జాతీయ వార్తలు

మరో ఐదు కొత్త కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/తిరువనంతపురం, మార్చి 8: దేశవ్యాప్తంగా ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత రీతిలో నివారణ, నిరోధక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఐదు కేసులు వెలుగుచూడడంతో ఈ వైరస్ సోకినవారి సంఖ్య 39కి పెరిగింది. కేరళకు చెందిన ఐదుగురికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. ఇటీవలే ఓ జంట, వారి కుమారుడు ఇటలీ నుంచి వచ్చారని, ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నుంచి తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. వీరితోపాటు వారికి చెందిన మరో ఇద్దరు బంధువులకు కూడా ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించారు. దీంతో కేరళ ప్రభుత్వం కఠిన చర్యలను ప్రకటించింది. ఈ వైరస్ లక్షణాలను దాచినా, ఇది ప్రబలంగా ఉన్న దేశాలకు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెట్టినా ప్రాసిక్యూషన్ సహా అలాంటి వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త కేసుల నేపథ్యంలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్రమత్తం చేశామని ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ వైరస్ సోకిన కుటుంబంతో గత నెల 29న, మార్చి 1న విమానంలో ప్రయాణించిన వారందరూ కూడా వెంటనే రాష్ట్ర ఆరోగ్య అధికారులను సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు. వీరు ప్రయాణించిన విమానాల వివరాలను కూడా ఆమె వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాలని ఖతార్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ విదేశీ పర్యటన వివరాలు దాచిపెట్టినా, వైరస్ లక్షణాలు కప్పిపెట్టినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసులు కూడా దీనిని శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు. తాజాగా వైరస్ సోకిన వారిలో 50 ఏళ్లు పైబడిన ఓ జంట, వారి 24 ఏళ్ల కుమారుడు గత నెల 29న ఇటలీ నుంచి భారత్ వచ్చారని, విమానాశ్రయంలో జరిగే స్క్రీనింగ్ నుంచి తప్పించుకుని బయటపడ్డారని ఆరోగ్య మంత్రి శైలజ తెలిపారు. మిగతా ఇద్దర్నీ కూడా ఈ కుటుంబ బంధువులుగా గుర్తించామని అన్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, చైనా నుంచి ఇటీవల తిరిగివచ్చిన ప్రతిఒక్కరు కూడా సంబంధిత అధికారులను సంప్రదించాల్సిందేనని తెలిపారు. గత మంగళవారం వరకు దేశంలో కేవలం ఆరుకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్ కేసులు ఐదు రోజులు తిరగకుండానే 39కి చేరుకున్నాయి. తమిళనాడులో ఓ 15 ఏళ్ల బాలుడిని వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తరలించారు. సిక్కింతోపాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా విదేశీయులకు రక్షిత ప్రాంత పర్మిట్లను నిలిపివేసింది. ఇటీవల విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చినవారి ద్వారా లేదా భారత్ పర్యటనకు వచ్చిన విదేశీయుల ద్వారా ఈ వైరస్ వ్యాపించినట్టుగా అధికారులు గుర్తించారు. కాగా, కరోనా వైరస్ రోగుల కోసం ప్రత్యేకంగా కొత్త ఎమర్జన్సీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని ఎయిమ్స్ పాలనా యంత్రాంగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. అవసరాన్ని బట్టి వీటికి పడకల సామర్థ్యాన్ని కూడా పెంచాలని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 25 ఆసుపత్రుల్లో 168 ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. గత రెండు వారాల్లో విదేశాల నుంచి తమ ప్రాంతానికి ఎవరు తిరిగి వచ్చినా వారి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు ఏవిధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

*చిత్రం... ఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్