జాతీయ వార్తలు

పార్లమెంటులో ‘ఢిల్లీ’ వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల పరస్పర తోపులాటలతో లోక్‌సభ గందరగోళమయంగా మారింది. ఢిల్లీ అల్లర్లపై తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేయడంతోపాటు ఇందుకు బాధ్యత వహించి హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఒకదశలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పరస్పర తోపులాటలూ చోటుచేసుకున్నాయి. ఈ గందరగోళ పరిస్థితులను ప్రతిబింబిస్తూ లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది. సభలో జరిగిన గందరగోళ పరిణామాలు తనకు తీవ్ర మనస్థాపాన్ని కలిగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లీ అల్లర్లపై గందరగోళ పరిస్థితులే కొనసాగాయి. సభ మధ్యకు దూసుకువచ్చిన ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యానర్ పట్టుకుని అధికార పక్ష సభ్యుల వద్దకు దూసుకువెళ్లి అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఓపక్క సభలో చర్చించాల్సిన అంశాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటిస్తున్న సమయంలోనే ఈ గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల విపరీత ప్రవర్తనను ఖండించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభా కార్యకలాపాలను కొనసాగించాలని స్పీకర్‌ను కోరారు. అసలు అల్లర్లు రెచ్చగొట్టింది ఈ వ్యక్తులేనంటూ ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ‘1984లో 3వేల మందిని హతమార్చారు. ఏ రకమైన దర్యాప్తూ చేయలేదు’
అని ఆయన అన్నారు. సభలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి ప్రయత్నించిన స్పీకర్ ఓం బిర్లా తమ తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని ప్రతిపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ ‘మాకు న్యాయం కావాలి. అమిత్ షా ముర్దాబాద్’ అంటూ నినాదాలను విపక్షాలు కొనసాగించాయి. అలాగే, ‘విద్వేష ప్రసంగాలు ఆపాలి. భారత్‌ను పరిరక్షించుకోవాలి’ అన్న ప్లకార్డులను విపక్షాలు ప్రదర్శించాయి. బీజేపీ సభ్యుడు సంజయ్ జైస్వాల్ ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్, రవనీత్ సింగ్ బిట్టూ నల్ల బ్యానర్లు చేపట్టి ఆయన వద్దకు వెళ్లడంతో పరిస్థితి మరింతగా క్షీణించింది. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కొందరు బీజేపీ సభ్యులు ‘మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చోండి’ అని కాంగ్రెస్ సభ్యులను కోరారు. ఆ సమయంలోనే కొందరు కాంగ్రెస్ సభ్యులు తమ చేతిలో ఉన్న పత్రాలను చింపేసి గాల్లోకి విసిరారు. దాంతో బీజేపీ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ సభ్యుల వద్దకు దూసుకువచ్చారు. దాంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని గమనించిన స్పీకర్ సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు. ఆందోళన చెందుతున్న సభ్యులను శాంతింపజేసేందుకు కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ ప్రయత్నించారు. ఈ గందరగోళ సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. సభ మూడు గంటలకు సమావేశమైన తర్వాత కూడా గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. తమవైపు విపక్ష సభ్యులు రాకుండా కొందరు బీజేపీ సభ్యులు ఆ మార్గాన్ని మూసేశారు. కాగా, బీజేపీ సభ్యులు తనపై దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ సభ్యురాలు రమ్య హరిదాస్ ఆరోపించారు. ఆ సమయంలో చైర్మన్ సీటులో ఉన్న బీజేపీ సభ్యురాలు రమాదేవి ‘మీరు చేసింది తప్పు’ అంటూ సభను నాలుగున్నర గంటల వరకు వాయిదా వేశారు. అయినా బీజేపీ సభ్యుల ప్రతి నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘దేశాన్ని ఎవరు రక్షిస్తారు. మేమే రక్షిస్తాం..మేమే రక్షిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. ‘మహాత్మా గాంధీ అమర్ రహే. నకిలీ గాంధీ జైల్ మే రహే’ అన్న నినాదాలు కూడా బీజేపీ సభ్యులు చేశారు. ఒక దశలో ప్రతిపక్ష సభ్యులు అమిత్ షా రాజీనామా చేయాలన్న ప్లకార్డును స్పీకర్ టేబుల్‌పై ఉంచారు. అయితే వెంటనే జోక్యం చేసుకున్న భద్రతా సిబ్బంది దానిని తొలగించారు. సభలో జరుగుతున్న తతంగాన్ని దేశ ప్రజలు చూస్తున్నారని, ఆయా పార్టీలు తమ సభ్యులను అదుపులో ఉంచాలని విపక్ష పార్టీలను ఓం బిర్లా కోరారు. లోక్‌సభ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిదని, ఇక్కడ కొన్ని నిబంధనలు, సంప్రదాయాలూ ఉంటాయని బిర్లా స్పష్టం చేశారు. లోక్‌సభ సభ్యులకు ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విస్మరించకూడదని అన్నారు. సభ నాలుగున్నరకు సమావేశమైన తర్వాత కూడా మాట్లాడిన బిర్లా ‘సభా మర్యాదను పరిరక్షించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికీ చెందిన సభ’ అని అన్నారు. సభలో చోటుచేసుకున్న పరిస్థితులు తనకు మనస్థాపాన్ని కలిగించాయని పేర్కొన్న ఆయన ‘మీకు ఎలాంటి బాధా లేకపోతే నేను ఈ సభలో ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహించలేను’ అని అన్నారు. సభ సజావుగా సాగేలా సీనియర్ సభ్యులు తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే వైద్య బిల్లును, ఖనిజాల చట్టానికి సంబంధించిన సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. అలాగే ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. జేడీయూ సభ్యుడు వైద్యనాథ్ ప్రసాద్ మహతో మృతికి నివాళిగా సోమవారం ఉదయం సభ సమావేశమైన తర్వాత రెండు గంటలకు వాయిదా వేశారు.
ఢిల్లీ అల్లర్ల అంశాన్ని రాజ్యసభలో గట్టిగా ప్రస్తావించిన విపక్ష సభ్యులు ‘దేశ రాజధాని నగరం మండిపోతుంటే కేంద్ర ప్రభుత్వం పెను నిద్ర పోతోంది’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో నినాదాలు చేశారు. శాంతించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎంతగా అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు.

*చిత్రాలు.. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల నిరసన
*రాజ్యసభలోనూ అదే సీను (ఇన్‌సెట్‌లో)