జాతీయ వార్తలు
దేశంలో మూడో కరోనా మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ/ముంబయి, మార్చి 17: భారత్‌లో మూడో కరోనా మృతి నమోదైంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 63 ఏళ్ల వ్యక్తి వైరస్‌తో మరణించాడు. మంగళవారం నాటికి దేశంలో 137 కరోనా పాజిటీవ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐరోపా దేశాలు, టర్కీ, యూకే నుంచి భారత్‌లోకి రాకుండా నిషేధం విధించారు. మార్చి 18 నుంచి 31 వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఆఫ్గనిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేసియా ద్వారాలు మూసేశారు. ఆ దేశం నుంచి భారత్‌కు రాకపోకలు బంద్ అయ్యాయి. ఎవర్నీ భారత్‌లోకి అనుమతించడం లేదు. తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని భారత్ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ ప్రయాణికులకు సంబంధించి అడిషనల్ ట్రావెల్ అడ్వయిజరీ బోర్టు ఓ ప్రకటన చేసింది. బహిరంగ స్థలాలు, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తాజ్ మహల్ వంటి ప్రసిద్ధ సందర్శనీయ స్థలాల వద్ద ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ నిపుణుల ఇళ్ల నుంచే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని, ఇళ్లు వదలి రావద్దని ప్రత్యేక ప్రకటను చేశారు. కాగా దుబాయి నుంచి వచ్చిన 63 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 సోకి చనిపోయాడు. ఇది భారత్‌లో మూడో కరోనా మృతి. మహారాష్టల్రో అత్యధికంగా 39 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందు కర్నాటకలోని కలబుర్గికి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌తో మరణించాడు. అతడూ సౌదీ అరేబియా నుంచి వచ్చాడు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 68 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఇప్పటి దేశంలో కరోనా మరణాలు మూడు. ఇలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా లక్షా 82 వేల మంది కోవిడ్-19 బారిన పడినట్టు జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అలాగే 7,100 మంది మృత్యువాత పడ్డారు. కాగా మహారాష్టల్రో కరోనా మృతిని భార్యకూ పాజిటీవ్ వచ్చిందని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె ముంబయిలోని కస్తుర్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంకెంత మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నదీ ట్రావెల్ అడ్వయిజరీ వెల్లడించలేదు. కరోనా మృతిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే మీడియాతో మాట్లాడుతూ బాధితుడు అనేక రుగ్మతలతో బాధపడినట్టు రిపోర్టులున్నాయని స్పష్టం చేశారు. సోమవారం 126 పాజిటీవ్ కేసులుండగా రాత్రి అదనంగా 12 కేసులు బయటపడ్డాయి. ఇవి 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన గణాంకాలని అధికారులు తెలిపారు. బాధితుల్లో 22 మంది విదేశీయులున్నారు. కొత్తగా నొయిడాలో రెండు నమోదయ్యాయి. అందులో ఒకరు ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి. అతడిని ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరొక వ్యక్తిని ఐసొలేషన్‌లో ఉంచినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనురాగ్ భార్గవ వెల్లడించారు. కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు మాట్లాడుతూ ‘ రాష్ట్రంలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి. ఇప్పటికి రాష్ట్రంలో ఇప్పటికి 10 కేసులు నమోదయ్యాయి’అని స్పష్టం చేశారు. కొత్తగా వైరస్ సోకిన ఇద్దర్ని ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల యువతి, 60 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 సోకిందని మంత్రి అన్నారు. ఇలా ఉండగా దేశంలోనే తొలి కరోనా మరణం కర్నాటకలో గత వారం చోటుచేసుకుంది.
మరోపక్క కరోనా పాజిటీవ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టమైన ప్రకటన చేయలేదు. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 13 మందిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. గత నెలలో కేరళలో ముగ్గురికి విజయవంతంగా వైద్యం అందించి డిశ్చార్జి చేసిన కేసులూ అందులో ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర తరువాత కేరళలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు విదేశీయులను కలుపుకొని మొత్తం 24 మందికి వైరస్ సోకింది. ప్రజలందరికీ కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ప్రజలు భయాందోళనకు గురికాకుండా చూడాలని బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక కరోనాను అట్టడి చేయడంలో అవిరళ కృషి జరుపుతున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, విమాన సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. అంతిత భావంతో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ని ఓ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 52 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 126 పాజిటీవ్ కేసులు బయటపడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులు, పరిశుభ్రతపై ప్రజలను అప్రపత్తం చేసినట్టు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, మాల్స్ వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకులను స్వల్పంగానే అనుమతించాలని కూడా సూచించింది. పెళ్లిళ్లు, వేడుకలు సాధ్యమైనంత వరకూ వాయిదా వేసుకోవాలని పేర్కొంది. తీవ్రతనను బట్టి విద్యా సంస్థలు, సినిమా హాళ్లను మూసివేయాలని కోరింది. వీలున్నచోట ఇళ్ల నుంచే పనిచేసుకునేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రెస్టారెంట్ల వంటి చోట్ల వ్యక్తుల మధ్య సాధ్యమైనంత దూరం అంటే సుమారు మీటర్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 వరకూ రెస్టారెంట్లన్నీ మూసేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓనర్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ తరఫున ప్రియాంక్ సుఖిజా వెల్లడించారు. ఫ్లయింగ్ సాసర్, లార్డ్ ఆఫ్ డ్రింక్స్-తమాషాకు చెందిన రెస్టారెంట్లు పలు నగరాల్లో ఉన్నాయి. వాటన్నింటినీ మంగళవారం అర్థరాత్రి నుంచి మూసివేస్తారని అన్నారు. యూపీలో ఏప్రిల్ 2 వరకూ అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్ని రకాల పోటీ పరీక్షలు ఏప్రిల్ 2 వరకూ వాయిదా వేశారు. లక్నో నగరంలోని సందర్శనీయ స్థలాలన్నీ మూసివేశారు.
*చిత్రం...రజోరిలో కరోనాపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్న సైన్యం