జాతీయ వార్తలు

ముచ్చటగా మూడోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఢిల్లీ శాసనసభకు శనివారం జరిగిన పోలింగ్‌లో కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రానున్నట్లు పలు మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎత్తుగడలను చిత్తు చేయడంతో పాటు సీఏఏ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి పరిణాల నేపథ్యంలో కేజ్రివాల్ మరోసారి విజయం సాధిస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. హైదరాబాదు కేంద్రంగా పని చేసే పీపుల్స్ పల్స్ అనే సంస్థ జరిపిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఢిల్లీ శాసన సభలోని మొత్తం 70 సీట్లలో ఆరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 47 శాతం ఓట్లతో 54 నుంచి 59 సీట్లు లభిస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ 37 శాతం ఓట్లతో 9 నుండి 15 సీట్లు గెలుచుకోవచ్చుననీ, కాంగ్రెస్ పార్టీ 3.2 శాతం
ఓట్లతో 0 నుండి రెండు సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేసింది. గత శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు లభిస్తే బీజేపీ మూడు సీట్లలో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుపొందలేక ఢిల్లీలో చతికిలపడిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంటోందని వివిధ సంస్థలు జరిపిన ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
ఏబీపీ- సి-ఓటర్ జరిపిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 49 నుండి 63 సీట్లు, బీజేపీకి 5 నుండి 19 సీట్లు లభించవచ్చని స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌కు 0 నుండి 4 సీట్లు లభించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. రిపబ్లిక్ - జన్ కీ బాత్ జరిపిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ‘ఆప్’కు 48 నుండి 61 సీట్లు, బీజేపీ 9 నుండి 21 సీట్లలో విజయం సాధిస్తే కాంగ్రెస్‌కు శూన్యం లేదా ఒక సీటు లభించవచ్చు. ఇండియా న్యూస్ - నేతా జరిపిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్‌కు 53 నుండి 57 సీట్లు, బీజేపీకి 11 నుండి 18 సీట్లు, కాంగ్రెస్‌కు 0 నుండి 2 సీట్లు లభించవచ్చని అంచనా వేశాయి. ఇండియా టీవీ ప్రకారం ఆప్‌కు 44 సీట్లు, బీజేపీకి 26 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవక పోవచ్చని తెలిపింది. సుదర్శన్ న్యూస్ ప్రకారం ఆప్‌కు 40 నుండి 45 సీట్లు, బీజేపీ 24 నుండి 28 సీట్లు, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవక పోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. టైమ్స్ నౌవ్ జరిపిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్‌కు 44, బీజేపీకి 26 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
*చిత్రం... ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్