జాతీయ వార్తలు

పార్లమెంటును కుదిపేసిన ఢిల్లీ అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లపై వెంటనే చర్చ జరపాలంటూ ప్రతిపక్షం పట్టుపట్టి గొడవ చేయడంతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలు వాయిదాలు, గొడవ, గందరగోళం మధ్య గురువారానికి వాయిదా పడ్డాయి. లోకసభ మూడు వాయిదాలతో దాదాపు తొమ్మిది నిమిషాలు మాత్రమే కొనసాగింది. రాజ్యసభ సమావేశం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రేపటికి వాయిదా పడింది. ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాటు హోలి పండుగ ప్రశాంతంగా జరిగిన తరువాత ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీ అల్లర్లపై సుధీర్ఘ చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో హామీ ఇచ్చారు. ప్రతిపక్షం మాత్రం ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరపాలని పట్టుపట్టి సభను స్తంభింపజేసింది. రాజ్యసభలో కూడా ఇతే తంతు కొనసాగింది. రాజ్యసభలోనే మీరు శాంతి నెలకొల్పనప్పుడు బయట ఎలా శాంతి నెలకొంటుందని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యులకు చురక వేశారు. హోలి పండుగ జరిగిన తరువాతనే ఢిల్లీ అల్లర్లపై సభలో చర్చ జరుగుతుందని ఆయన కుండబద్దల కొట్టినట్లు చెప్పారు. దీనితో ప్రతిపక్షం సభ్యులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. లోక్‌సభలో దాదాపు ముప్పై మంది కాంగ్రెస్ ఎంపీలు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్రభుత్వం, ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రికి వ్యతిరేక నినాదాలతో సభను స్థంభింపజేశారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు సభకు రాకపోవటంతో ప్యానెల్ స్పీకర్లు కిరిట్ సోలంకి, మీనాక్షి లేఖి సభను నిర్వహించారు.
లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్యానెల్ స్పీకర్ కిరిట్ సోలింకి ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అప్పటికే తమ సీట్లలో నిలబడిన కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షం సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్యానెల్ స్పీకర్ కిరిట్ సోలంకి ఇందుకు అంగీకరించకపోవటంతో దాదాపు 30 మంది ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు దూసుకుని వెళ్ళి గొడవ చేశారు. ‘్ఢల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరగాలి, హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాలి’ అంటూ ప్రతిపక్షాల సభ్యులు సభ అదిరిపోయేలా నినాదాలు ఇచ్చారు. కిరిట్ సోలింకి మాత్రం ప్రతిపక్షం సభ్యుల గొడవ మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. అయినా ప్రతిపక్షం తమ గొడవ ఆపకపోవటంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేచి ఢిల్లీ అల్లర్లపై లోతుగా చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నది, సభలో చర్చ జరపాలంటే మొదట ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఎంతో అవసరం, అందుకే హోలి పండుగ ముగిసిన వెంటనే ఈ నెల 11 తేదీనాడు లోక్‌సభలో, 12 తేదీనాడు రాజ్యసభలో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరుపుతామని ప్రకటించారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడం రాజ్యాంగపరమైన బాధ్యత కాబట్టి ప్రతిపక్షం ఇందుకు అంగీకరించాలని విజప్తి చేశారు. ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వ వాదనను తోసి పుచ్చింది. అల్లర్లు జరిగిన వెంటనే చర్చ జరిపితే సత్ఫలితాలుంటాయి, జాప్యం చేయటం అర్థరహితమని వాదించారు. దీనికి ప్రహ్లాద్ జోషి బదులిస్తూ ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపటం ప్రతిపక్షానికి ఎంత మాత్రం ఇష్టం లేదు, అల్లర్లను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షం మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా పోడియం వద్ద నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. దీనితో కిరిట్ సోలంకి సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం మద్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. లోక్‌సభ మద్యాహ్నం రెండు గంటలకు సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షం సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరపాలంటూ సభ అదిరిపోయేలా నినాదాలు ఇచ్చారు. ప్యానెల్ స్పీకర్ మీనాక్షి లేఖి మంత్రుల చేత రెండు బిల్లులను ప్రతిపాదింప జేసిన అనంతరం లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనే శాంతి లేదు
రాజ్యసభలోనే శాంతి నెలకొల్పలేనప్పుడు బయట శాంతి ఎలా నెలకొంటుందంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ప్రతిపక్షం సభ్యులకు చురకలు వేశారు. రాజ్యసభ ఈరోజు ఉదయం సమావేశం కాగానే అధ్యక్షుడు వెంకయ్యనాయుడు మాజీ సభ్యుల మరణం పట్ల సంతాప తీర్మానాలు చేపట్టారు. ఇది జరిగిన అనంతరం ఆయన ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నించగానే ప్రతిపక్షం అడ్డుపడింది. ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షం సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొలవలసిన అవసరం ఎంతో ఉన్నది, పరీక్షలకు వెళుతున్న విద్యార్థుల్లో ఆందోళన చోటు చేసుకున్నది, ఈ పరిస్థితుల్లో చర్చ జరపటం సాధ్యం కాకపోవచ్చు, హోలి పండుగ ముగిసిన వెంటనే ఈనెల 11 తేదీ తరువాత అల్లర్లపై చర్చ జరుపుతామని ప్రకటించారు. ప్రతిపక్షం మాత్రం ఆయన మాటను బేఖాతరు చేస్తూ నినాదాలు ఇచ్చింది. దీనితో వెంకయ్యనాయుడు సభను గురువారం ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.