలన్నారు. ఇలాంటి వారు ఆఫీసుకు రాకపోతే వేతనాలు కట్ చేయవద్దు, పూర్తి వేతనం చెల్లించాలని ప్రధాని సూచించారు. పాలు, ఆహార పదార్థాలు, మందుల కొరత ఏర్పడకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఆహార పదార్థాలు నిల్వచేయవద్దు, భయపడవద్దు, భయపడి నిల్వకోసం పోటీ పడవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కరోనా వైరస్ కష్టం చాలా పెద్దది. ఒక దేశం మరో దేశానికి సహాయం చేసే పరిస్థితిలో లేదు. అందుకే ప్రజలు దృఢ సంకల్పంతో వైరస్‌ను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రజలందరూ స్వయ రక్షణతో పాటు దేశ రక్షం, ప్రపంచ రక్షణ కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
*చిత్రం... ప్రధాని మోదీ