జాతీయ వార్తలు

నేటి నుంచి మళ్లీ పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ మత కలహాలు సహా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్తశ్రస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఢిల్లీ అల్లర్లను నిరోధించడంలో పోలీసులు విఫలమైనందున హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కూడా ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఢిల్లీ అల్లర్లపై చర్చను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఉభయసభల్లోనూ సోమవారం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అల్లర్ల అంశాన్ని తాము పార్లమెంటులో గట్టిగా ప్రస్తావిస్తామని, ఇందుకు దారితీసిన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్న ఆయన అల్లరి మూకలకు, ఒక వర్గం పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీని కారణంగానే అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతగానో ఆస్తినష్టం జరిగిందని అన్నారు. ఢిల్లీ అల్లర్లు దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మసకబార్చాయని అన్నారు. ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమని, దీనిపై తాము కేంద్రాన్ని వదిలేది లేదని చౌదరి తెలిపారు. హోం మంత్రి రాజీనామా చేయాలని ఇప్పటికే తాము డిమాండ్ చేశామని, పార్లమెంటు ఉభయ సభల్లోనూ దీనిని తాము మరింత గట్టిగా వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కూడా పార్లమెంటు ఉభయ సభల్లోనూ బలంగా లేవనెత్తబోతున్నాయి. అంతేకాదు, ఢిల్లీ అల్లర్లపై హోం మంత్రి సమాధానం చెప్పాలని కూడా పట్టుబట్టేందుకు ఈ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ప్రతిపక్ష గళానికి వామపక్ష పార్టీలు మరింత బలాన్ని చేకూరుస్తాయని, ఢిల్లీ హింసను పార్లమెంటులో గట్టిగా నిలదీస్తామని సీపీఎం ఎంపీ కేకే రాజేష్ తెలిపారు. రాజ్యసభలో ఈ అంశంపై చర్చ జరపాలని కోరుతూ 267 నిబంధన కింద తాము ఇప్పటికే నోటీసు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలో హింస పేట్రేగిపోతున్నా పోలీసులు ఎందుకు నిష్క్రియాపర్వంతో వ్యవహరించారన్న దానిపై హోం మంత్రి నుంచి జవాబు కోరుతామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా తెలిపారు. ఇతర పార్టీలతో కలసి విపక్షాల ఉమ్మడి గళాన్ని ఢిల్లీ హింసపై పార్లమెంటులో వినిపిస్తామని, అలాగే బీజేపీ నేతలు చేసిన విద్వేష ప్రసంగాలపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని హోం మంత్రిని కోరుతామని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యత వహించాల్సింది హోం మంత్రి అమిత్ షానేని, ఆయనే జరిగిన దానికి జవాబు చెప్పాలని డీ రాజా అన్నారు. ఢిల్లీ హింసలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని, అల్లరి మూకలపై వారు చర్యలు తీసుకోకపోవడం వల్లే హింస పేట్రేగి 40 మందికి పైగా మరణించారని కాంగ్రెస్ సహా విపక్షాలు ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. దేశంలో ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్య విలువలను మంట గలుపుతున్నారని, దీనిపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబడతామని కాంగ్రెస్ ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్న కాంగ్రెస్ బృందం హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సోనియా సారథ్యంలో ఈ బృందం రాష్ట్రపతిని కలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడింది. అలాగే, అల్లర్లు జరిగిన ప్రాంతానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా పంపారు. అధ్యయనం అనంతరం ఈ బృందం సోనియా గాంధీకి నివేదిక అందిస్తుంది. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాలని అనేక కాంగ్రెసేతర విపక్ష పార్టీలు రాష్టప్రతి కోవింద్‌కు లేఖలు రాశాయి. ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్‌జేడీ, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇప్పటికే హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 31న మొదలైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు సాగాయి. తిరిగి సోమవారం నుంచి మొదలై వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగుతాయి.